Prime Minister KP Sharma Oli
-
భారత్తో సంబంధాలు కీలకం: ఓలీ
-
బలమైన బంధం పునరుద్ధరణకు!
న్యూఢిల్లీ: నేపాల్ సర్వతోముఖాభివృద్ధిలో భారత్ మొదట్నుంచీ అండగా నిలబడుతూ వస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్–నేపాల్ మధ్య సహకారం పెరగటం ద్వారా నేపాల్లో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా భారత్తో విశ్వాసం పెంచుకునేలా సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. భారత్–నేపాల్ మధ్య గతంలో ఉన్న బలమైన సత్సంబంధాలను పునరుద్ధరించేదిశగా మోదీ, ఓలీ మధ్య శనివారం ఢిల్లీలో విస్తృతమైన చర్చలు జరిగాయి. చర్చలు అత్యంత సంతృప్తికరంగా సాగాయని భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. అనంతరం ఇరుదేశాల సరిహద్దుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వీరిద్దరూ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. భారత్తో సంబంధాలు కీలకం: ‘21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మిషన్తోనే ఈసారి భారత పర్యటనకు వచ్చాను. రెండు సన్నిహిత పొరుగుదేశాల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పటమే మా (భారత్–నేపాల్) ఉద్దేశం. ఇతర దేశాలతో పోలిస్తే పొరుగున ఉన్నదేశాలతో సంబంధాలు కీలకం’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా ప్రకటనలో ఓలీ అన్నారు. కేపీ ఓలీ నేతృత్వంలో వామపక్ష పార్టీ నేపాల్లో అధికార పగ్గాలు చేపట్టాక భారత్తో సంబంధాలు బలహీనమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం పెరిగిపోతోందంటూ 2016లో ఓలీ బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ‘తాజా ఎన్నికల తర్వాత నేపాల్లో రాజకీయ స్థిరత్వం వచ్చింది. దీంతో సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రస్తుతం దృష్టిపెట్టాం’ అని కోలీ తెలిపారు. కాగా, నేపాల్లో పర్యటించాలంటూ మోదీని ఓలీ ఆహ్వానించారు. ఈ ఏడాది మోదీ నేపాల్లో పర్యటించే అవకాశముంది. వాణిజ్యలోటుపై ఓలీ ఆందోళన నేపాల్లో వాణిజ్యలోటు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఓలీ.. దేశ ఎగుమతులు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నేపాల్ అభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు మోదీ సంసిద్ధత తెలిపారు. ఓలీ ‘నేపాల్ శ్రేయస్సు. నేపాల్ అభివృద్ధి’ నినాదం, తమ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతో దగ్గరగా ఉందన్నారు. భారతభూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు.. భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను వ్యవస్థను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి కార్గోలు ప్రయాణించేలా జలమార్గాలను వృద్ధి చేసుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. -
నేపాల్ ఎందుకిలా చేసింది?
కఠ్మాండు: నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి భారత పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఈ నిర్ణయానికి గల కారణాలకు కూడా ఆ దేశం వెల్లడించలేదు. పైగా 'ఇలా ఎందుకు చేశార'ని ప్రశ్నించిన భారత రాయబారిని ఉన్నపళంగా పదవి నుంచి తప్పించింది. ఈమేరకు గంటల వ్యవధిలో ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇవి నేపాల్- భారత్ సంబంధాలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. అసలు నేపాల్ ఎందుకిలా చేసింది? చైనా ఒత్తిడి తోనేనా? లేక తనకుతానుగా చైనాకు దగ్గరయ్యేందుకా? నేపాల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సోమవారం (మే 9) నుంచి ఐదురోజుల పాటు భారత్ లో పర్యటించాల్సి ఉంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి మేరకు ఇండియా రావాలనుకున్న ఆమె.. ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యనేతలను కలుసుకునేలా షెడ్యూల్ ఖరారయింది. అయితే చివరి నిమిషంలో నేపాల్ ప్రభుత్వం ఆమె పర్యటనను రద్దుచేసింది. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలి.. ఉప ప్రధాని కమల్ థాపా(ఈయన విదేశాంగ శాఖ మంత్రి కూడా), ఇతర మంత్రులతో చర్చించి అధ్యక్షురాలి పర్యటనను రద్దుచేచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని భారత రాయబారి దీప్ కుమార్ ఉపాథ్యాయకు ఫోన్ లో తెలిపారు. అప్పుడు మొదలైంది అసలు కథ.. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాయబారినైన తనకు ఒక్క మాటైనా చెప్పకుండా అధ్యక్షురాలి పర్యటన రద్దు ఎలా చేస్తారంటూ ఉపాథ్యాయ ప్రధానిని నిలదీశారు. భారత్ లో నేపాల్ సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తగవని హితవుపలికారు. దీనికి గట్టిగా బదులిచ్చిన ప్రధాని ఓలీ..'మా నిర్ణయం మీకు నచ్చకుంటే వెంటనే పదవి నుంచి తప్పుకోండి' అని అన్నారు. అనడమేకాదు, దీప్ కుమార్ ఉపాథ్యాయను వెనక్కిపిలిపించేలా తీర్మానం కూడా చేయించారు. ఓలీ ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకోవడం, ప్రభుత్వాన్ని ఓవర్ టేక్ చేసేలా ప్రవర్తించడం వల్లే ఉపాధ్యాయను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం రాత్రి విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఉపాథ్యాయపై స్వదేశంలో మాదేశీలను రెచ్చగొట్టి ఉద్యామాలు చేయించారనీ ఓలీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాదేశీ ఉద్యమం సమయంలో భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తడం, భారత్ నుంచి నేపాల్ కు నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడం వెనకుక కూడా ఉపాథ్యాయ హస్తం ఉందని ఓలీకి బలమైన నమ్మకం. భారత్ సరుకుల రవాణాను నిలిపివేయడంతో అప్పటికప్పుడు చైనా 3000 ట్రక్కులతో పాలు, కూరగాయలు తదితర సరుకులను నేపాల్ కు పంపి మెప్పుపొందింది. తర్వాతి కాలంలోనూ తమ దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు, ఇతరత్రా కీలక అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ చైనా కంపెనీలకు కట్టబెడుతోంది నేపాల్ ప్రభుత్వం. తాజాగా అధ్యక్షురాలి భారత పర్యటన రద్దు కూడా చైనా మెప్పుపొందేందుకేనని తెలుస్తోంది. ఈ దశలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.