ambassador to India
-
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్..!
వాషింగ్టన్ : భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని (51) అధ్యక్షుడు జో బైడెన్ పునర్నియమించారు. ఎరిక్ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్‌లో సెనేట్ ఆమోదించాల్సి ఉంది. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో 2021 జులైలో ఎరిక్‌ను భారత రాయబారిగా నియమించినప్పుడు అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాసిటీ అడ్డుకున్నారు. మరోవైపు తన పాలనా విభాగంలోని కీలక పదవుల్లో అరడజనుకిపైగా ఇండియన్ అమెరికన్లను బైడెన్ మంగళవారం రీ నామినేట్ చేశారు. బైడెన్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ పదవికి రిచర్డ్ వర్మ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతినిధిగా డాక్టర్ వివేక్ హాలెగెరె మూర్తి (45)ని రీ నామినేట్ చేస్తూ సెనేట్ ఆమోదానికి పంపించారు. వీరే కాకుండా ప్రవాస భారతీయులైన అంజలి చతుర్వేది, రవి చౌధరి, గీతా రావు గుప్తా, రాధా అయ్యంగార్లను ప్రభుత్వంలో వివిధ పదవులకు రీ నామినేట్ చేస్తూ సెనేట్‌కు పంపించారు. -
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీ !
వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజలస్ మేయర్‌గా పని చేస్తున్న ఎరిక్ గార్సెటీని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించేందుకు అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బైడెన్ గురువారం ఖరారు చేసినట్లు ఎరిక్ వెల్లడించారు. సెనేట్ ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తే భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం భారత్‌లో అమెరికా రాయబారిగా ట్రంప్ ప్రభుత్వం నియమించిన కెనెత్ జస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల ఎరిక్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు. దాదాపు 12 ఏళ్ల పాటు లాస్ ఏంజలస్ సిటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు. అందులో ఆరేళ్ల పాటు కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2013 నుంచి లాస్ ఏంజలస్ నగర మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్ గురించి స్పందిస్తూ.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తన నియామకం జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో ఆయన భారత్‌లో ఏడాది పాటు ఉండి హిందీ, ఉర్దూ భాషలపై అధ్యయనం కూడా చేశారు. -
మీరు వెంటనే వెనక్కి రండి!
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ.. నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో ఆస్ట్రియాలోని భారత రాయబారి రేణూ పాల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే వెనక్కి పిలిచింది. రేణూ పాల్‌ను అర్ధంతరంగా వెనక్కి పిలిపించడానికి ముఖ్యంగా.. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే ప్రధానకారణంగా తెలుస్తోంది. 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రేణూ పాల్ ఆస్ట్రియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరో నెలరోజుల్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. కేవలం తన ఇంటి అద్దె కోసం నెలకు రూ.15 లక్షల నిధులు ఖర్చు చేసినట్టు గుర్తించారు. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూ దేశాయ్ దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. శాఖాపరమైన అనుమతులు తీసుకున్నట్లు తప్పుగా చూపించి పెద్ద ఎత్తున వ్యాట్ రీఫండ్లు చేసుకున్నారని వీరి నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆమెను డిసెంబర్ 30వ తేదీలోగా భారత్‌కు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీచేసింది. మరో నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీకి బదిలీ చేయడంతో పాటు.. ఆర్థిక అధికారాలపైనా కోత విధించడం గమనార్హం. -
భారత్‌లో నేపాల్ రాయబారిగా నీలాంబర్
ఖాట్మండు: నేపాల్ మాజీ న్యాయశాఖ మంత్రి నీలాంబర్ ఆచార్య భారత్‌లో ఆ దేశరాయ బారిగా నియమితులయ్యారు. సుమారు ఏడాదిన్నరగా భారత్‌లో నేపాల్ రాయబారిని నియ మించలేదు. రాయబారిగా ఉన్న దీప్‌కుమార్ ఉపాధ్యాయ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లడంతో స్థానం ఖాళీ అయింది. ఆదివారం ఖాట్మండ్‌లో రాష్ట్రపతి బిద్యాదేవి భండారి నీలాంబర్ ఆచార్యతో ప్రమాణం చేయించారు. భారత్‌లో రాయబారిగా నియమితులవ్వడంపై ఆచార్యకు అభినందనలు తెలిపారు. గతంలో రాయబారిగా నియమితులైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించేవారు. ఆచార్య మాస్కో వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదట్లో వామపక్ష భావజాలంతో ఉన్నా తర్వాత నేపాలీ కాంగ్రెస్‌లో చేరారు. 1990లో తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, సామాజిక సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. -
వైరల్... బాలీవుడ్ అంటే మాకూ ప్రేమే!
