సాక్షి, హైదరాబాద్ : ఈనెల 31న ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. చాలా కాలం నుంచి డీలర్ మార్జిన్ పెంచాలని కోరుతున్నా కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఈ రకంగా నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సంఘం వెల్లడించింది. అయితే వినియోగ దారులకు పెట్రోల్, డీజిల్ అందించడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుం టామని స్పష్టం చేసింది.
2017 నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగినా తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని పేర్కొంది. తమ పెట్టుబడులు, ఖర్చులు పెరిగినా కంపెనీలు ‘డీలర్ మార్జిన్’ పెంచకపోవడం, పెట్రోలియం ఉత్పత్తులపై అకస్మాత్తుగా పన్నుల్లో మార్పు వంటి అంశాలతో తమకు సమస్యలు ఎదురవుతున్నాయని డీలర్ల సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్‌రెడ్డి శుక్రవారం హెచ్‌పీసీఎల్ రాష్ట్ర సమన్వయకర్త యతేంద్ర పాల్‌సింగ్‌కి లేఖ రాశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే మున్ముందు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే బంక్‌లు తెరిచి ఉంచడం వంటి చర్యలు చేపడతామని అమరేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment