హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవటం, తరచూ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఓ రిహాబిలిటేషన్ (పునరావాస) కేంద్రానికి తీసుకెళ్లారు. విద్యార్థిని పరిశీలించిన నిపుణులు.. ఆ అబ్బాయి పెట్రోల్ వాసనకు బానిసయ్యాడని చెప్పారు.
దాంతో వారు విస్తుపోయారు. పెట్రోల్ వాసన పీల్చడమేంటని ప్రశ్నించగా.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఆ అబ్బాయి డ్రగ్స్‌కు ప్రత్యామ్నాయంగా పెట్రోల్ వాసన పీల్చుతున్నట్లు చెప్పారు. రోజూ ఖర్చీఫ్‌లో ఐదారు చుక్కల పెట్రోల్‌ను పోసుకొని అవసరమైనప్పుడల్లా పీల్చుతూ.. మత్తులో జోగుతున్నట్లు తేల్చేశారు.
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా 8, ఆపై తరగతి పిల్లల్లో ఈ దురలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా పెట్రోల్‌తో పాటు నొప్పి తగ్గించే కొన్ని నూనెలు, మందులు (పెయిన్ కిల్లర్స్), జిగురు, వైట్‌నర్ వంటివి వాడుతున్నారు. కొందరు ఎడిబుల్ (తినదగిన) డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఈ విధంగా మాదక ద్రవ్యాలకు బానిసలైన వందకు పైగా విద్యార్థులు ప్రస్తుతం రిహాబిలిటేషన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురు బాలికలు కూడా ఉండటం గమనార్హం.
తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం
పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వటం మాత్రమే కాదు దాన్ని ఎలా వినియోగిస్తున్నారో చూడటం కూడా తల్లిదండ్రుల బాధ్యత. కరోనా తర్వాతి నుంచి స్కూల్ విద్యార్థులలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. అయితే వీరు ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఎలాంటి సైట్లను చూస్తున్నారు? ఏ సమాచారాన్ని తెలుసుకుంటున్నారో తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో ఏ వస్తువులు కొనుగోలు చేస్తున్నారో పర్యవేక్షించాలని అంటున్నారు. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడితే ఏ తరహా ఆటలాడుతున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే పిల్లలు చెడిపోయేందుకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చినట్టేనని స్పష్టం చేస్తున్నారు.
సొంతంగా ఎడిబుల్ డ్రగ్స్ తయారీ, విక్రయం!
గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన మాజీ విద్యార్థిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ మీద మంచి పట్టున్న ఈ విద్యార్థి.. సొంతంగా హాష్ ఆయిల్, గంజాయితో ఎడిబుల్ (తినదగిన) డ్రగ్స్‌ను తయారు చేయడం నేర్చుకున్నాడు. చాక్లెట్లు, వేఫర్ల వంటి బేకరీ ఉత్పత్తులను కరిగించి హాష్ ఆయిల్‌ను కలిపి ఎండబెట్టి తిరిగి చాక్లెట్ల లాగా తయారు చేసి, ప్యాకింగ్ చేస్తున్నాడు.
గేటెడ్ కమ్యూనిటీలలోని గ్రూపులు, వివిధ సామాజిక మాధ్యమాల గ్రూప్‌ల్లో చేరి, అందులోని స్కూల్ విద్యార్థులకు వీటి గురించి ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నాడు. ఇల్లు, పాఠశాల ఆవరణలో ఈ చాక్లెట్లను తింటే తల్లిదండ్రులు, టీచర్లు గమనిస్తారని.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్ వంటి క్రీడల శిక్షణ సమయంలో పిల్లలు వీటిని వినియోగిస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ర్యాపిడో, డుంజో వంటి బైక్ సర్వీస్‌ల ద్వారా బుకింగ్ చేసి తెప్పించుకుంటున్నారని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులైతే పార్టీ మూడ్‌ను మరింత పెంచేందుకు, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో బయటపడింది.
ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే..
►ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అవుతారు. ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తుంటారు.
►రాత్రివేళ సరిగ్గా నిద్ర పోరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు.
►శరీర బరువుగా క్రమంగా తగ్గుతుంటుంది. కళ్లు ఎర్రగా మారతాయి. తరచుగా కంటి చుక్కల మందులు వినియోగిస్తుంటారు.
►ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో చాలా ఉత్సాహంగా ఉంటారు.
►కోడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తుంటారు.
చాక్లెట్లయితే హాని చేయవనుకుంటున్నారు..
ధూమపానం ద్వారా అయితే గాలి లోపలికి పీల్చుకోవాలి. అదే ఎడిబుల్ చాక్లెట్లయితే ఎలాంటి హాని ఉండదని విద్యార్థులు భావిస్తున్నారు. మత్తు పదార్థాలు ఏ రూపంలో అయినాసరే మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం మా దగ్గర 15 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. వీరిలో పలువురు బాలికలు కూడా ఉన్నారు.
– డాక్టర్ కె.దేవికారాణి, డైరెక్టర్, అమృత ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment