సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం డీలర్లు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా 31న చమురు సంస్థల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు చేయకుండా నిరసన పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ నేత వినయ్ కుమార్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కమీషన్ 5 శాతం ఇవ్వాలని, పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన మరుగు దొడ్ల నిర్వహణ బాధ్యతలను చమురు సంస్థల ద్వారా థర్డ్‌పార్టీకి అప్పగించాలని, దేశవ్యాప్తంగా ఒకే ధరలను అమలు చేయాలని, ధరల హెచ్చు తగ్గులతో జరిగిన నష్టాన్ని చమురు సంస్థలు భరించి డీలర్లకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని, కొత్త ఔట్‌లెట్ ప్రారంభంలో సమీప బంకులపై ప్రభావం చూపకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని, స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరుపుతామని, ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.