రిలయన్స్ లాభాల రికార్డ్
• క్యూ3లో స్టాండెలోన్ నికర లాభం
• రూ.8,022 కోట్లు; 10 శాతం వృద్ధి
• ఆదాయం 9 శాతం అప్; రూ.66,606 కోట్లు
• స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.8 డాలర్లు
భావిభాతర అవసరాలకు అనుగుణంగా అనుసంధానమైన మా వ్యాపార విభాగాలు, అత్యుత్తమ నిర్వహణ ప్రక్రియలతో మరోసారి రికార్డు పనితీరును సాధించాం. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులను దీటుగా ఎదుర్కొన్నాం. రిఫైనింగ్ వ్యాపారం దూసుకెళ్తోంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ జీఆర్‌ఎంలో రెండంకెల వృద్ధిని సాధించాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరగడం ఈ జోరుకు దోహదం చేస్తోంది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) మరోసారి రికార్డు స్థాయిలో లాభాల మోతమోగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ స్టాండెలోన్(కీలకమైన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, మార్కెటింగ్ వ్యాపారం) ప్రాతిపదికన రూ.8,022 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,296 కోట్లతో పోలిస్తే.. 10 శాతం వృద్ధి చెందింది. వ్యయాలు పెరిగినప్పటికీ.. ఇతర ఆదాయం భారీగా ఎగబాకడం లాభాల జోరుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం క్యూ3లో రూ.66,606 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.61,125 కోట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది.
కన్సాలిడేటెడ్‌గా ఇలా...
అనుబంధ సంస్థలతో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) చూస్తే రిలయన్స్ క్యూ3లో రూ.7,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 7,245 కోట్లతో పోలిస్తే 3.6 శాతం వృద్ధి చెందింది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం 16.1 శాతం వృద్ధితో రూ. 72,513 కోట్ల నుంచి రూ.84,189 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చిచూస్తే(సీక్వెన్షియల్‌గా) స్టాండెలోన్ లాభం 4.1 శాతం, ఆదాయం 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఇక కన్సాలిడేటెడ్ లాభం సీక్వెన్షియల్‌గా 4.1 శాతం, ఆదాయం 3.1 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
జీఆర్‌ఎం పెరిగింది...
రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) మూడో త్రైమాసికంలో 10.8 డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 10.1 డాలర్లతో పోలిస్తే వృద్ధి సాధించింది. అయితే, క్రితం ఏడాది మూడో క్వార్టర్‌లో జీఆర్‌ఎం 11.5 డాలర్లతో పోలిస్తే తగ్గింది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. కాగా, సింగపూర్ ప్రామాణిక జీఆర్‌ఎం డిసెంబర్ క్వార్టర్‌లో సీక్వెన్షియల్‌గా 5.1 డాలర్ల నుంచి 6.7 డాలర్లకు పెరిగింది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
⇔ క్యూ3లో రిఫైనింగ్, మార్కెటింగ్ విభాగం ఆదాయం 7.5 శాతం వృద్ధితో రూ.61,693 కోట్లకు చేరింది. అయితే, స్థూల లాభం మాత్రం 4.3 శాతం క్షీణించి రూ.6,194 కోట్లుగా నమోదైంది.
⇔ పెట్రోకెమికల్స్ ఆదాయం 17.8% వృద్ధితో రూ.22,854 కోట్లకు చేరింది. స్థూల లాభం 3.4% తగ్గి రూ.3,301 కోట్లుగా నమోదైంది.
⇔ ఇక చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారం ఆదాయం క్యూ3లో 31 శాతం క్షీణించి.. రూ.1,762 కోట్ల నుంచి రూ. 1,215 కోట్లకు పడిపోయింది. గతేడాది క్యూ3లో రూ.258 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించగా.. ఈసారి రూ.295 కోట్ల స్థూల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
⇔ కేజీ–డీ6 క్షేత్రాల్లో ఉత్పత్తి డిసెంబర్ క్వార్టర్‌లో 0.26 మిలియన్ బ్యారెల్స్(ఎంఎంబీబీఎల్)కు, సహజవాయువు ఉత్పత్తి 24.4 బిలియన్ ఘనపుటడుగుల(బీసీఎఫ్)కు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఉత్పత్తి వరుసగా 28 శాతం,
29 శాతం చొప్పున దిగజారింది.
⇔ పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రభావం ఉన్నప్పటికీ... క్యూ3లో రిలయన్స్ రిటైల్ విభాగం ఆదాయం ఏకంగా 47.2% ఎగబాకి రూ.5,901 కోట్ల నుంచి రూ. 8.688 కోట్లకు ఎగబాకింది. ఇక స్థూల లాభం 41% ఎగసి రూ.237 కోట్ల నుంచి రూ.333 కోట్లకు ఎగసింది.
⇔ ఇతర ఆదాయం రూ.2,440 కోట్ల నుంచి రూ.2,736 కోట్లకు చేరింది.
⇔ డిసెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణం రూ.1,94,381 కోట్లకు పెరిగింది. సెప్టెబర్ నాటికి రుణభారం రూ.1,89,132 కోట్లుగా ఉంది. ఇక కంపెనీవద్ద నగదు, తత్సబంధ నిల్వలు డిసెంబర్ నాటికి రూ.82,533 కోట్ల నుంచి రూ.76,339 కోట్లకు తగ్గాయి.
⇔ డిసెంబర్ చివిరినాటికి టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది.
⇔ కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 1.21 శాతం క్షీణించి రూ.1,077 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
రూ. 30 వేల కోట్ల రైట్స్ ఇష్యూ...
ముంబై: రైట్స్ ఇష్యూ ద్వారా రూ.30 వేల కోట్ల మేర నిధులను సమీకరించనున్నట్లు రిలయన్స్ సోమవారం ప్రకటించింది. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీద్వారా దీన్ని పూర్తిచేయనున్నట్లు తెలిపింది. ఈ నిధులను జియో సేవల విస్తరణకోసం వినియోగిస్తామని వివరించింది. రూ.10 ముఖ విలువగల ఒక్కో డిబెంచర్‌పై 9 శాతం వడ్డీరేటును కంపెనీ ఆఫర్ చేస్తోంది.