ఎగుమతులు పైపైకి..
• డిసెంబర్‌లోనూ జోరు; వరుసగా నాలుగో నెలలో వృద్ధిగమనం
• 5.72 శాతం పెరుగుదలతో 23.9 బిలియన్ డాలర్లుగా నమోదు
• తగ్గిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ట్రంప్ ఎన్నికతో అనిశ్చితిని, దేశీయంగా డీమోనిటైజేషన్‌ను ఎదుర్కొని మరీ దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల డిసెంబర్‌లోనూ వృద్ధి దిశగా పయనించాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతం వృద్ధితో 23.9 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, ఫార్మా రంగాలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తులు 20 శాతం, పెట్రోలియం ఉత్పత్తులు 8.22 శాతం, ఫార్మా ఉత్పత్తులు 12.49 శాతం అధికంగా ఎగుమతి జరిగాయి. దిగుమతులు సైతం స్వల్పంగా 0.46 శాతం పెరిగాయి. 34.25 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి.
2015 డిసెంబర్‌లో వాణిజ్య లోటు 11.5 బిలియన్ డాలర్లుగా ఉండగా... గత డిసెంబర్‌లో వాణిజ్య లోటు 10.36 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది. డిసెంబర్‌లో 7.64 బిలియన్ డాలర్ల విలువ మేర ఆయిల్ దిగుమతులు జరిగాయి. ఇదే కాలంలో దేశం నుంచి ఎగుమతి అయిన ఆయిల్ ఉత్పత్తుల విలువ 6.67 బిలియన్ డాలర్లతో పోలిస్తే దిగుమతులు 14.61% అధికం. చమురేతర ఉత్పత్తుల దిగుమతులు 26.60 డాలర్ల మేర నమోదయ్యాయి. బంగారం దిగుమతులు 48.49% క్షీణించి 1.96 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ 9 నెలల్లో 198.8 డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇది 0.75% వృద్ధి మాత్రమే. దిగుమతులు 7.42% క్షీణించి 275.3 బిలియన్ డాలర్లకు పరిమితం కావడంతో వాణిజ్య లోటు 76.54 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది.
అంతర్జాతీయంగా సానుకూలత: ఎఫ్‌ఐఈవో
‘‘అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మొదలయ్యాయి. అమెరికా ఫెడ్ రేటు పెంపు, డీమోనిటైజేషన్ ప్రభావం ఎగుమతులపై పరిమితంగానే ఉంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 270–280 డాలర్ల విలువైన ఎగుమతులకు ఆస్కారం ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్ రాల్హన్ అన్నారు.