రిలయన్స్ భేష్! | RIL June quarter profit jumps 18% to Rs 7113 crore | Sakshi
Sakshi News home page

రిలయన్స్ భేష్!

Published Sat, Jul 16 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

రిలయన్స్ భేష్!

రిలయన్స్ భేష్!

అంచనాలను మించిన ఫలితాలు..
క్యూ1లో లాభం రూ.7,113 కోట్లు; 18 శాతం జంప్
రిఫైనింగ్ మార్జిన్ల జోరు ప్రభావం..
జూన్ క్వార్టర్‌లో జీఆర్‌ఎం 11.5 డాలర్లు
ఆదాయం మాత్రం 13.4 శాతం డౌన్; రూ.71,451 కోట్లు
క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల క్షీణత కారణం

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... అంచనాలను మించిన లాభాలతో అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18.1 శాతం దూసుకెళ్లి రూ.7,113 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,024 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా పటిష్టమైన ముడిచమురు రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 13.4 శాతం దిగజారి రూ.71,451 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పతనం కావడం ఆదాయాల క్షీణతకు దారితీసింది. కాగా, జూన్ క్వార్టర్‌లో మార్కెట్ విశ్లేషకులు రూ.6,515 కోట్ల లాభాన్ని అంచనా వేశారు.

 జీఆర్‌ఎం దూకుడు...
క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్టస్థాయి కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్‌ఎం 10.4 డాలర్లుకాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో ఇది 10.8 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా శుద్ధి చేయడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. క్రూడ్ రిఫైనింగ్‌కు సంబంధించి ప్రామాణికంగా పరిగణించే సింగపూర్ బెంచ్‌మార్క్ జీఆర్‌ఎం క్యూ1లో 5 డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. క్యూ1లో రిలయన్స్ జీఆర్‌ఎం 9.8 డాలర్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.

 ఇతర ముఖ్యాంశాలు..
క్యూ1లో స్థూల లాభం 26% దూసుకెళ్లి రూ.6,593 కోట్లకు ఎగసింది. ఈ విభాగంలో ఆదాయం 17.7% క్షీణించి రూ.68,729 కోట్ల నుంచి రూ.56,568 కోట్లకు తగ్గింది.

జూన్ క్వార్టర్లో ఆర్‌ఐఎల్ జామ్ నగర్ జంట రిఫైనరీలు 16.8 మిలియన్ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయి.

పెట్రోకెమికల్స్ వ్యాపారంలో స్థూల లాభం 20.5 శాతం వృద్ధి చెంది రూ.2,806 కోట్లకు చేరింది. ఆదాయం స్వల్పంగా 0.7 శాతం తగ్గుదలతో రూ.20,858 కోట్ల నుంచి రూ.20,718 కోట్లకు తగ్గింది.

చమురు, గ్యాస్ వ్యాపారంలో స్థూల నష్టం రూ.199 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెరిగింది. ఈ రంగంలో ఆదాయం రూ.1,340 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 2,054 కోట్లతో పోలిస్తే ఏకంగా 34.8 శాతం క్షీణించింది.

కేజీ-డీ6 క్షేత్రాల్లో క్రూడ్ ఉత్పత్తి 35% దిగజారి 0.28 మిలియన్ బ్యారళ్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి 23% క్షీణించి 28.05 బిలియన్ ఘనపుటడుగులకు తగ్గింది.

ఇతర ఆదాయం గతేడాది క్యూ1లో రూ.1,584 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఏకంగా రూ.2,378 కోట్లకు దూసుకెళ్లింది. ప్రధానంగా కొన్ని ఆస్తుల విక్రయం, వడ్డీ రూపంలో ఆదాయం పెరగడం  దోహదం చేసింది.

రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ1లో రూ. 45.8% ఎగసి రూ.6,666 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.198 కోట్ల నుంచి రూ.240 కోట్లకు పెరిగింది. జూన్ చివరికి 679 నగరాల్లో మొత్తం 3,383 స్టోర్లను నిర్వహిస్తోంది.

కంపెనీ మొత్త రుణ భారం ఈ ఏడాది జూన్ చివరినాటికి రూ.1,86,692 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ చివరికి రుణ భారం రూ.1,80,388 కోట్లు.

కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు స్వల్ప పెరుగుదలతో రూ.80,966 కోట్ల నుంచి రూ.90,812 కోట్లకు చేరాయి.

శుక్రవారం బీఎస్‌ఈలో రిలయన్స్ షేరు ధర 0.61 శాతం లాభంతో రూ.1,013 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది.

‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మేం లాభాల జోరును కొనసాగిస్తున్నాం. రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డుస్థాయి పనితీరును నమోదు చేసింది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోనూ వృద్ధి జోరందుకుంది. రిలయన్స్ జియో 4జీ టెలికం సేవలకు మొత్తం వ్యవస్థ సిద్ధమైంది. దేశంలో ప్రతి ఒక్కరికీ అధునాతన వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ విప్లవానికి తెరతీయనున్నాం’.  - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ

జియో వాణిజ్య సేవలు ఎప్పటినుంచో?
దేశీ టెలికం రంగంలో ఉత్కంఠ రేపుతున్న రిలయన్స్ జియో 4జీ   సేవలకు సంబంధించి వాణిజ్యపరమైన కార్యకలాపాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయనేది కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో 15 లక్షల మందికి పైగా టెస్ట్ యూజర్లు ఉన్నట్లు అంచనా. కాగా, రానున్న నెలల్లో ఈ ప్రయోగాత్మక సేవలను పూర్తిస్థాయి వాణిజ్య సేవల్లోకి అప్‌గ్రేడ్ చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్ సందర్భంగా యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 26 జీబీగా ఉన్నట్లు తెలిపింది. ఇక సగటు నెలవారీ వాయిస్ వినియోగం 355 నిమిషాలుగా నమోదైనట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement