రిలయన్స్ లాభం 5,972 కోట్లు
రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మరోసారి అద్భుతమైన పనితీరును సాధించాం. ప్రాంతీయంగా పరిశ్రమ ప్రమాణాల కంటే మెరుగైన పనితీరును కనబరిచాం. అంతర్జాతీయంగా ఆర్థిక పరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ ధోరణి.. వ్యాపార రంగానికి కలిసొచ్చే అంశం. వచ్చే 12-18 నెలల్లో వాటాదారులకు రిలయన్స్ గణనీయమైన విలువను సృష్టించనుంది. ఇంధన, కన్జూమర్ వ్యాపార విభాగాల్లో తలపెట్టిన భారీ పెట్టుబడులన్నీ పూర్తికానున్నాయి. ఆయా ప్రాజెక్టులు కంపెనీకే కాకుండా భారత్ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో చోధకంగా పనిచేస్తాయి.
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ
క్యూ2లో స్వల్పంగా 1.7% వృద్ధి
* ఆదాయం 4.3 శాతం తగ్గుదల; రూ.1,13,396 కోట్లు
* స్థూల రిఫైనింగ్ మార్జిన్ 8.3 డాలర్లు...
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,972 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,873 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.7 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం 4.3 శాతం తగ్గుదలతో రూ.1,13,396 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.1,18,439 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుముఖం, రిఫైనింగ్, చమురు-గ్యాస్ వ్యాపారంలో అమ్మకాల తగ్గుదలతో ఆదాయం కొద్దిగా దిగొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన ఎగుమతులు క్యూ2లో 14.7 శాతం తగ్గి రూ.66,065 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఎగుమతులు రూ.77,428 కోట్లుగా ఉన్నాయి.
పెరిగిన జీఆర్‌ఎం...: ఇదిలాఉండగా... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) క్యూ2లో 8.3 డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో జీఆర్‌ఎం 7.7 డాలర్లు మాత్రమే. ఈ ఏడాది క్యూ1లో జీఆర్‌ఎం 8.7 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేసి తద్వారా వచ్చిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కంపెనీకి వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. చమురు, గ్యాస్ రంగంలో ఆదాయాల క్షీణత ప్రభావాన్ని పటిష్ట జీఆర్‌ఎంతో కంపెనీ పూడ్చుకోగలిగింది.
ఇతర ముఖ్యాంశాలు...
* కీలకమైన రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) క్యూ2లో 18.5 శాతం ఎగబాకి రూ.3,844 కోట్లకు చేరింది. అయితే, ఈ విభాగంలో ఆదాయం 5.9% తగ్గి రూ.1,03,590 కోట్లుగా నమోదైంది.
* ఇక పెట్రోకెమికల్స్ విభాగంలో ఎబిటా దాదాపు మార్పుల్లేకుండా రూ.2,361 కోట్లుగా ఉంది. చమురు-గ్యాస్ రంగం ఎబిటా 14.5 శాతం క్షీణించి రూ.818 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది క్యూ2లో ఈ మొత్తం రూ. 956 కోట్లు.. ఈ ఏడాది క్యూ1లో రూ.1,042 కోట్లుగా నమోదైంది. దేశీయంగా కేజీ-డీ6లో ఉత్పత్తి క్షీణత ఈ విభాగంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది.
* రిటైల్ వ్యాపార ఆదాయం రూ.3,470 కోట్ల నుంచి రూ.4,167 కోట్లకు ఎగసింది. ఎబిటా రూ.70 కోట్ల నుంచి రూ.99 కోట్లకు పెరిగింది.
* పెట్రోకెమికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్‌ఐఎల్ 16 బిలియన్ డాలర్లమేర పెట్టుబడుల ప్రణాళికను అమలు చేస్తోంది.
* మరో 4.5 బిలియన్ డాలర్లను పాలిస్టర్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణపై ఖర్చుచేస్తోంది. 2017-18 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తికానున్నాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా మిగిలిన కాలంలో దాదాపు రూ. 5,000- 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ సీఎఫ్‌వో అలోక్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే క్యూ1లో రూ. 15,000 కోట్లు, క్యూ2లో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు.
* ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ.1,42,084 కోట్లకు ఎగబాకింది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.1,35,769 కోట్లు.
* కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతర నిల్వలు ఈ సెప్టెంబర్ ఆఖరికి రూ.83,456 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.81,559 కోట్లు.
* రిలయన్స్ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో స్వల్పంగా 0.3 శాతం తగ్గి.. రూ.958 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.