నేపాల్ ఎందుకిలా చేసింది?
కఠ్మాండు: నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి భారత పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఈ నిర్ణయానికి గల కారణాలకు కూడా ఆ దేశం వెల్లడించలేదు. పైగా 'ఇలా ఎందుకు చేశార'ని ప్రశ్నించిన భారత రాయబారిని ఉన్నపళంగా పదవి నుంచి తప్పించింది. ఈమేరకు గంటల వ్యవధిలో ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇవి నేపాల్- భారత్ సంబంధాలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. అసలు నేపాల్ ఎందుకిలా చేసింది? చైనా ఒత్తిడి తోనేనా? లేక తనకుతానుగా చైనాకు దగ్గరయ్యేందుకా?
నేపాల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సోమవారం (మే 9) నుంచి ఐదురోజుల పాటు భారత్ లో పర్యటించాల్సి ఉంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి మేరకు ఇండియా రావాలనుకున్న ఆమె.. ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యనేతలను కలుసుకునేలా షెడ్యూల్ ఖరారయింది. అయితే చివరి నిమిషంలో నేపాల్ ప్రభుత్వం ఆమె పర్యటనను రద్దుచేసింది. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలి.. ఉప ప్రధాని కమల్ థాపా(ఈయన విదేశాంగ శాఖ మంత్రి కూడా), ఇతర మంత్రులతో చర్చించి అధ్యక్షురాలి పర్యటనను రద్దుచేచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని భారత రాయబారి దీప్ కుమార్ ఉపాథ్యాయకు ఫోన్ లో తెలిపారు. అప్పుడు మొదలైంది అసలు కథ..
విశ్వసనీయ సమాచారం మేరకు.. రాయబారినైన తనకు ఒక్క మాటైనా చెప్పకుండా అధ్యక్షురాలి పర్యటన రద్దు ఎలా చేస్తారంటూ ఉపాథ్యాయ ప్రధానిని నిలదీశారు. భారత్ లో నేపాల్ సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తగవని హితవుపలికారు. దీనికి గట్టిగా బదులిచ్చిన ప్రధాని ఓలీ..'మా నిర్ణయం మీకు నచ్చకుంటే వెంటనే పదవి నుంచి తప్పుకోండి' అని అన్నారు. అనడమేకాదు, దీప్ కుమార్ ఉపాథ్యాయను వెనక్కిపిలిపించేలా తీర్మానం కూడా చేయించారు. ఓలీ ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకోవడం, ప్రభుత్వాన్ని ఓవర్ టేక్ చేసేలా ప్రవర్తించడం వల్లే ఉపాధ్యాయను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం రాత్రి విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
నేపాలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఉపాథ్యాయపై స్వదేశంలో మాదేశీలను రెచ్చగొట్టి ఉద్యామాలు చేయించారనీ ఓలీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాదేశీ ఉద్యమం సమయంలో భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తడం, భారత్ నుంచి నేపాల్ కు నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడం వెనకుక కూడా ఉపాథ్యాయ హస్తం ఉందని ఓలీకి బలమైన నమ్మకం. భారత్ సరుకుల రవాణాను నిలిపివేయడంతో అప్పటికప్పుడు చైనా 3000 ట్రక్కులతో పాలు, కూరగాయలు తదితర సరుకులను నేపాల్ కు పంపి మెప్పుపొందింది. తర్వాతి కాలంలోనూ తమ దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు, ఇతరత్రా కీలక అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ చైనా కంపెనీలకు కట్టబెడుతోంది నేపాల్ ప్రభుత్వం. తాజాగా అధ్యక్షురాలి భారత పర్యటన రద్దు కూడా చైనా మెప్పుపొందేందుకేనని తెలుస్తోంది. ఈ దశలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.