
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) క్రమంగా హోల్డింగ్ కంపెనీగా ఆవిర్భవించే అవకాశమున్నట్లు ఫిన్‌టెక్ గ్రూప్ క్రెడిట్‌సైట్స్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రధాన బిజినెస్ విభాగాల్లో స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా నిలిచే వీలున్నట్లు అంచనా వేసింది. ఆర్‌ఐఎల్ విషయంలో కంపెనీ చీఫ్ బిలియనీర్ ముకేశ్ అంబానీ అమలు చేస్తున్న విజయవంతమైన ప్రణాళికల ద్వారా పటిష్ట క్రెడిట్ ప్రొఫైల్‌ను సొంతం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.
టెలికం, రిటైల్ విభాగాలు అత్యుత్తమ ఫలితాలు సాధించనుండటంతో చమురు విభాగం బలహీన ఔట్‌లుక్ పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడింది. అధిక ధరల నేపథ్యంలో చమురుశుద్ధి యూనిట్, భారీ పెట్టుబడి అవసరాలు వంటి అంశాలు చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఇటీవల ఆర్‌ఐఎల్ వివిధ బిజినెస్‌ల విజయవంతమయ్యే ప్రణాళికలపైనే దృష్టి సారించింది. చైర్మన్ ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం ఆకాశ్, ఈషా, అనంత్‌లను సంస్థ బోర్డులో డైరెక్టర్లుగా చోటు కల్పించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు.
ప్రణాళికాబద్ధంగా..
‘పలువురు ఇన్వెస్టర్లకు ముకేశ్ అంబానీ బాధ్యతల నుంచి వైదొలగే అంశంపై ఆందోళనలు నెలకొని ఉండవచ్చు. అయితే ముకేశ్ అంబానీ విజయవంతమైన ప్రణాళికలను సానుకూలంగా పరిగణించాలి. ముగ్గురికీ ఆర్‌ఐఎల్ ప్రధాన బిజినెస్ యూనిట్ల (టెలికం, రిటైల్, నూతన ఇంధన) యాజమాన్య బాధ్యతలను అప్పగించారు. తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలూ తలెత్తకుండా స్పష్టమైన విభజనను చేపట్టారం’టూ క్రెడిట్‌సైట్స్ నివేదికలో వివరించింది.
దీంతో ముకేశ్ ఉన్నట్లుండి బాధ్యతల నుంచి తప్పుకోవడం అనే రిస్కుకు చెక్ పెట్టారని పేర్కొంది. అంతేకాకుండా తదుపరి తరం యాజమాన్య నిర్వహణలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మరింత అభివృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి ప్రధాన బిజినెస్ విభాగాలు స్వతంత్రంగా ఎదిగేందుకు దారి చూపుతూ హోల్డింగ్ కంపెనీగా ఆర్‌ఐఎల్ ఆవిర్భవించనున్నట్లు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment