రాజరికం కోసం.. అట్టుడుకుతున్న నేపాల్‌ | Nepal PM Emergency Cabinet Meeting To Arrest Former King Gyanendra Shah Over Kathmandu Violence | Sakshi
Sakshi News home page

Nepal Political Crisis: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?

Published Sat, Mar 29 2025 11:21 AM | Last Updated on Sat, Mar 29 2025 1:54 PM

Nepal Political Crisis Arrest Former King Gyanendra Shah

ఖాట్మండు: నేపాల్‌(Nepal)లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్  అంతకంతకూ ఉధృతమవుతోంది. ఈ నేపధ్యంలో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో హింస చెలరేగి, ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పరిస్థితిని  చక్కదిద్దేందుకు హోం మంత్రిత్వ శాఖ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ హింసాయుత ఘటనలకు మాజీ రాజు జ్ఞానేంద్ర షానే కారణమని ఆరోపిస్తూ, ఆయనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.

ఇటీవల ఖాట్మండులోని పలు ప్రాంతాలలో రాచరిక మద్దతుదారులు, భద్రతా దళాల(Security forces) మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు  బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇంతలో ఆందోళనకారులు ఒక వాణిజ్య సముదాయం, ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం, ఒక మీడియా హౌస్ భవనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో 12 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.

ఈ హింసాయుత ఘటనలను నివారించేందుకు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి(Nepal Prime Minister KP Sharma Oli) అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాట్మండులో జరుగుతున్న హింసకు మాజీ రాజు జ్ఞానేంద్ర షాను బాధ్యునిగా చేసి, ఆయనను అరెస్టు చేయాలనే ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. జ్ఞానేంద్ర షా అరెస్టుకు సంబంధించి భద్రతా అధిపతుల అభిప్రాయాన్ని సేకరించడానికి, తదనంతర పరిణామాలను అంచనా వేయడానికి చర్చలు జరుగుతున్నాయని క్యాబినెట్ మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు. ఖాట్మండులో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

చెలరేగిన హింస.. ఇద్దరు మృతి
రాజధాని ఖాట్మండులోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రాళ్లు రువ్వారు. అలాగే దుకాణాలను దోచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ భవనం వైపు రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో జరిగిన ఘర్షణల్లో 112 మంది గాయపడ్డారు. ఒక టెలివిజన్ కెమెరామెన్‌తోపాటు ఒక నిరసనకారుడు మృతిచెందాడని అధికారులు తెలిపారు. పరిస్థితిని  అదుపులోనికి తెచ్చేందుకు సైన్యాన్ని మోహరిస్తున్నారు.

2008లో రాచరికాన్ని రద్దు చేసి నేపాల్‌లో లౌకిక, సమాఖ్య, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఇటీవలి కాలంలో రాచరికం పునరుద్ధరణ డిమాండ్  అంతకంతకూ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ అవినీతి, ఆర్థిక అస్థిరత, తరచూ ప్రభుత్వాలు మారడంపై ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ప్రజల నుంచి మద్దతు కోరారు. ఇది ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీని తరువాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి. 2008 నుండి నేపాల్‌లో 13 ప్రభుత్వాలు మారాయి. అయినా రాజకీయ స్థిరత్వం ఏర్పడలేదు.

ఇది కూడా చదవండి: World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement