Consolidated net
-
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..అనిల్ అంబానీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 215 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,116 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 6,002 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు పుంజుకుంది. ప్రస్తుత క్యూ2లో రూ. 290 కోట్ల పన్నుకుముందు లాభం ఆర్జించగా.. గత క్యూ2లో రూ. 1,115 కోట్ల నిర్వహణా నష్టం ప్రకటించింది. రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. వై.నాగేశ్వరరావును పాలనాధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 11.22 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్.. రయ్ లాభం 73 శాతం జూమ్
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్‌గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది. ► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది. ► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది. ► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ► స్థూల ఎన్పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి. ► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి. -
మెప్పించిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరును ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 43 శాతం వృద్ధి చెంది రూ.1,366 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.956 కోట్లతో పోల్చినా లేక ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,206 కోట్లతో చూసినా వృద్ధి చెందింది. లాభాల్లో మార్జిన్ 15.3 శాతానికి విస్తరించడం వల్ల పన్నుకు ముందస్తు లాభంలో 39 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతం పెరిగి రూ.10,485 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా ఆదాయం (మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) 10 శాతం వృద్ధిని చూపించింది. డాలర్ మారకంలో చూస్తే నికర లాభం 42 శాతానికి పైగా వృద్ధితో 183.2 మిలియన్ డాలర్లుగాను, ఆదాయం 14.6 శాతం వృద్ధితో 1,383 మిలియన్ డాలర్లుగాను ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులు సీక్వెన్షియల్‌గా (మార్చి త్రైమాసికంతో పోల్చినప్పుడు) జూన్ క్వార్టర్లో 5,209 మంది పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,26,263కు చేరింది. సుమారు 13,544 కోట్లు (183 మిలియన్ డాలర్లు) నగదు, నగదు సమాన నిల్వలున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని జూన్ క్వార్టర్లో నమోదు చేసినట్టు సీఎఫ్‌వో మిలింద్ కుల్కర్ణి తెలిపారు. 815 మిలియన్ డాలర్ల (రూ.6 వేల కోట్లకు పైగా) విలువైన నూతన వ్యాపార ఒప్పందాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరును సాధించినట్టు చెప్పా రు. డిజిటల్‌పై పెరుగుతున్న వ్యయాలను అవకాశాలుగా మలుచుకుని రానున్న కాలంలో ఇదే వృద్ధిని లేదంటే ఇంతకుమించి మెరుగైన పనితీరును నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్‌కుమార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
రిలయన్స్ లాభం 5,972 కోట్లు
రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మరోసారి అద్భుతమైన పనితీరును సాధించాం. ప్రాంతీయంగా పరిశ్రమ ప్రమాణాల కంటే మెరుగైన పనితీరును కనబరిచాం. అంతర్జాతీయంగా ఆర్థిక పరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ ధోరణి.. వ్యాపార రంగానికి కలిసొచ్చే అంశం. వచ్చే 12-18 నెలల్లో వాటాదారులకు రిలయన్స్ గణనీయమైన విలువను సృష్టించనుంది. ఇంధన, కన్జూమర్ వ్యాపార విభాగాల్లో తలపెట్టిన భారీ పెట్టుబడులన్నీ పూర్తికానున్నాయి. ఆయా ప్రాజెక్టులు కంపెనీకే కాకుండా భారత్ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో చోధకంగా పనిచేస్తాయి. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ క్యూ2లో స్వల్పంగా 1.7% వృద్ధి * ఆదాయం 4.3 శాతం తగ్గుదల; రూ.1,13,396 కోట్లు * స్థూల రిఫైనింగ్ మార్జిన్ 8.3 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,972 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,873 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.7 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం 4.3 శాతం తగ్గుదలతో రూ.1,13,396 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.1,18,439 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుముఖం, రిఫైనింగ్, చమురు-గ్యాస్ వ్యాపారంలో అమ్మకాల తగ్గుదలతో ఆదాయం కొద్దిగా దిగొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన ఎగుమతులు క్యూ2లో 14.7 శాతం తగ్గి రూ.66,065 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎగుమతులు రూ.77,428 కోట్లుగా ఉన్నాయి. పెరిగిన జీఆర్ఎం...: ఇదిలాఉండగా... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) క్యూ2లో 8.3 డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో జీఆర్ఎం 7.7 డాలర్లు మాత్రమే. ఈ ఏడాది క్యూ1లో జీఆర్ఎం 8.7 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేసి తద్వారా వచ్చిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కంపెనీకి వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. చమురు, గ్యాస్ రంగంలో ఆదాయాల క్షీణత ప్రభావాన్ని పటిష్ట జీఆర్ఎంతో కంపెనీ పూడ్చుకోగలిగింది. ఇతర ముఖ్యాంశాలు... * కీలకమైన రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) క్యూ2లో 18.5 శాతం ఎగబాకి రూ.3,844 కోట్లకు చేరింది. అయితే, ఈ విభాగంలో ఆదాయం 5.9% తగ్గి రూ.1,03,590 కోట్లుగా నమోదైంది. * ఇక పెట్రోకెమికల్స్ విభాగంలో ఎబిటా దాదాపు మార్పుల్లేకుండా రూ.2,361 కోట్లుగా ఉంది. చమురు-గ్యాస్ రంగం ఎబిటా 14.5 శాతం క్షీణించి రూ.818 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది క్యూ2లో ఈ మొత్తం రూ. 956 కోట్లు.. ఈ ఏడాది క్యూ1లో రూ.1,042 కోట్లుగా నమోదైంది. దేశీయంగా కేజీ-డీ6లో ఉత్పత్తి క్షీణత ఈ విభాగంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. * రిటైల్ వ్యాపార ఆదాయం రూ.3,470 కోట్ల నుంచి రూ.4,167 కోట్లకు ఎగసింది. ఎబిటా రూ.70 కోట్ల నుంచి రూ.99 కోట్లకు పెరిగింది. * పెట్రోకెమికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్ఐఎల్ 16 బిలియన్ డాలర్లమేర పెట్టుబడుల ప్రణాళికను అమలు చేస్తోంది. * మరో 4.5 బిలియన్ డాలర్లను పాలిస్టర్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణపై ఖర్చుచేస్తోంది. 2017-18 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా మిగిలిన కాలంలో దాదాపు రూ. 5,000- 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ సీఎఫ్‌వో అలోక్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే క్యూ1లో రూ. 15,000 కోట్లు, క్యూ2లో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. * ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ.1,42,084 కోట్లకు ఎగబాకింది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.1,35,769 కోట్లు. * కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతర నిల్వలు ఈ సెప్టెంబర్ ఆఖరికి రూ.83,456 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.81,559 కోట్లు. * రిలయన్స్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం తగ్గి.. రూ.958 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.