న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ మార్చి త్రైమాసికానికి మెరుగైన పనితీరు చూపించింది. ఎన్‌పీఏలకు కేటాయింపులు తగ్గడంతో విశ్లేషకుల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 83 శాతం వృద్ధితో రూ.16,695 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.9,113 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 29 శాతం పెరిగి రూ.40,393 కోట్లకు చేరింది.
క్రితం ఏడాది ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం రూ.31,198 కోట్లుగా ఉండడం గమనార్హం. ఒక్కో షేరుకు రూ.11.30 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. మొండి రుణాలకు (ఎన్‌పీఏలు) కేటాయింపులు, కంటింజెన్సీలు 54 శాతం తగ్గి రూ.3,316 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.7,237 కోట్లుగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యత మెరుగుపడింది.
స్థూల ఎన్‌పీఏలు 2.78 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 3.97 శాతంగా ఉంటే, 2022 డిసెంబర్ చివరికి 3.14 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 0.67 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది మార్చి చివరికి ఇవి 1.08 శాతం, 2022 డిసెంబర్ చివరికి 0.77 శాతంగా ఉండడం గమనార్హం. దేశీయ వ్యాపారంపై నికర వడ్డీ మార్జిన్ 3.84 శాతానికి పుంజుకుంది.
♦ మార్చి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ నికర లాభం (అనుబంధ సంస్థలతో కలిపి) క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9,994 కోట్ల నుంచి రూ.18,343 కోట్లకు వృద్ధి చెందింది. 90 శాతానికి పైగా పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,08,034 కోట్ల నుంచి, రూ.1,36,852 కోట్లకు పెరిగింది.
♦ మార్చి త్రైమాసికానికి నిర్వహణ లాభం 25 శాతం వృద్ధితో రూ.24,621 కోట్లకు చేరుకుంది.
♦ ప్రొవిజన్ కవరేజ్ రేషియో 1.35 శాతం మెరుగుపడి 76.39 శాతంగా ఉంది.
♦ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. మార్చి చివరికి రూ.32.69 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ రుణాలు వార్షికంగా 12 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలు 18 శాతం పెరిగాయి.
♦ డిపాజిట్లు 9 శాతం వృద్ధితో రూ.44.23 లక్షల కోట్లకు చేరాయి.
♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ స్టాండలోన్ నికర లాభం రూ.50,232 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021–22)తో పోలిస్తే 58 శాతం పెరిగింది. స్టాండలోన్ ఆదాయం రూ.1,06,912 కోట్లుగా నమోదైంది.
♦ 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ లాభం రూ.35,374 కోట్ల నుంచి రూ.56,558 కోట్లకు చేరింది. ఆదాయం రూ.4,06,973 కోట్ల నుంచి రూ.4,73,378 కోట్లకు చేరింది.
♦ బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 2 శాతానికి పైగా నష్టపోయి రూ.574 వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో రూ.571.40 కనిష్ట స్థాయిని చూసింది.
Comments
Please login to add a commentAdd a comment