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికాకు భారత దేశానికి మధ్య బంధం ఎంత బలంగా ఉంటుందో తెలియంది కాదు. కీలక ఒప్పందాలతో ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికన్ల నోట బాలీవుడ్ డైలాగులు చెబితే ఎలా ఉంటుందోనన్న ఓ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం తన ట్విట్టర్లో నిన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎంబసీ అధికారులంతా కలిసి బాలీవుడ్ అడిషన్లకు హాజరైతే ఎలా ఉంటుంది అన్నదే ఆ వీడియో. కళాఖండ చిత్రం ‘షో’లోని గబ్బర్ సింగ్ నోటి నుంచి వచ్చే పాపులర్ డైలాగ్ అరే వో సాంబా కిత్నే ఆద్మీ తే.. డైలాగును ఓ పెద్దాయన కిత్నే ఆద్మీ తే అంటూ కొరడా ఝుళిపించి చెప్పారు. ఇక షారూఖ్ ఓం శాంతి ఓం లోని ఏక్ చుట్కీ సింధూర్ డైలాగ్‌ను ఓ మహిళా ఉద్యోగితో చెప్పించారు. నమక్ హలాల్, దీవార్ చిత్రాల్లోని పాపులర్ డైలాగులను కూడా వాళ్లు అవలీలగా చెప్పేశారు. వీ లవ్ బాలీవుడ్ అంటూ ఫన్నీ అడిషన్ వీడియోను యూఎస్ఇండియాదోస్తీ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పాపం హిందీ డైలాగులు చెప్పేందుకు వాళ్లు పడ్డ కష్టాన్ని గుర్తించిన పలువురు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూనే.. నెక్స్ట్ తమిళ డైలాగులు.. అది కూడా రజనీ స్టైల్లో చెప్పండంటూ సలహాలిస్తున్నారు. -
నేపాల్ ఎందుకిలా చేసింది?
కఠ్మాండు: నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి భారత పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఈ నిర్ణయానికి గల కారణాలకు కూడా ఆ దేశం వెల్లడించలేదు. పైగా 'ఇలా ఎందుకు చేశార'ని ప్రశ్నించిన భారత రాయబారిని ఉన్నపళంగా పదవి నుంచి తప్పించింది. ఈమేరకు గంటల వ్యవధిలో ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇవి నేపాల్- భారత్ సంబంధాలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. అసలు నేపాల్ ఎందుకిలా చేసింది? చైనా ఒత్తిడి తోనేనా? లేక తనకుతానుగా చైనాకు దగ్గరయ్యేందుకా? నేపాల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సోమవారం (మే 9) నుంచి ఐదురోజుల పాటు భారత్ లో పర్యటించాల్సి ఉంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి మేరకు ఇండియా రావాలనుకున్న ఆమె.. ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యనేతలను కలుసుకునేలా షెడ్యూల్ ఖరారయింది. అయితే చివరి నిమిషంలో నేపాల్ ప్రభుత్వం ఆమె పర్యటనను రద్దుచేసింది. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలి.. ఉప ప్రధాని కమల్ థాపా(ఈయన విదేశాంగ శాఖ మంత్రి కూడా), ఇతర మంత్రులతో చర్చించి అధ్యక్షురాలి పర్యటనను రద్దుచేచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని భారత రాయబారి దీప్ కుమార్ ఉపాథ్యాయకు ఫోన్ లో తెలిపారు. అప్పుడు మొదలైంది అసలు కథ.. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాయబారినైన తనకు ఒక్క మాటైనా చెప్పకుండా అధ్యక్షురాలి పర్యటన రద్దు ఎలా చేస్తారంటూ ఉపాథ్యాయ ప్రధానిని నిలదీశారు. భారత్ లో నేపాల్ సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తగవని హితవుపలికారు. దీనికి గట్టిగా బదులిచ్చిన ప్రధాని ఓలీ..'మా నిర్ణయం మీకు నచ్చకుంటే వెంటనే పదవి నుంచి తప్పుకోండి' అని అన్నారు. అనడమేకాదు, దీప్ కుమార్ ఉపాథ్యాయను వెనక్కిపిలిపించేలా తీర్మానం కూడా చేయించారు. ఓలీ ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకోవడం, ప్రభుత్వాన్ని ఓవర్ టేక్ చేసేలా ప్రవర్తించడం వల్లే ఉపాధ్యాయను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం రాత్రి విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఉపాథ్యాయపై స్వదేశంలో మాదేశీలను రెచ్చగొట్టి ఉద్యామాలు చేయించారనీ ఓలీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాదేశీ ఉద్యమం సమయంలో భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తడం, భారత్ నుంచి నేపాల్ కు నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడం వెనకుక కూడా ఉపాథ్యాయ హస్తం ఉందని ఓలీకి బలమైన నమ్మకం. భారత్ సరుకుల రవాణాను నిలిపివేయడంతో అప్పటికప్పుడు చైనా 3000 ట్రక్కులతో పాలు, కూరగాయలు తదితర సరుకులను నేపాల్ కు పంపి మెప్పుపొందింది. తర్వాతి కాలంలోనూ తమ దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు, ఇతరత్రా కీలక అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ చైనా కంపెనీలకు కట్టబెడుతోంది నేపాల్ ప్రభుత్వం. తాజాగా అధ్యక్షురాలి భారత పర్యటన రద్దు కూడా చైనా మెప్పుపొందేందుకేనని తెలుస్తోంది. ఈ దశలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.