Petroleum Dealers
-
31న పెట్రో ఉత్పత్తులు కొనుగోలు చేయం
సాక్షి, హైదరాబాద్ : ఈనెల 31న ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. చాలా కాలం నుంచి డీలర్ మార్జిన్ పెంచాలని కోరుతున్నా కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఈ రకంగా నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సంఘం వెల్లడించింది. అయితే వినియోగ దారులకు పెట్రోల్, డీజిల్ అందించడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుం టామని స్పష్టం చేసింది. 2017 నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగినా తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని పేర్కొంది. తమ పెట్టుబడులు, ఖర్చులు పెరిగినా కంపెనీలు ‘డీలర్ మార్జిన్’ పెంచకపోవడం, పెట్రోలియం ఉత్పత్తులపై అకస్మాత్తుగా పన్నుల్లో మార్పు వంటి అంశాలతో తమకు సమస్యలు ఎదురవుతున్నాయని డీలర్ల సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్‌రెడ్డి శుక్రవారం హెచ్‌పీసీఎల్ రాష్ట్ర సమన్వయకర్త యతేంద్ర పాల్సింగ్కి లేఖ రాశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే మున్ముందు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే బంక్‌లు తెరిచి ఉంచడం వంటి చర్యలు చేపడతామని అమరేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూత
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు మూతపడబోతున్నాయి. మెరుగైన మార్జిన్లు, జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తుల తీసుకురావడం, డీలర్ల కమీషన్ పెంపు వంటి పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్టు యునిటెడ్ పెట్రోలియం ఫ్రంట్(యూపీఎఫ్) ప్రకటించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే అక్టోబర్ 27 నుంచి పెట్రోలియం ఉత్పత్తులు కొనడం, అమ్మడం ఆపివేసి, నిరవధిక బంద్‌కు కూడా దిగుతామని హెచ్చరించింది. ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న తమ ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్లు, డీలర్ల అసోసియేషన్, కన్సోర్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్లు తెలిపాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీలర్ల మార్జిన్లను సమీక్షించడం, పెట్టుబడులపై మెరుగైన రిటర్నులు పొందడం, మానవ శక్తి సమస్యలను పరిష్కరించడం వంటి డిమాండ్లను పెట్రోలియం డీలర్లు ఎప్పడినుంచో అభ్యర్థిస్తున్నారు. రోజు వారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పిన పెట్రోలియం శాఖ ఇప్పటికీ విధివిధానాలను రూపొందించలేదని అసోసియేషన్లు పేర్కొన్నాయి. -
పెట్రోల్ బంకుల బంద్
దేశంలోని పెట్రోల్ డీలర్స్ ..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లనుంచి గురువారం రోజు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నవంబరు 15న దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు గురువారం కొనుగోళ్ల నిలిపి వేత బంద్ ను, నవంబర్ 15న పూర్తి బంద్ ను పాటిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి సారాదిందు పాల్ చెప్పారు. అలాగే ప్రస్తుతం 3 శాతంగా ఉన్న డీలర్ల కమిషన్ ను 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 53,500 పెట్రోల్ పంపులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కొనసాగుతున్న ఆందోళన భాగంగా డీలర్లు ఇప్పటికే "బ్లాకౌట్" నిరసన కార్యక్రమాన్ని అక్టోబర్ 19 , 26 తేదీల్లో 7-7.15 గంటల మధ్య 15 నిమిషాలు చేపట్టినట్టు చెప్పారు. -
31న పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం డీలర్లు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా 31న చమురు సంస్థల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు చేయకుండా నిరసన పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ నేత వినయ్ కుమార్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కమీషన్ 5 శాతం ఇవ్వాలని, పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన మరుగు దొడ్ల నిర్వహణ బాధ్యతలను చమురు సంస్థల ద్వారా థర్డ్‌పార్టీకి అప్పగించాలని, దేశవ్యాప్తంగా ఒకే ధరలను అమలు చేయాలని, ధరల హెచ్చు తగ్గులతో జరిగిన నష్టాన్ని చమురు సంస్థలు భరించి డీలర్లకు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, కొత్త ఔట్లెట్ ప్రారంభంలో సమీప బంకులపై ప్రభావం చూపకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని, స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరుపుతామని, ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.