ట్రాక్‌లోకి ఎగుమతులు | May Exports Up 12.4 Per Cent at $28 Billion: What Experts Say | Sakshi
Sakshi News home page

ట్రాక్‌లోకి ఎగుమతులు

Published Thu, Jun 12 2014 1:29 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ట్రాక్‌లోకి ఎగుమతులు - Sakshi

ట్రాక్‌లోకి ఎగుమతులు

మే నెలలో 12.4 శాతం పెరుగుదల; 28 బిలియన్ డాలర్లు
 - గత 7 నెలల్లో తొలిసారి రెండంకెల వృద్ధి
 - ఇంజనీరింగ్, పెట్రో ఉత్పత్తులు, గార్మెంట్స్ ఎగుమతుల్లో మెరుగుదల ప్రభావం
 - 11.4 శాతం తగ్గిన దిగుమతులు; 39.23 బిలియన్ డాలర్లు
 - బంగారం దిగుమతులపై ఆంక్షల సడలింపునకు మార్గం సుగమం
 - దిగొచ్చిన వాణిజ్య లోటు; అయినా 10 నెలల గరిష్టం..11.23 బిలియన్ డాలర్లుగా నమోదు

 న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మెరుగుపడుతుండటంతో దేశీ ఎగుమతులకు జోష్  లభిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు 12.4 శాతం వృద్ధితో 28 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ 24.9 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 7 నెలల్లో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకోవడం, రెండంకెల వృద్ధి ఇదే తొలిసారి. ప్రధానంగా ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, గార్మెంట్స్ తదితర రంగాల ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదుచేయడం ఇందుకు దోహదం చేసింది. కాగా, మే నెలలో దిగుమతులు 11.4% తగ్గి... 39.23 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు కాస్త కుదుటపడింది. దీంతో పసిడి దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సడలించేందుకు మార్గం సుగమం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
వాణిజ్య లోటు ఊరట...
 ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు కూడా దిగొచ్చింది. క్రితం ఏడాది మే నెలలో 19.24 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది మేలో 11.23 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 10.1 బిలియన్ డాలర్ల కంటే అధికంగానే ఉండటంతోపాటు గడిచిన 10 నెలల్లో గరిష్టస్థాయికి చేరడం గమనార్హం. గతేడాది జూలైలో నమోదైన 12.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటే ఇప్పటిదాకా అత్యధిక స్థాయిగా ఉంది.

 

 గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
- పస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 8.87 శాతం ఎగబాకి 53.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 13.16 శాతం దిగొచ్చి 74.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 21.3 బిలియన్ డాలర్లుగా లెక్కతేలింది.
- ఇక మే నెలలో చమురు దిగుమతులు 2.5 శాతం పెరిగి 14.46 బిలియన్ డాలర్లకు చేరాయి.
- చమురేతర దిగుమతులు మే నెలలో 17.9 శాతం తగ్గుదలతో 24.76 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
- ఇక మే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు 22.09%, పెట్రోలియం ఉత్పత్తులు 28.7%, రెడీమేడ్ దుస్తులు(గార్మెంట్స్) 24.94%, ఫార్మా 10%, రసాయనాలు 13.8%చొప్పున వృద్ధి చెందాయి. ఇనుప ఖనిజం ఎగుమతులు 18.95 శాతం దిగజారి 72 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.
- బంగారం దిగుమతులపై నియంత్రణల నేపథ్యంలో రత్నాభరణాల ఎగుమతులు నామమాత్రంగా 1.36%పెరిగి మే నెలలో 3.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.

ప్రోత్సాహకర సంకేతమిది: ఖేర్
‘గత 7 నెలల్లో మళ్లీ మొదటిసారిగా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని సాధించగలిగాం. ఇదే ధోరణి గనుక కొనసాగితే మళ్లీ పూర్తిస్థాయిలో పునరుత్తేజం దిశగా పయనించే అవకాశం ఉంది. ఇది చాలా ప్రోత్సాహకర సంకేతమే’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement