న్యూఢిల్లీ: డిజిటైజేషన్, కొంగొత్త టెక్నాలజీలు.. బ్యాంకింగ్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఖర్చులు తగ్గించి, సర్వీసులను విస్తృతంగా అందించేందుకు తోడ్పడుతున్న డిజిటల్ విప్లవానికి దేశీ బ్యాంకులు అలవాటు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా సర్వీసులు అందించడంపై బ్యాంకులు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటోందని ఖారా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీల వినియోగంపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘పరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను డిజిటల్ ఆవిష్కరణలు మార్చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఈ మార్పులు మరింత వేగవంతం అవుతున్నాయి.
ప్రస్తుతం డిజిటైజేషన్, డిజిటల్ ఆవిష్కరణలనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు వ్యూహాత్మక ప్రాధాన్యత అంశాలుగా మారాయి‘ అని ఖారా వివరించారు. మారే పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ విధానాలకు వేగంగా మళ్లాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడం, వినియోగించుకోవడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటివి డిజిటల్ రుణాల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఖారా పేర్కొన్నారు.
రుణాల ప్రక్రియ కూడా డిజిటల్‌గా మారాలి..
ప్రస్తుతం పేమెంట్ వ్యవస్థ డిజిటల్‌గా మారిందని, ఇక రుణాల విభాగం కూడా డిజిటల్‌గా మారాల్సిన సమయం వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా చెప్పారు. బ్యాంకులు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వివరించారు. ఇప్పటికే కొన్ని రుణ ఉత్పత్తుల డిజిటైజేషన్‌ను మొదలుపెట్టాయని పేర్కొన్నారు.
బ్యాంకింగ్ పరిశ్రమలో టెక్నాలజీ, ఆవిష్కరణల వినియోగం క్రమంగా పెరుగుతోందని, కరోనా వైరస్ మహమ్మారి రాకతో ఇది మరింత వేగం పుంజుకుందని మెహతా తెలిపారు.
మరోవైపు, భారత్ చాలా వేగంగా డిజిటల్ ఆధారిత ఎకానమీగా రూపాంతరం చెందుతోందని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) కంట్రీ హెడ్ (ఇండియా) వెండీ వెర్నర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫిన్‌టెక్ వినియోగం భారత్‌లోనే ఉందని, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాలు కూడా ఈ విషయంలో ముందుంటున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో ఫిన్‌టెక్ మార్కెట్ 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని.. ఇది మరింతగా వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.
డిజిటైజేషన్‌తో బ్యాంకింగ్‌లో పెను మార్పులు
Published Sat, Mar 12 2022 2:41 AM | Last Updated on Sat, Mar 12 2022 2:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment