ధనాధన్‌ రిలయన్స్‌! | Reliance Industries posts net profit of Rs 9435 crore in Q4 | Sakshi
Sakshi News home page

ధనాధన్‌ రిలయన్స్‌!

Published Sat, Apr 28 2018 1:18 AM | Last Updated on Sat, Apr 28 2018 10:30 AM

Reliance Industries posts net profit of Rs 9435 crore in Q4 - Sakshi

రిలయన్స్‌కు 2016–17 ఆర్థిక సంవత్సరం ఒక అద్భుతమైన ఏడాదిగా నిలిచిపోతుంది. అటు నిర్వహణపరంగా, ఇటు ఆర్థికంగాను అనేక రికార్డులను కంపెనీ సాధించింది. 10 బిలియన్‌ డాలర్ల స్థూల లాభాన్ని ఆర్జించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా ఆవిర్భవించింది.రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్‌ సేవలు(జియో).. ఈ నాలుగు కీలక వ్యాపారాల మెరుగైన పనితీరుతో రికార్డు పనితీరును నమోదుచేయగలిగాం.

రిటైల్, డిజిటల్‌ వ్యాపారాల్లో ప్రపంచ స్థాయి నిర్వహణ ప్రమాణాలు, నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలతో అత్యంత పటిష్టమైన పునాదులు వేశాం. మా కస్టమర్లకు అత్యంత మెరుగైన సేవలను అందించేందుకు ఇవి దోహదం చేస్తాయి. భారత్‌లో విస్తరిస్తున్న మార్కెట్‌ అవకాశాలతో వ్యాపారాల వృద్ధికి, వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత విలువను చేకూర్చేందుకు వీలవుతుంది. – ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ సీఎండీ


న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో రూ.9,435 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.8.046 కోట్లతో పోలిస్తే 17.3 శాతం వృద్ధి చెందింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక నికర లాభం కావడం గమనార్హం.

పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో మెరుగైన మార్జిన్లకు తోడు కంపెనీ టెలికం విభాగమైన రిలయన్స్‌ జియో, రిటైల్‌ వ్యాపార లాభాలు కలిసొచ్చాయి. మొత్తం ఆదాయం 39 శాతం ఎగబాకి రూ.92,889 కోట్ల నుంచి రూ.1,29,120 కోట్లకు దూసుకెళ్లింది. కాగా, గతేడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో లాభం రూ.9,423 కోట్లతో పోలిస్తే క్యూ4లో సీక్వెన్షియల్‌గా 0.1 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. ఆదాయం సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన(క్యూ3లో రూ.1,09,905 కోట్లు) 17.5 శాతం ఎగసింది. మార్కెట్‌ విశ్లేషకులు క్యూ4లో రిలయన్స్‌ రూ.9,635 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు.

తగ్గిన రిఫైనింగ్‌ మార్జిన్‌...
స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎం) గతేడాది క్యూ4లో 11 డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్‌ఎం 11.5 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్‌ ముడిచమురును శుద్ధిచేసి పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.

పూర్తి ఏడాదికీ రికార్డులు...
గత ఆర్థిక సంవత్సరం(2017–18) పూర్తి కాలానికి రిలయన్స్‌ రికార్డు లాభాలను ఆర్జించింది. రూ.36,075 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2016–17లో లాభం రూ.29,901 కోట్లతో పోలిస్తే 20.6% దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం కూడా 30.5% ఎగబాకి రూ.3,30,180 కోట్ల నుంచి రూ.4,30,731 కోట్లకు చేరింది. 2017–18లో రిలయన్స్‌ స్థూల లాభం రికార్డు స్థాయిలో రూ.74,184 కోట్లు(10 బిలియన్‌ డాలర్లు)గా నమోదైంది.

100 బిలియన్‌ డాలర్లకు చేరువలో..
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో బీఎస్‌ఈ ఇంట్రాడేలో  ఈ షేర్‌ దాదాపు 3 శాతం లాభంతో రూ.1,011ను తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.995 వద్ద ముగిసింది.

కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.6,30,185 కోట్లకు చేరింది. టీసీఎస్‌ తర్వాత విలువ పరంగా అత్యంత పెద్ద భారత కంపెనీ ఇదే. వంద బిలియన్‌ డాలర్ల విలువ ఉన్న కంపెనీగా ఇటీవలనే టీసీఎస్‌ అవతరించిన విషయం తెలిసిందే. టీసీఎస్‌ తర్వాత ఆ ఘనత సాధించే సత్తా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు మాత్రమే ఉందని నిపుణులంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ రూ.1,045ను దాటితే 100 బిలియన్‌ డాలర్ల కంపెనీ ఘనతను సాధిస్తుంది.

ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్‌ 15.8 శాతంగా నమోదైంది.
 పెట్రోకెమికల్స్‌ వ్యాపారం స్థూల లాభం 12 శాతం ఎగబాకి రూ.5,753 కోట్ల నుంచి రూ.6,435 కోట్లకు ఎగబాకింది. ఇది కూడా రికార్డే. అయితే, మార్జిన్‌ 17.1 శాతం నుంచి 16.9 శాతానికి తగ్గింది.
 ఇక రిఫైనింగ్‌ వ్యాపారం విషయానికొస్తే.. స్థూల లాభం 9 శాతం తగ్గుదలతో రూ.6,165 కోట్ల నుంచి రూ.5,607 కోట్లకు చేరింది. దీనికి స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎం) తగ్గడమే ప్రధాన కారణం.
 చమురు–గ్యాస్‌ వ్యాపార విభాగం నష్టాలు క్యూ4లో రూ.486 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగిపోయాయి. ఉత్పత్తి క్షీణత కొనసాగుతుంటం దీనికి కారణం.
 ఇక రిటైల్‌ వ్యాపారం స్థూల లాభం 208 శాతం వృద్ధితో రూ.1,086 కోట్లకు ఎగబాకింది. ఆదాయం కూడా రెట్టింపుస్థాయిలో రూ.24,183 కోట్లకు చేరింది. అయితే, ఈ వ్యాపారంలో ఇంకా మొదటి నికర లాభాన్ని కంపెనీ సాధించలేదు. కొత్తగా 86 రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లను ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 750 నగరాల్లో 3,837కు చేరింది.
    ఈ ఏడాది మార్చి నాటికి రిలయన్స్‌ మొత్తం రుణం రూ.2,18,763 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి చివరికి ఇది రూ.1,96,601 కోట్లు. కంపెనీ నగదు నిల్వలు రూ.78,063 కోట్లుగా నమోదయ్యాయి.
 రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.6 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.  

జియో దూకుడు
ఆరంభంతోనే ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రిలయన్స్‌ టెలికం కంపెనీ జియో... లాభాల జోరును కొనసాగిస్తోంది. గతేడాది క్యూ4లో కంపెనీ రూ.510 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యూ3లో లాభం రూ.504 కోట్లతో పోలిస్తే 1.2 శాతం పెరిగింది. కంపెనీ 4జీ సేవల ద్వారా ఒక్కో యూజర్‌ నుంచి ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.154 నుంచి రూ.137.10కు తగ్గింది.

అయితే, ఆదాయం మాత్రం 3.6 శాతం వృద్ధితో రూ.6,879 కోట్ల నుంచి రూ.7,128 కోట్లకు పెరిగింది. 18.66 కోట్ల మంది వినియోగదారులతో జియో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్‌ డేటా నెట్‌వర్క్‌గా నిలిచింది. 2016 సెప్టెంబర్‌లోనే కార్యకలాపాలను మొదలుపెట్టినప్పటికీ.. ఆర్థిక ఫలితాల విషయంలో 2017–18 తొలి పూర్తి ఆర్థిక సంవత్సరం. ఆరంభ ఏడాదిలోనే కంపెనీ రూ.723 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement