GRM
-
స్ట్రీట్ అంచనాలను బద్దలు కొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ : ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో హవా చాటుతున్న రిలయన్స్ ఇంటస్ట్రీస్, స్ట్రీట్ అంచనాలు మరోసారి అంచనాలను బద్దలు కొట్టింది. ఏడాది ఏడాదికి కంపెనీ కన్సాలిడేట్ నికర లాభాలను 11.54 శాతం పెంచుకుంది. మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.8,055కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.7,220 కోట్లగానే ఉన్నాయి. ఏడాది ఏడాదికి కంపెనీ లాభాల వృద్ధి నమోదుచేయడం ఇది వరుసగా తొమ్మిది క్వార్టర్. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు కూడా కంపెనీకి ఒక్కో బ్యారెల్‌కు 11.5 డాలర్లగా ఉన్నాయి. ఈటీ నౌ అంచనాల ప్రకారం ఇవి 10.4 డాలర్లే ఉంటాయని తెలిసింది. స్టాండలోన్ మార్జిన్లు కూడా కంపెనీకి 17 శాతం పెరిగినట్టు వెల్లడైంది. నిర్వహణల నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్ లో 12 శాతం పెరిగి రూ.74,598 కోట్లగా నమోదైనట్టు ప్రకటించింది. గత క్వార్టర్ లో ఇది రూ.66,606 కోట్లగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈబీఐటీడీఏలు ఏడాది ఏడాదికి 17 శాతం పెరిగి, 12,416 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. సీఎన్‌బీసీ-టీవీ18 అంచనాల ప్రకారం కంపెనీ లాభాలు 8000 కోట్లగా, నిర్వహణ లాభాలు 11,485 కోట్లగా నమోదవుతాయని తెలిసింది. కానీ వారి అంచనాలను రిలయన్స్ బద్దలుకొట్టింది. వచ్చే నెలల్లో జియో నెట్ వర్క్ కోసం లక్ష టవర్లను ఏర్పాటుచేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన క్వార్టర్‌కు జియో సబ్ స్క్రైబర్ బేస్ 108.9 మిలియన్లను తాకినట్టు కూడా కంపెనీ వెల్లడించింది. మరోవైపు స్టాక్ విలువ 1.19 శాతం పెరిగి, 4.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ అవతరించింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ను ఇది అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం మార్కెట్ల ముగింపుకు 4.58 లక్షల కోట్లగా ఉంది. -
రిలయన్స్ భేష్!
అంచనాలను మించిన ఫలితాలు.. క్యూ1లో లాభం రూ.7,113 కోట్లు; 18 శాతం జంప్ ♦ రిఫైనింగ్ మార్జిన్ల జోరు ప్రభావం.. ♦ జూన్ క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లు ♦ ఆదాయం మాత్రం 13.4 శాతం డౌన్; రూ.71,451 కోట్లు ♦ క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల క్షీణత కారణం న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... అంచనాలను మించిన లాభాలతో అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18.1 శాతం దూసుకెళ్లి రూ.7,113 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,024 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా పటిష్టమైన ముడిచమురు రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 13.4 శాతం దిగజారి రూ.71,451 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పతనం కావడం ఆదాయాల క్షీణతకు దారితీసింది. కాగా, జూన్ క్వార్టర్లో మార్కెట్ విశ్లేషకులు రూ.6,515 కోట్ల లాభాన్ని అంచనా వేశారు. జీఆర్ఎం దూకుడు... క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్టస్థాయి కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.4 డాలర్లుకాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో ఇది 10.8 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా శుద్ధి చేయడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. క్రూడ్ రిఫైనింగ్‌కు సంబంధించి ప్రామాణికంగా పరిగణించే సింగపూర్ బెంచ్‌మార్క్ జీఆర్ఎం క్యూ1లో 5 డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. క్యూ1లో రిలయన్స్ జీఆర్ఎం 9.8 డాలర్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇతర ముఖ్యాంశాలు.. ♦ క్యూ1లో స్థూల లాభం 26% దూసుకెళ్లి రూ.6,593 కోట్లకు ఎగసింది. ఈ విభాగంలో ఆదాయం 17.7% క్షీణించి రూ.68,729 కోట్ల నుంచి రూ.56,568 కోట్లకు తగ్గింది. ♦ జూన్ క్వార్టర్లో ఆర్ఐఎల్ జామ్ నగర్ జంట రిఫైనరీలు 16.8 మిలియన్ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయి. ♦ పెట్రోకెమికల్స్ వ్యాపారంలో స్థూల లాభం 20.5 శాతం వృద్ధి చెంది రూ.2,806 కోట్లకు చేరింది. ఆదాయం స్వల్పంగా 0.7 శాతం తగ్గుదలతో రూ.20,858 కోట్ల నుంచి రూ.20,718 కోట్లకు తగ్గింది. ♦ చమురు, గ్యాస్ వ్యాపారంలో స్థూల నష్టం రూ.199 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెరిగింది. ఈ రంగంలో ఆదాయం రూ.1,340 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 2,054 కోట్లతో పోలిస్తే ఏకంగా 34.8 శాతం క్షీణించింది. ♦ కేజీ-డీ6 క్షేత్రాల్లో క్రూడ్ ఉత్పత్తి 35% దిగజారి 0.28 మిలియన్ బ్యారళ్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి 23% క్షీణించి 28.05 బిలియన్ ఘనపుటడుగులకు తగ్గింది. ♦ ఇతర ఆదాయం గతేడాది క్యూ1లో రూ.1,584 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏకంగా రూ.2,378 కోట్లకు దూసుకెళ్లింది. ప్రధానంగా కొన్ని ఆస్తుల విక్రయం, వడ్డీ రూపంలో ఆదాయం పెరగడం దోహదం చేసింది. ♦ రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ1లో రూ. 45.8% ఎగసి రూ.6,666 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.198 కోట్ల నుంచి రూ.240 కోట్లకు పెరిగింది. జూన్ చివరికి 679 నగరాల్లో మొత్తం 3,383 స్టోర్లను నిర్వహిస్తోంది. ♦ కంపెనీ మొత్త రుణ భారం ఈ ఏడాది జూన్ చివరినాటికి రూ.1,86,692 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ చివరికి రుణ భారం రూ.1,80,388 కోట్లు. ♦ కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు స్వల్ప పెరుగుదలతో రూ.80,966 కోట్ల నుంచి రూ.90,812 కోట్లకు చేరాయి. ♦ శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు ధర 0.61 శాతం లాభంతో రూ.1,013 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మేం లాభాల జోరును కొనసాగిస్తున్నాం. రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డుస్థాయి పనితీరును నమోదు చేసింది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోనూ వృద్ధి జోరందుకుంది. రిలయన్స్ జియో 4జీ టెలికం సేవలకు మొత్తం వ్యవస్థ సిద్ధమైంది. దేశంలో ప్రతి ఒక్కరికీ అధునాతన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ విప్లవానికి తెరతీయనున్నాం’. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో వాణిజ్య సేవలు ఎప్పటినుంచో? దేశీ టెలికం రంగంలో ఉత్కంఠ రేపుతున్న రిలయన్స్ జియో 4జీ సేవలకు సంబంధించి వాణిజ్యపరమైన కార్యకలాపాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయనేది కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో 15 లక్షల మందికి పైగా టెస్ట్ యూజర్లు ఉన్నట్లు అంచనా. కాగా, రానున్న నెలల్లో ఈ ప్రయోగాత్మక సేవలను పూర్తిస్థాయి వాణిజ్య సేవల్లోకి అప్‌గ్రేడ్ చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్ సందర్భంగా యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 26 జీబీగా ఉన్నట్లు తెలిపింది. ఇక సగటు నెలవారీ వాయిస్ వినియోగం 355 నిమిషాలుగా నమోదైనట్లు వెల్లడించింది. -
రిలయన్స్ లాభాల రికార్డ్..
క్యూ3లో నికర లాభం రూ.7,290 కోట్లు; 39 శాతం జూమ్ * ఆదాయం రూ. 68,261 కోట్లు; 27 శాతం తగ్గుదల * ఏడేళ్ల గరిష్టానికి జీఆర్ఎం; 11.5 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల రికార్డులతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో కంపెనీ ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ.7,290 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,256 కోట్లతో పోలిస్తే ఏకంగా 38.7 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ చరిత్రలో ఒక క్వార్టర్‌కు ఇంత అత్యధిక స్థాయిలో లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధానంగా స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం)లు అనూహ్యంగా ఎగబాకడం, పెట్రోకెమికల్స్ విభాగంలో మార్జిన్లు పుంజుకోవడం వంటివి రికార్డుస్థాయి లాభాలకు దోహదం చేసింది. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఘోరంగా పడిపోయిన ప్రభావంతో రిలయన్స్ మొత్తం ఆదాయం భారీగా క్షీణించింది. రూ.68,261 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ3లో రూ93,528 కోట్లతో పోలిస్తే 27 శాతం దిగజారింది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ3లో రూ.6,950 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. దూసుకెళ్లిన జీఆర్ఎం... ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో రిలయన్స్ జీఆర్ఎం 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఏడేళ్ల గరిష్టస్థాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో జీఆర్ఎం 7.3 డాలర్లే. ఈ ఏడాది క్యూ2లో జీఆర్ఎం 10.6 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా కంపెనీకి లభించిన రాబడిని స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం)గా వ్యవహరిస్తారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... * జామ్ నగర్‌లోని జంట రిఫైనరీల ద్వారా క్యూ3లో రికార్డు స్థాయిలో 18 మిలియన్ టన్నుల క్రూడ్ శుద్ధిచేసినట్లు కంపెనీ తెలిపింది. * రిఫైనింగ్ వ్యాపారం స్థూల లాభం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో దాదాపు రెట్టింపై రూ.6,491 కోట్లకు ఎగబాకింది. ఇక పెట్రోకెమికల్స్ వ్యాపారానికి సంబంధించి 28 శాతం వృద్ధితో రూ.2,639 కోట్లుగా నమోదైంది. * కేజీ-డీ6 క్షేత్రం నుంచి చమురు, గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోవడం.. ధరల పతనం కారణంగా ఈ విభాగం ఆదాయం 40 శాతం క్షీణించి రూ.1,765 కోట్లకు పరిమితమైంది. స్థూల లాభం 89 శాతం దిగజారి రూ.832 కోట్ల నుంచి రూ.90 కోట్లకు క్షీణించింది. * టెలికం అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే సన్నాహాల్లో ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే, ఎప్పటినుంచి సర్వీసులు వాణిజ్యపరంగా మొదలవుతాయనేది వెల్లడించలేదు. ఇటీవలే రిలయన్స్ గ్రూప్‌లోని లక్ష మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు 4జీ సేవలను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. * మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ3లో కీలమైన మైలురాయిని అధిగమించింది. కంపెనీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా రూ.6,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,686 కోట్లతో పోలిస్తే 29 శాతం ఎగసింది. ఇక రిలయన్స్ రిటైల్ స్థూల లాభం రూ.227 కోట్ల నుంచి రూ.243 కోట్లకు పెరిగింది. * కొన్ని ఆస్తుల విక్రయం కారణంగా రిలయన్స్ ఇతర ఆదాయం క్యూ3లో రూ.2,426 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ3లో ఇది రూ.2,340 కోట్లు. * డిసెంబర్ చివరినాటికి రిలయన్స్ నగదు నిల్వలు రూ.91,736 కోట్లకు పెరిగాయి. ఇక మొత్తం రుణాలు కూడా రూ.1,78,077 కోట్లకు ఎగబాకాయి. * ఫలితాల నేపథ్యంలో మంగళవారం రిలయన్స్ షేరు ధర బీఎస్ఈలో 2.51 శాతం ఎగసి రూ.1,043 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రపంచ స్థాయి రిఫైనింగ్, పెట్రోకెమికల్ కార్యకలాపాలతో మరోసారి ఆకర్షణీయమైన ఫలితాలను సాధించగలిగాం. ఏడేళ్లకుపైగా గరిష్టానికి ఎగబాకిన జీఆర్ఎం ఆసరాతో రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డు పనితీరును నమోదుచేసింది. పటిష్టమైన పాలిమర్ మార్జిన్ల కారణంగా పెట్రోకెమికల్ వ్యాపారంలో అత్యంత మెరుగ్గా రాణించగలిగాం. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.15,000 కోట్లు * సమీకరించనున్న రిలయన్స్ జియో న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రైట్స్ ఇష్యూ జారీచేయడం ద్వారా రూ.15,000 కోట్లు సమీకరిస్తామని రిలయన్స్ జియో తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బీఎస్ఈకి నివేదించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీతో స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొంది. రిలయన్స్ జియో త్వరలో 4జీ సేవలను అందించనున్నది. రిలయన్స్ జియోపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇప్పటికే రూ. లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా నెలకు రూ.300-500 చార్జీకే 4జీ సేవలను, 4జీ హ్యాండ్సెట్లను రూ.4,000 చొప్పున అందించాలని రిలయన్స్ జియో యోచిస్తోంది. -
రిలయన్స్ లాభం 5,972 కోట్లు
రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మరోసారి అద్భుతమైన పనితీరును సాధించాం. ప్రాంతీయంగా పరిశ్రమ ప్రమాణాల కంటే మెరుగైన పనితీరును కనబరిచాం. అంతర్జాతీయంగా ఆర్థిక పరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ ధోరణి.. వ్యాపార రంగానికి కలిసొచ్చే అంశం. వచ్చే 12-18 నెలల్లో వాటాదారులకు రిలయన్స్ గణనీయమైన విలువను సృష్టించనుంది. ఇంధన, కన్జూమర్ వ్యాపార విభాగాల్లో తలపెట్టిన భారీ పెట్టుబడులన్నీ పూర్తికానున్నాయి. ఆయా ప్రాజెక్టులు కంపెనీకే కాకుండా భారత్ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో చోధకంగా పనిచేస్తాయి. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ క్యూ2లో స్వల్పంగా 1.7% వృద్ధి * ఆదాయం 4.3 శాతం తగ్గుదల; రూ.1,13,396 కోట్లు * స్థూల రిఫైనింగ్ మార్జిన్ 8.3 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,972 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,873 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.7 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం 4.3 శాతం తగ్గుదలతో రూ.1,13,396 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.1,18,439 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుముఖం, రిఫైనింగ్, చమురు-గ్యాస్ వ్యాపారంలో అమ్మకాల తగ్గుదలతో ఆదాయం కొద్దిగా దిగొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన ఎగుమతులు క్యూ2లో 14.7 శాతం తగ్గి రూ.66,065 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎగుమతులు రూ.77,428 కోట్లుగా ఉన్నాయి. పెరిగిన జీఆర్ఎం...: ఇదిలాఉండగా... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) క్యూ2లో 8.3 డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో జీఆర్ఎం 7.7 డాలర్లు మాత్రమే. ఈ ఏడాది క్యూ1లో జీఆర్ఎం 8.7 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేసి తద్వారా వచ్చిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కంపెనీకి వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. చమురు, గ్యాస్ రంగంలో ఆదాయాల క్షీణత ప్రభావాన్ని పటిష్ట జీఆర్ఎంతో కంపెనీ పూడ్చుకోగలిగింది. ఇతర ముఖ్యాంశాలు... * కీలకమైన రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) క్యూ2లో 18.5 శాతం ఎగబాకి రూ.3,844 కోట్లకు చేరింది. అయితే, ఈ విభాగంలో ఆదాయం 5.9% తగ్గి రూ.1,03,590 కోట్లుగా నమోదైంది. * ఇక పెట్రోకెమికల్స్ విభాగంలో ఎబిటా దాదాపు మార్పుల్లేకుండా రూ.2,361 కోట్లుగా ఉంది. చమురు-గ్యాస్ రంగం ఎబిటా 14.5 శాతం క్షీణించి రూ.818 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది క్యూ2లో ఈ మొత్తం రూ. 956 కోట్లు.. ఈ ఏడాది క్యూ1లో రూ.1,042 కోట్లుగా నమోదైంది. దేశీయంగా కేజీ-డీ6లో ఉత్పత్తి క్షీణత ఈ విభాగంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. * రిటైల్ వ్యాపార ఆదాయం రూ.3,470 కోట్ల నుంచి రూ.4,167 కోట్లకు ఎగసింది. ఎబిటా రూ.70 కోట్ల నుంచి రూ.99 కోట్లకు పెరిగింది. * పెట్రోకెమికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్ఐఎల్ 16 బిలియన్ డాలర్లమేర పెట్టుబడుల ప్రణాళికను అమలు చేస్తోంది. * మరో 4.5 బిలియన్ డాలర్లను పాలిస్టర్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణపై ఖర్చుచేస్తోంది. 2017-18 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా మిగిలిన కాలంలో దాదాపు రూ. 5,000- 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ సీఎఫ్‌వో అలోక్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే క్యూ1లో రూ. 15,000 కోట్లు, క్యూ2లో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. * ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ.1,42,084 కోట్లకు ఎగబాకింది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.1,35,769 కోట్లు. * కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతర నిల్వలు ఈ సెప్టెంబర్ ఆఖరికి రూ.83,456 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.81,559 కోట్లు. * రిలయన్స్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం తగ్గి.. రూ.958 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.