India-Nepal Border
-
రాష్ట్రపతి ముర్ముతో ప్రచండ భేటీ
న్యూఢిల్లీ: నేపాల్‌ను ప్రాధాన్యత గల దేశంగా భారత్ పరిగణిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. కీలక ప్రాజెక్టులను నిర్ణీత కాలంలోగా పూర్తి చేయడం సహా రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’గురువారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమేపీ వృద్ధి చెందుతు న్నాయని ముర్ము అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తరాలుగా కొనసాగుతున్న సంబంధాలు మరింతగా బలపడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అనంతరం నేపాల్ ప్రధాని ప్రచండ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. -
సరిహద్దులను రాజకీయం చేయొద్దు
న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్–నేపాల్ అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వీరు అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చింది. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దేవ్ బా కోరగా, రెండుదేశాల మధ్య ఉన్న కాపలాలేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వినియోగం చేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు కలిసి భారత్–నేపాల్ మధ్య మొట్టమొదటి బ్రాడ్‌గేజ్ రైలు మార్గాన్ని, విద్యుత్ సరఫరా లైన్‌ను, నేపాల్‌లో రూపే చెల్లింపుల వ్యవస్థను వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వేలు, విద్యుత్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపైనా సంతకాలు చేశారు. దేవ్ బా భారత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఐదోసారి పీఎం అయ్యాక ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన. చర్చల అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రింగ్లా మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యను రాజకీయం చేయడం మాని చర్చల ద్వారా బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలకు సామరస్యపూర్వక సమాధానం దొరికినట్లే, నేపాల్‌తో విభేదాలకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు. రెండు దేశాల సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ప్రచురించడంపై 2020 నుంచి వివాదం నడుస్తోంది. -
నేపాల్ కాల్పులు: భారత పౌరుడు మృతి
సీతామర్హి: భారత సరిహద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చర్యకు పాల్పడింది. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ.. నేపాల్ సైన్యం(ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన భారత పౌరులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని బిహార్‌కు చెందిన రైతు వికేశ్ యాదవ్(22)గా గుర్తించారు. గాయాలపాలైన మరో ఇద్దరిని ఠాకూర్, ఉమేశ్ రామ్‌గా గుర్తించారు. (ఎవరెస్ట్ ఎత్తుపై చైనా అభ్యంతరం) వీరినీ సితామర్హిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఇక్కడ ఇరు దేశాల ప్రజజలు తమ బంధువులను కలిసేందుకు తరచూ సరిహద్దులు దాటుతూ ఉంటారు. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మూడు ప్రాంతాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను నేపాల్ వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగంగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన వివాదానికి తెర లేపిన విషయం తెలిసిందే. (సరిహద్దు వివాదం.. నేపాల్ మరింత ముందుకు) -
నేపాల్– భారత్ మధ్య కొత్త చెక్‌పోస్ట్
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్– నేపాల్ సరిహద్దుల్లో భారత్ సాయంతో నేపాల్ నిర్మించిన ‘జోగ్బని–బిరాట్‌నగర్’ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను వీడియో లింక్ ద్వారా మంగళవారం ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ చెక్‌పోస్ట్ నిర్మాణం కోసం భారత్ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది. ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్‌పోస్ట్‌ను రూపొందించారు. 260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్నేహపూర్వక పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆ దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, విద్యావిషయక సంబంధాలు మెరుగుపడే దిశగా భారత్ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తుందన్నారు. భారత ప్రధానికి నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. -
భారత్‌తో సంబంధాలు కీలకం: ఓలీ
-
బలమైన బంధం పునరుద్ధరణకు!
న్యూఢిల్లీ: నేపాల్ సర్వతోముఖాభివృద్ధిలో భారత్ మొదట్నుంచీ అండగా నిలబడుతూ వస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్–నేపాల్ మధ్య సహకారం పెరగటం ద్వారా నేపాల్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా భారత్‌తో విశ్వాసం పెంచుకునేలా సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. భారత్–నేపాల్ మధ్య గతంలో ఉన్న బలమైన సత్సంబంధాలను పునరుద్ధరించేదిశగా మోదీ, ఓలీ మధ్య శనివారం ఢిల్లీలో విస్తృతమైన చర్చలు జరిగాయి. చర్చలు అత్యంత సంతృప్తికరంగా సాగాయని భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. అనంతరం ఇరుదేశాల సరిహద్దుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వీరిద్దరూ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. భారత్‌తో సంబంధాలు కీలకం: ‘21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మిషన్‌తోనే ఈసారి భారత పర్యటనకు వచ్చాను. రెండు సన్నిహిత పొరుగుదేశాల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పటమే మా (భారత్–నేపాల్) ఉద్దేశం. ఇతర దేశాలతో పోలిస్తే పొరుగున ఉన్నదేశాలతో సంబంధాలు కీలకం’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా ప్రకటనలో ఓలీ అన్నారు. కేపీ ఓలీ నేతృత్వంలో వామపక్ష పార్టీ నేపాల్‌లో అధికార పగ్గాలు చేపట్టాక భారత్‌తో సంబంధాలు బలహీనమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం పెరిగిపోతోందంటూ 2016లో ఓలీ బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ‘తాజా ఎన్నికల తర్వాత నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం వచ్చింది. దీంతో సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రస్తుతం దృష్టిపెట్టాం’ అని కోలీ తెలిపారు. కాగా, నేపాల్‌లో పర్యటించాలంటూ మోదీని ఓలీ ఆహ్వానించారు. ఈ ఏడాది మోదీ నేపాల్‌లో పర్యటించే అవకాశముంది. వాణిజ్యలోటుపై ఓలీ ఆందోళన నేపాల్‌లో వాణిజ్యలోటు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఓలీ.. దేశ ఎగుమతులు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నేపాల్ అభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు మోదీ సంసిద్ధత తెలిపారు. ఓలీ ‘నేపాల్ శ్రేయస్సు. నేపాల్ అభివృద్ధి’ నినాదం, తమ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతో దగ్గరగా ఉందన్నారు. భారతభూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు.. భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను వ్యవస్థను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి కార్గోలు ప్రయాణించేలా జలమార్గాలను వృద్ధి చేసుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. -
భారత సరిహద్దులో బాంబుల కలకలం
బహ్రాయిచ్(యూపీ) : భారత సరిహద్దులో గురువారం బాంబులు దొరకడంతో తీవ్రకలకలం రేగింది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఆరు బాంబులు లభ్యమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని రుపైదియా గ్రామంలో బాంబులున్నట్టు గుర్తించారు. భారత్ నేపాల్ సరిహద్దును పహారా కాసే సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) జవాన్లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సరిహద్దుల్లో అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్
జల్పాయ్గురి: భారత్–నేపాల్ సరిహద్దుల్లోని పానిటంకీలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను పోలీసులు గుర్తించారు. సిలిగురి పోలీసు కమిషనరేట్ పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దాడులు జరిపి దీనిని గుర్తించారు. దీంతో సంబంధమున్న రన్విజయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనా స్థలి నుంచి నేపాల్, భారత్‌లకు చెందిన 196 సిమ్ కార్డులు, 5 జీఎస్ఎమ్ గేట్‌వే మెషీన్లు, 4 ల్యాప్‌ట్యాప్‌లు, 3 ఓటర్ ఐడీలు, పెద్ద మొత్తంలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
మరో బీదర్.. నేపాల్
కాట్మండు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం ఉన్నప్పుడు మందుబాబులు పక్కనే ఉన్న కర్ణాటకలోని బీదర్‌కు క్యూ కట్టేవారు. ఏదో పని ఉన్నట్లుగా అక్కడకు వెళ్లి, కడుపునిండా తాగి.. కావల్సినంత రెస్టు తీసుకుని వచ్చేవాళ్లు. ఇప్పుడు బిహార్‌లోని మందుబాబులు వాళ్లకంటే రెండాకులు ఎక్కువే చదివారు. అధికారుల కళ్లుగప్పి ఏకంగా పక్కదేశం నుంచే మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో నేపాల్‌లో చీప్ లిక్కర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. నేపాల్ సరిహద్దులో ఉన్న బిహార్‌లోని మద్యం ప్రియులను లక్ష్యంగా చేసుకుని అక్కడి వర్తకులు స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. బిహార్‌లో మద్యనిషేదం అమలు తర్వాత గత వారం రోజుల్లో మద్యం అమ్మకాలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయని ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి హోటల్ యజమానులు తెలిపారు. స్థానికంగా తయారుచేసే మద్యం ధరను నేపాల్‌లోని వర్తకులు పెంచేశారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మద్యం తయారీలో నాణ్యత కూడా లోపిస్తోందని సమాచారం. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) సహా రాష్ట్రంలో మద్యం విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పూర్తి నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దీంతో బిహార్‌లోని సరిహద్దు జిల్లాల అధికారులు నేపాల్ అధికారుల సహకారాన్ని కోరారు. సరిహద్దు ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేసి మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారికి విజ్ఞప్తిచేశారు. అంతర్జాతీయ సరిహద్దు గుండా ఉన్న చిన్న చిన్న మార్గాల ద్వారా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందని, దీనికి మమ్మల్ని సహకరించాల్సిందిగా భారత అధికారులు కోరారని నేపాల్ సరిహద్దు జిల్లాకు చెందిన ముఖ్య అధికారి తోయం రాయ్ తెలిపారు.