న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 741 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,973 కోట్ల నుంచి రూ. 3,913 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,416 కోట్ల నుంచి రూ. 3,006 కోట్లకు పెరిగాయి.
ఈ కాలంలో వాణిజ్య వాహన భాగస్వామ్య సంస్థ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ 13 శాతం వృద్ధితో 18,162 యూనిట్లను విక్రయించినట్లు ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు సైతం 31 శాతం జంప్‌చేశాయి. 2,19,898 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత కొద్ది నెలలుగా ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు హంటర్ 350, సూపర్ మీటియోర్ 650కు అంతర్జాతీయంగా డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఎండీ సిద్ధార్థ లాల్ తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.2 శాతం నీరసించి రూ. 3,180 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment