రిలయన్స్ లాభాల రికార్డ్..
క్యూ3లో నికర లాభం రూ.7,290 కోట్లు; 39 శాతం జూమ్
* ఆదాయం రూ. 68,261 కోట్లు; 27 శాతం తగ్గుదల
* ఏడేళ్ల గరిష్టానికి జీఆర్‌ఎం; 11.5 డాలర్లు...
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల రికార్డులతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో కంపెనీ ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ.7,290 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,256 కోట్లతో పోలిస్తే ఏకంగా 38.7 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ చరిత్రలో ఒక క్వార్టర్‌కు ఇంత అత్యధిక స్థాయిలో లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రధానంగా స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం)లు అనూహ్యంగా ఎగబాకడం, పెట్రోకెమికల్స్ విభాగంలో మార్జిన్లు పుంజుకోవడం వంటివి రికార్డుస్థాయి లాభాలకు దోహదం చేసింది. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఘోరంగా పడిపోయిన ప్రభావంతో రిలయన్స్ మొత్తం ఆదాయం భారీగా క్షీణించింది. రూ.68,261 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ3లో రూ93,528 కోట్లతో పోలిస్తే 27 శాతం దిగజారింది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ3లో రూ.6,950 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు.
దూసుకెళ్లిన జీఆర్‌ఎం...
ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో రిలయన్స్ జీఆర్‌ఎం 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఏడేళ్ల గరిష్టస్థాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో జీఆర్‌ఎం 7.3 డాలర్లే. ఈ ఏడాది క్యూ2లో జీఆర్‌ఎం 10.6 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా కంపెనీకి లభించిన రాబడిని స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం)గా వ్యవహరిస్తారు.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు...
* జామ్ నగర్‌లోని జంట రిఫైనరీల ద్వారా క్యూ3లో రికార్డు స్థాయిలో 18 మిలియన్ టన్నుల క్రూడ్ శుద్ధిచేసినట్లు కంపెనీ తెలిపింది.
* రిఫైనింగ్ వ్యాపారం స్థూల లాభం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో దాదాపు రెట్టింపై రూ.6,491 కోట్లకు ఎగబాకింది. ఇక పెట్రోకెమికల్స్ వ్యాపారానికి సంబంధించి 28 శాతం వృద్ధితో రూ.2,639 కోట్లుగా నమోదైంది.
* కేజీ-డీ6 క్షేత్రం నుంచి చమురు, గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోవడం.. ధరల పతనం కారణంగా ఈ విభాగం ఆదాయం 40 శాతం క్షీణించి రూ.1,765 కోట్లకు పరిమితమైంది. స్థూల లాభం 89 శాతం దిగజారి రూ.832 కోట్ల నుంచి రూ.90 కోట్లకు క్షీణించింది.
* టెలికం అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే సన్నాహాల్లో ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే, ఎప్పటినుంచి సర్వీసులు వాణిజ్యపరంగా మొదలవుతాయనేది వెల్లడించలేదు. ఇటీవలే రిలయన్స్ గ్రూప్‌లోని లక్ష మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు 4జీ సేవలను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
* మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ3లో కీలమైన మైలురాయిని అధిగమించింది. కంపెనీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా రూ.6,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,686 కోట్లతో పోలిస్తే 29 శాతం ఎగసింది. ఇక రిలయన్స్ రిటైల్ స్థూల లాభం రూ.227 కోట్ల నుంచి రూ.243 కోట్లకు పెరిగింది.
* కొన్ని ఆస్తుల విక్రయం కారణంగా రిలయన్స్ ఇతర ఆదాయం క్యూ3లో రూ.2,426 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ3లో ఇది రూ.2,340 కోట్లు.
* డిసెంబర్ చివరినాటికి రిలయన్స్ నగదు నిల్వలు రూ.91,736 కోట్లకు పెరిగాయి. ఇక మొత్తం రుణాలు కూడా రూ.1,78,077 కోట్లకు ఎగబాకాయి.
* ఫలితాల నేపథ్యంలో మంగళవారం రిలయన్స్ షేరు ధర బీఎస్‌ఈలో 2.51 శాతం ఎగసి రూ.1,043 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
ప్రపంచ స్థాయి రిఫైనింగ్, పెట్రోకెమికల్ కార్యకలాపాలతో మరోసారి ఆకర్షణీయమైన ఫలితాలను సాధించగలిగాం. ఏడేళ్లకుపైగా గరిష్టానికి ఎగబాకిన జీఆర్‌ఎం ఆసరాతో రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డు పనితీరును నమోదుచేసింది. పటిష్టమైన పాలిమర్ మార్జిన్ల కారణంగా పెట్రోకెమికల్ వ్యాపారంలో అత్యంత మెరుగ్గా రాణించగలిగాం.
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.15,000 కోట్లు
* సమీకరించనున్న రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రైట్స్ ఇష్యూ జారీచేయడం ద్వారా రూ.15,000 కోట్లు సమీకరిస్తామని రిలయన్స్ జియో తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బీఎస్‌ఈకి నివేదించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీతో స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొంది. రిలయన్స్ జియో త్వరలో 4జీ సేవలను అందించనున్నది. రిలయన్స్ జియోపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇప్పటికే రూ. లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా నెలకు రూ.300-500 చార్జీకే 4జీ సేవలను, 4జీ హ్యాండ్‌సెట్‌లను రూ.4,000 చొప్పున అందించాలని రిలయన్స్ జియో యోచిస్తోంది.