క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు! | Banks Will See Good Recoveries From NPAs In Q3 And Q4 Says SBI Chairman | Sakshi
Sakshi News home page

క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!

Published Thu, Jan 9 2020 2:55 AM | Last Updated on Thu, Jan 9 2020 2:55 AM

Banks Will See Good Recoveries From NPAs In Q3 And Q4 Says SBI Chairman  - Sakshi

ముంబై: భారత్‌ బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన కారణమనీ వివరించారు. రుణాలకు సంబంధించి ఎడిల్వీస్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు.  కొన్ని కీలక అంశాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే...

రుణ వృద్ధి ‘పరుగు’ కష్టమే!
►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని (2019 ఏప్రిల్‌–సెప్టెంబర్) 2018లోని ఇదే కాలంతో పోలిస్తే ఎస్‌బీఐకి సంబంధించినంతవరకూ రుణ వృద్ధిలేకపోగా ప్రతికూలత నమోదయ్యింది. అయితే అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన రుణ వృద్ధి దేశీయంగా 5 శాతానికి తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించి ఈ శాతం 7గా ఉంది. మరికొంత కాలం రుణ వృద్ధి మందగమనంలోనే ఉండే అవకాశం ఉంది. 2018–19లో మొత్తం బ్యాంకింగ్‌  రుణ వృద్ధిరేటు 13.3 శాతం. అయితే  2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముం దటి ఏడాదితో పోలి్చచూస్తే పెరుగుదల 7.1 శాతం మాత్రమే. విలువ రూపంలో రూ.92.87 లక్షల కోట్ల నుంచి రూ.99.47 లక్షల కోట్లకు చేరింది. 2019–20లో  రుణ వృద్ధిరేటు అరవై సంవత్సరాల కనిష్టస్థాయి 6.5 – 7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ– ఇక్రా ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. రుణ మంజూరీల విషయం లో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.  

►చమురు గ్యాస్, సోలార్, రహదారుల రంగాల నుంచి బ్యాంకులకు రుణాల డిమాండ్‌ వస్తోంది.  

►అమెరికా–ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది కరెంట్‌ అకౌంట్‌లోటు, కరెన్సీ విలువపైనా ప్రభావం చూపే అంశం.  

► కొన్ని ప్రతికూలతలు ఉన్నా మొత్తంగా  ప్రభుత్వ ఫైనాన్షియల్‌ పరిస్థితులు బాగున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు (జీడీపీలో 3.3 %) కట్టడిలో ఉండాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ప్రభుత్వం పట్టంచుకుంటుందని భావించడం లేదు. 2019– 20 ఆరి్థక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3%) బడ్జెట్‌ లక్ష్యం. కానీ అక్టోబర్‌ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు(బడ్జెట్‌ అంచనాల్లో 102.4 శాతానికి) చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement