తెలంగాణ: పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌.. భారీ క్యూలు! | Telangana: No Stock Boards At Petrol Refilling Stations | Sakshi
Sakshi News home page

తెలంగాణ: పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌.. భారీ క్యూలు! కారణం ఏంటంటే..

Published Wed, Jun 22 2022 1:59 AM | Last Updated on Wed, Jun 22 2022 7:02 AM

Telangana: No Stock Boards At Petrol Refilling Stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత తీవ్రమవు తోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయకుండా చమురు సంస్థలు వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం దరిమిలా పెరిగిన క్రూడాయిల్‌ ధరలకు అనుగుణంగా రిటైల్‌గా పెట్రోల్, డీజిల్‌ ధరలను భారీ స్థాయిలో పెంచుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తుండడం, వాణిజ్య పరంగా వినియోగించే బల్క్‌ డీజిల్‌ను ఆయా సంస్థలు ఎక్కువ ధర కారణంగా తమవద్ద తీసుకోకుండా రిటైల్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుండటంతో చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే కోటాను తగ్గిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇండెంట్‌పై 25 నుంచి 40 శాతం వరకు కోత విధించి పెట్రోల్, డీజిల్‌ సరఫరా చేస్తున్నట్లు డీలర్లు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ ధాని శివార్లతో పాటు జిల్లా కేంద్రాల్లోని చాలా పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్‌ ఉన్న బంకుల్లో వినియోగదారులు క్యూ కడుతున్నారు. తొలుత పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉన్న రాజధాని శివారు బంకుల వద్ద బంకుల్లో డీజిల్‌ కొరత మొదలు కాగా, క్రమంగా పెట్రోల్‌ కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంకులతో పాటు జిల్లా కేంద్రాల్లోని బంకుల్లోనూ కొరత కనిపిస్తోంది.

ఫిబ్రవరి నుంచి బల్క్‌ డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచే యడంతో టీఎస్‌ ఆర్టీసీతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఫార్మా కంపెనీలు డీజిల్‌ను ఓపెన్‌ మార్కెట్‌లో రిటైల్‌ బంకుల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. ఇలా బల్క్‌ డీజిల్‌ కొనుగోళ్లు తగ్గడంతో వాటిల్లుతున్న నష్టాన్ని తగ్గించుకునేందుకు రిటైల్‌ బంకుల కోటా కు చమురు సంస్థలు కోత పెడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు.  

రెండేళ్ల క్రితం ఇండెంట్‌ మేరకు సరఫరా: రాష్ట్రంలో మూడు చమురు సంస్థలకు చెందిన 7 డిపోలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా 3,520 పెట్రోల్‌ బంకులకు ప్రతిరోజు సుమారు 50 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్,  87 లక్షల లీటర్లకు పైగా డీజిల్‌ డిమాండ్‌ ఉంది. ఇందులో సుమారు 60 శాతం వినియోగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటుంది. కాగా ప్రస్తుతం 60 శాతం నుంచి 75 శాతం కోటాను కూడా పంపిం చడం లేదని, ఎప్పటికప్పుడు డీజిల్, పెట్రోల్‌ డిమాండ్‌ పెరుగుతుండగా, రెండేళ్ల క్రితం నాటి ఇండెంట్‌ అనుసరించి ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేస్తున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు.

మూడు ఆయిల్‌ కంపెనీలు కరోనా కంటే ముందు నాటి అమ్మకాలను పరిగణనలోకి తీసుకొని కోటా అమలు చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత ఇండెంట్‌తో నిమిత్తం లేకుండా పాత ఇండెంట్‌ ప్రకారం అందులో 25 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్‌కు విడివిడిగా 20 వేల లీటర్ల చొప్పున ఇండెంట్‌ పెడితే రెండు కలిపి 20 వేల లీటర్లు సరఫరా చేస్తున్నారని ఓ డీలర్‌ తెలిపారు.

ఒక బంక్‌లో నాలుగు చమురు కంపార్టుమెంటులు ఉంటే ఒకే కంపార్ట్‌మెంటుకు మాత్రమే సరఫరా చేస్తుండడంతో కొరత పెరిగిందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో శివార్లతో పాటు జిల్లాల్లో కూడా రెండురోజులకోసారి బంకులు మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి పెట్రోల్‌ విషయంలో ‘బల్క్‌’ సమస్య లేనప్పటికీ పెట్రోల్‌ కోటాను కూడా కంపెనీలు తగ్గించి పంపుతున్నాయి. 

ఉద్దర లేదు..: గతంలో పెట్రోల్‌ బంకులకు సరఫరా చేసిన చమురుకు 3 నెలల వరకు క్రెడిట్‌ ఆప్షన్‌ ఉండేది. అయితే గత మూడు నెలల నుంచి ఆయిల్‌ కంపెనీలు ముందుగా డీడీ చెల్లించి ఇండెం ట్‌ పెడితేనే చమురును సరఫరా చేస్తున్నాయి. అలాగే పాత బకాయిలు చెల్లించని డీలర్లకు సరఫరా నిలిపివేశాయి. దీనివల్ల కూడా చాలాచోట్ల బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు కన్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కోటా తగ్గించడంలో భాగంగానే చమురు కంపెనీలు డీడీలను తప్పనిసరి చేశాయని డీలర్లు ఆరోపిస్తున్నారు.  

ప్రైవేటు పెట్రోల్‌ బంకులు మూత: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ ధరల సవరణలు, ఎక్సైజ్‌ డ్యూటీల తగ్గింపు వల్ల ప్రభుత్వ కంపెనీల ధరలు ప్రస్తుతం పెట్రోల్‌ రూ.109.64 ఉండగా, డీజిల్‌ రూ. 97.80గా ఉంది. కానీ నయారా/ఎస్సార్‌ రేట్లు వరుసగా రూ.111.93, రూ.98.58 గా ఉన్నాయి. ఇక జియో –బీపీ పెట్రోల్‌ ధర రూ. 116.77 కాగా, డీజిల్‌ రూ.102.86గా ఉంది. దీంతో వినియోగదారులు ఈ బంకుల వైపు వెళ్లకపోవడంతో ఇవన్నీ దాదాపుగా మూతపడ్డాయి. ఇక బల్క్‌ డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.128గా ఉంది. 

బల్క్‌కు నై..రిటైల్‌కు సై: టీఎస్‌ ఆర్టీసీ తనకు చెందిన డిపోలలోని బంకుల ద్వారా ప్రతిరోజు 5 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగించేది. అయితే మార్చిలో బల్క్‌ డీజిల్‌ ధరను లీటర్‌ మీద రూ.25 నుంచి రూ.30 వరకు పెంచడంతో ఆర్టీసీ సొంత బంకులను మూసివేసింది. ప్రతిరోజు మూడు సొంత పెట్రోల్‌ బంకుల ద్వారా 20 వేల లీటర్లకు పైగా డీజిల్‌ వినియోగించే జీహెచ్‌ఎంసీ కూడా చెత్త వాహనాలను రాంకీకి అప్పగించి, ఇతర వాహనాలకు రిటైల్‌గానే డీజిల్‌ కొనుగోలు చేస్తోంది.  

రాష్ట్రంలో చమురు కొరత లేదు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదు. 3 రోజులకు సరపడా నిల్వలు ఎప్పుడూ మెయిన్‌టైన్‌ అవుతున్నాయి. అనవసర ప్రచారం వల్ల షార్టేజ్‌ ఏర్పడుతుందేమో తెలియదు. బల్క్‌ డీజిల్‌ కొనుగోలుదారులు రిటైల్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. బంకుల్లో 20 శాతం అమ్మకాలు పెరిగాయి.  
– మంగీలాల్, ఆయిల్‌ కంపెనీస్‌ స్టేట్‌ లెవల్‌ కోఆర్డినేటర్‌  

బల్క్‌ కొనుగోళ్లు లేకే డీలర్ల కోటా తగ్గింపు   
బల్క్‌ డీజిల్‌ ధర ఎక్కువగా ఉండటంతో పలు సంస్థలు రిటైల్‌గా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో చమురు సంస్థలకు నష్టం వాటి ల్లుతోంది. దీన్ని అధిగమించేందుకే 3 నెలలుగా రిటైల్‌ కోటాను తగ్గించాయి. కోవిడ్‌ సమయంలో ఫార్మాసిటీకి డీజిల్‌పై రూ.28 తగ్గించి సరఫరా చేశారు. కానీ ఇప్పుడు దాదాపుగా అంతే మొత్తం ఎక్కువ పెట్టి ఆ సంస్థ బల్క్‌ డీజిల్‌ కొనుగోలు చేయడం లేదు. కేంద్రం బల్క్‌ డీజిల్‌ లైసెన్స్‌ ఉన్నవాళ్లు విధిగా వాళ్ల కోటా మేర కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. – డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్‌ రెడ్డి 

‘ఢీ’జిల్‌
గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. డీజిల్‌ కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. బంకుల్లో సరిపడా డీజిల్‌ దొరకట్లేదు. దీంతో స్టాకు రాగానే.. ఒక్కసారిగా ఎగబడుతున్నారు. మంగళవారం రాత్రి తిరుమలగిరిలోని బంకు వద్ద కనిపించిన దృశ్యమిది.     
– తిరుమలగిరి(తుంగతుర్తి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement