ఇండో–నేపాల్ పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ను రిమోట్‌తో ప్రారంభిస్తున్న మోదీ, ఓలీ
న్యూఢిల్లీ: నేపాల్ సర్వతోముఖాభివృద్ధిలో భారత్ మొదట్నుంచీ అండగా నిలబడుతూ వస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్–నేపాల్ మధ్య సహకారం పెరగటం ద్వారా నేపాల్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా భారత్‌తో విశ్వాసం పెంచుకునేలా సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
భారత్–నేపాల్ మధ్య గతంలో ఉన్న బలమైన సత్సంబంధాలను పునరుద్ధరించేదిశగా మోదీ, ఓలీ మధ్య శనివారం ఢిల్లీలో విస్తృతమైన చర్చలు జరిగాయి. చర్చలు అత్యంత సంతృప్తికరంగా సాగాయని భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. అనంతరం ఇరుదేశాల సరిహద్దుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వీరిద్దరూ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు.
భారత్‌తో సంబంధాలు కీలకం: ‘21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మిషన్‌తోనే ఈసారి భారత పర్యటనకు వచ్చాను. రెండు సన్నిహిత పొరుగుదేశాల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పటమే మా (భారత్–నేపాల్) ఉద్దేశం. ఇతర దేశాలతో పోలిస్తే పొరుగున ఉన్నదేశాలతో సంబంధాలు కీలకం’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా ప్రకటనలో ఓలీ అన్నారు.
కేపీ ఓలీ నేతృత్వంలో వామపక్ష పార్టీ నేపాల్‌లో అధికార పగ్గాలు చేపట్టాక భారత్‌తో సంబంధాలు బలహీనమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం పెరిగిపోతోందంటూ 2016లో ఓలీ బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ‘తాజా ఎన్నికల తర్వాత నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం వచ్చింది. దీంతో సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రస్తుతం దృష్టిపెట్టాం’ అని కోలీ తెలిపారు. కాగా, నేపాల్‌లో పర్యటించాలంటూ మోదీని ఓలీ ఆహ్వానించారు. ఈ ఏడాది మోదీ నేపాల్‌లో పర్యటించే అవకాశముంది.
వాణిజ్యలోటుపై ఓలీ ఆందోళన
నేపాల్‌లో వాణిజ్యలోటు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఓలీ.. దేశ ఎగుమతులు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నేపాల్ అభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు మోదీ సంసిద్ధత తెలిపారు. ఓలీ ‘నేపాల్ శ్రేయస్సు. నేపాల్ అభివృద్ధి’ నినాదం, తమ ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ నినాదంతో దగ్గరగా ఉందన్నారు. భారతభూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు.. భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను వ్యవస్థను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి కార్గోలు ప్రయాణించేలా జలమార్గాలను వృద్ధి చేసుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment