Domestic exports
-
ఎగుమతులు ఎగసేలా
సాక్షి, అమరావతి: దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి మన రాష్ట్రం 10 శాతం వాటాను చేజిక్కించునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే ఎగుమతుల్లో మంచి పనితీరు కనబరుస్తున్న జిల్లాలతో పాటు వెనుకబడిన జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల వివరాలను సేకరించి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో గల అవకాశాలను పరిశీలించి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్స్) జీఎస్ రావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలు దేశవ్యాప్తంగా అత్యధిక ఎగుమతులు చేస్తున్న టాప్ 20 జిల్లాల్లో ఉండగా.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ నాటికి రాష్ట్రం నుంచి రూ.84,701.64 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా.. అందులో రూ.24,071.26 కోట్ల ఎగుమతులతో విశాఖ మొదటి స్థానంలోను, రూ.19,499.19 కోట్లతో తూర్పు గోదావరి రెండో స్థానంలో ఉన్నాయి. ఇదే సందర్భంలో కర్నూలు జిల్లా నుంచి రూ.317 కోట్లు, వైఎస్సార్ జిల్లా రూ.633 కోట్ల ఎగుమతులతో చివరి స్థానాల్లో ఉన్నాయి. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి వెనుకబడిన జిల్లాల్లో ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదాహరణకు వైఎస్సార్ జిల్లా నుంచి అత్యధికంగా ఖనిజాలు, ఉద్యాన పంటల ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వైఎస్సార్ జిల్లా నుంచి బేరియం, బైరటీస్, పోర్ట్లాండ్ సిమెంట్, అరటి వంటి ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాభివృద్ధితోపాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఇందుకోసం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్, వైఎస్సార్ ఈఎంసీలతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెద్దఎత్తున తయారీ కేంద్రాలను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం కింద ఏర్పాటయ్యే యూనిట్లను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాలో పలు యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. -
ఎగుమతులు పైపైకి..
• డిసెంబర్‌లోనూ జోరు; వరుసగా నాలుగో నెలలో వృద్ధిగమనం • 5.72 శాతం పెరుగుదలతో 23.9 బిలియన్ డాలర్లుగా నమోదు • తగ్గిన వాణిజ్య లోటు న్యూఢిల్లీ: ట్రంప్ ఎన్నికతో అనిశ్చితిని, దేశీయంగా డీమోనిటైజేషన్ను ఎదుర్కొని మరీ దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల డిసెంబర్‌లోనూ వృద్ధి దిశగా పయనించాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతం వృద్ధితో 23.9 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, ఫార్మా రంగాలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తులు 20 శాతం, పెట్రోలియం ఉత్పత్తులు 8.22 శాతం, ఫార్మా ఉత్పత్తులు 12.49 శాతం అధికంగా ఎగుమతి జరిగాయి. దిగుమతులు సైతం స్వల్పంగా 0.46 శాతం పెరిగాయి. 34.25 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. 2015 డిసెంబర్లో వాణిజ్య లోటు 11.5 బిలియన్ డాలర్లుగా ఉండగా... గత డిసెంబర్లో వాణిజ్య లోటు 10.36 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది. డిసెంబర్లో 7.64 బిలియన్ డాలర్ల విలువ మేర ఆయిల్ దిగుమతులు జరిగాయి. ఇదే కాలంలో దేశం నుంచి ఎగుమతి అయిన ఆయిల్ ఉత్పత్తుల విలువ 6.67 బిలియన్ డాలర్లతో పోలిస్తే దిగుమతులు 14.61% అధికం. చమురేతర ఉత్పత్తుల దిగుమతులు 26.60 డాలర్ల మేర నమోదయ్యాయి. బంగారం దిగుమతులు 48.49% క్షీణించి 1.96 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ 9 నెలల్లో 198.8 డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇది 0.75% వృద్ధి మాత్రమే. దిగుమతులు 7.42% క్షీణించి 275.3 బిలియన్ డాలర్లకు పరిమితం కావడంతో వాణిజ్య లోటు 76.54 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా సానుకూలత: ఎఫ్ఐఈవో ‘‘అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మొదలయ్యాయి. అమెరికా ఫెడ్ రేటు పెంపు, డీమోనిటైజేషన్ ప్రభావం ఎగుమతులపై పరిమితంగానే ఉంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 270–280 డాలర్ల విలువైన ఎగుమతులకు ఆస్కారం ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్ రాల్హన్ అన్నారు. -
ట్రాక్‌లోకి ఎగుమతులు
మే నెలలో 12.4 శాతం పెరుగుదల; 28 బిలియన్ డాలర్లు - గత 7 నెలల్లో తొలిసారి రెండంకెల వృద్ధి - ఇంజనీరింగ్, పెట్రో ఉత్పత్తులు, గార్మెంట్స్ ఎగుమతుల్లో మెరుగుదల ప్రభావం - 11.4 శాతం తగ్గిన దిగుమతులు; 39.23 బిలియన్ డాలర్లు - బంగారం దిగుమతులపై ఆంక్షల సడలింపునకు మార్గం సుగమం - దిగొచ్చిన వాణిజ్య లోటు; అయినా 10 నెలల గరిష్టం..11.23 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మెరుగుపడుతుండటంతో దేశీ ఎగుమతులకు జోష్ లభిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు 12.4 శాతం వృద్ధితో 28 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ 24.9 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 7 నెలల్లో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకోవడం, రెండంకెల వృద్ధి ఇదే తొలిసారి. ప్రధానంగా ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, గార్మెంట్స్ తదితర రంగాల ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదుచేయడం ఇందుకు దోహదం చేసింది. కాగా, మే నెలలో దిగుమతులు 11.4% తగ్గి... 39.23 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు కాస్త కుదుటపడింది. దీంతో పసిడి దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సడలించేందుకు మార్గం సుగమం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య లోటు ఊరట... ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు కూడా దిగొచ్చింది. క్రితం ఏడాది మే నెలలో 19.24 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది మేలో 11.23 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 10.1 బిలియన్ డాలర్ల కంటే అధికంగానే ఉండటంతోపాటు గడిచిన 10 నెలల్లో గరిష్టస్థాయికి చేరడం గమనార్హం. గతేడాది జూలైలో నమోదైన 12.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటే ఇప్పటిదాకా అత్యధిక స్థాయిగా ఉంది. గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... - పస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 8.87 శాతం ఎగబాకి 53.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 13.16 శాతం దిగొచ్చి 74.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 21.3 బిలియన్ డాలర్లుగా లెక్కతేలింది. - ఇక మే నెలలో చమురు దిగుమతులు 2.5 శాతం పెరిగి 14.46 బిలియన్ డాలర్లకు చేరాయి. - చమురేతర దిగుమతులు మే నెలలో 17.9 శాతం తగ్గుదలతో 24.76 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. - ఇక మే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు 22.09%, పెట్రోలియం ఉత్పత్తులు 28.7%, రెడీమేడ్ దుస్తులు(గార్మెంట్స్) 24.94%, ఫార్మా 10%, రసాయనాలు 13.8%చొప్పున వృద్ధి చెందాయి. ఇనుప ఖనిజం ఎగుమతులు 18.95 శాతం దిగజారి 72 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. - బంగారం దిగుమతులపై నియంత్రణల నేపథ్యంలో రత్నాభరణాల ఎగుమతులు నామమాత్రంగా 1.36%పెరిగి మే నెలలో 3.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రోత్సాహకర సంకేతమిది: ఖేర్ ‘గత 7 నెలల్లో మళ్లీ మొదటిసారిగా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని సాధించగలిగాం. ఇదే ధోరణి గనుక కొనసాగితే మళ్లీ పూర్తిస్థాయిలో పునరుత్తేజం దిశగా పయనించే అవకాశం ఉంది. ఇది చాలా ప్రోత్సాహకర సంకేతమే’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు.