ఎస్‌బీఐ లాభం 71% జూమ్‌ | SBI Q3 Results: SBI Q3 net profit up 71% on spurt in other income | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభం 71% జూమ్‌

Published Sat, Feb 11 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

ఎస్‌బీఐ లాభం 71% జూమ్‌

ఎస్‌బీఐ లాభం 71% జూమ్‌

క్యూ3లో రూ. 2,152 కోట్లు
మొండిబాకీలకు కేటాయింపుల తగ్గింపు, ఇతర ఆదాయం ఊతం


ముంబై: మొండిబకాయిలకు కేటాయింపుల తగ్గుదల, ఇతర ఆదాయం ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,152 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 1,259 కోట్లతో పోలిస్తే 71 శాతం వృద్ధి. స్టాండెలోన్‌ ప్రాతిపదికన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం 134 శాతం వృద్ధి చెంది రూ. 2,610 కోట్లుగా నమోదైంది.

గత క్యూ3లో ఇది రూ. 1,115 కోట్లు. 2015–16 క్యూ3లో ఆర్థిక ఫలితాలపై అసెట్‌ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్‌) ప్రతికూల ప్రభావం భారీగా పడటంతో, అప్పట్లో లాభాల గణాంకాలు తమ సాధారణ పనితీరుకు తగినట్లుగా నమోదు కాలేదని బ్యాంక్‌ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య తెలిపారు. డిపాజిట్లు వెల్లువెత్తడం, వాటిని ట్రెజరీల్లో సముచితంగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల తాజాగా మూడో త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 8.07 శాతం మేర వృద్ధి చెంది రూ. 40,644 కోట్ల నుంచి రూ. 43,926 కోట్లకు చేరిందని ఆమె పేర్కొన్నారు.

ఇతర ఆదాయం 15% వృద్ధి..
క్యూ3లో ఎస్‌బీఐ మొత్తం ఆదాయం 14.67 శాతం పెరిగి రూ. 53,588 కోట్లకు చేరింది. ఇందులో ఇతర ఆదాయం 58.73 శాతం వృద్ధితో రూ. 9,662 కోట్లుగా నమోదైంది. డిసెంబర్‌లో ఎస్‌బీఐ తమ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 3.9 శాతం వాటాలను కేకేఆర్, టెమాసెక్‌లకు రూ. 1,794 కోట్లకు విక్రయించింది. మరోవైపు, సమీక్షాకాలంలో మొండిబకాయిలకు  మొత్తం కేటాయింపుల పరిమాణం 17.10% పెరుగుదలతో రూ.9,933 కోట్లకు చేరాయి. అయితే కొత్త కేటాయింపులు 5 శాతం తగ్గాయి. అటు, నికర వడ్డీ మార్జిన్‌ 3.22 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గింది. ఫీజు ఆదాయం 14.30 శాతం వృద్ధితో రూ. 3,509 కోట్ల నుంచి రూ. 4,011 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు సుమారు 36% పెరుగుదలతో రూ. 20,40,778 కోట్లకు చేరగా, స్థూల రుణాల పరిమాణం 4.81 శాతం వృద్ధితో రూ.14,97,164 కోట్లకు పెరిగింది.

పెరిగిన ఎన్‌పీఏలు..
స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 5.10 శాతం నుంచి 7.23 శాతానికి ఎగియగా.. నికర ఎన్‌పీఏలు 2.89 శాతం నుంచి 4.24 శాతానికి పెరిగాయి. క్యూ3లో కొత్తగా మరో రూ. 10,185 కోట్ల మేర ఎన్‌పీఏలు నమోదయ్యాయని, అయితే ఇవి తాము ముందుగా ప్రకటించిన అంచనాలకు లోబడే ఉన్నాయని అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ. 40,000 కోట్ల మేర మొండి బకాయిలు నమోదు కావొచ్చని భావించగా.. తొలి మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ. 29,316 కోట్ల స్థాయికి చేరాయన్నారు. వీటిలో 73 శాతం (సుమారు రూ.17,992 కోట్లు) అసెట్స్‌ను వాచ్‌లిస్టులో ఉంచినట్లు ఆమె చెప్పారు.

డీమోనిటైజేషన్‌తో ఒక క్వార్టర్‌ వెనక్కి..
పెద్ద నోట్ల రద్దు తో పనితీరు ఒక త్రైమాసిక కాలం పాటు వెనక్కిపోయినట్లయిందని భట్టాచార్య తెలిపారు. గృహ, వ్యవసాయ, చిన్న మధ్య తరహా సంస్థలకిచ్చే రుణాలపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. అయితే,  ఈ క్వార్టర్‌ ముగిసేటప్పటికి మళ్లీ సాధారణ స్థాయి నెలకొనవచ్చన్నారు. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ మార్చిలోగా పూర్తి చేయాలని భావించినప్పటికీ డీమోనిటైజేషన్‌ వల్ల వాయిదాపడిందని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలిస్తే అప్పుడు మొదలుపెడతామని చెప్పారు.

రేట్ల కోత ఇప్పట్లో ఉండదు..
బ్యాంకులు వడ్డీ రేట్లను మరింతగా తగ్గించడంపై దృష్టి పెట్టా లంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సూచించినప్పటికీ.. ప్రస్తుతం ఆ అవకాశాలేమీ లేవని భట్టాచార్య పేర్కొన్నారు. ‘గవర్నర్‌ ఏ బ్యాంకు గురించి మాట్లాడారో నాకు తెలియదు. మా బ్యాంకు సంగతి చూస్తే.. తగ్గింపు మొదలైనప్పుడు 10%గా ఉన్న రేటు ప్రస్తుతం 8% స్థాయికి వచ్చింది. ఆర్‌బీఐ 175 బేసిస్‌ పాయింట్లే పాలసీ రేటు తగ్గిస్తే.. మేం ఎంసీఎల్‌ఆర్‌ను 200 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించాం. మేం అర్‌బీఐ కన్నా ఎక్కువే తగ్గించినట్లవుతుంది కాబట్టి.. మరింత రేట్ల కోతకు అంతగా అవకాశాలు లేవు’ అని ఆమె వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement