మరో బీదర్.. నేపాల్
కాట్మండు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం ఉన్నప్పుడు మందుబాబులు పక్కనే ఉన్న కర్ణాటకలోని బీదర్‌కు క్యూ కట్టేవారు. ఏదో పని ఉన్నట్లుగా అక్కడకు వెళ్లి, కడుపునిండా తాగి.. కావల్సినంత రెస్టు తీసుకుని వచ్చేవాళ్లు. ఇప్పుడు బిహార్‌లోని మందుబాబులు వాళ్లకంటే రెండాకులు ఎక్కువే చదివారు. అధికారుల కళ్లుగప్పి ఏకంగా పక్కదేశం నుంచే మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో నేపాల్‌లో చీప్ లిక్కర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. నేపాల్ సరిహద్దులో ఉన్న బిహార్‌లోని మద్యం ప్రియులను లక్ష్యంగా చేసుకుని అక్కడి వర్తకులు స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
బిహార్‌లో మద్యనిషేదం అమలు తర్వాత గత వారం రోజుల్లో మద్యం అమ్మకాలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయని ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి హోటల్ యజమానులు తెలిపారు. స్థానికంగా తయారుచేసే మద్యం ధరను నేపాల్‌లోని వర్తకులు పెంచేశారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మద్యం తయారీలో నాణ్యత కూడా లోపిస్తోందని సమాచారం. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్) సహా రాష్ట్రంలో మద్యం విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పూర్తి నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.
దీంతో బిహార్‌లోని సరిహద్దు జిల్లాల అధికారులు నేపాల్ అధికారుల సహకారాన్ని కోరారు. సరిహద్దు ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేసి మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారికి విజ్ఞప్తిచేశారు. అంతర్జాతీయ సరిహద్దు గుండా ఉన్న చిన్న చిన్న మార్గాల ద్వారా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందని, దీనికి మమ్మల్ని సహకరించాల్సిందిగా భారత అధికారులు కోరారని నేపాల్ సరిహద్దు జిల్లాకు చెందిన ముఖ్య అధికారి తోయం రాయ్ తెలిపారు.