పెట్రోలియంపైనా జీఎస్టీ!
శ్రీనగర్: పెట్రోలియం ఉత్పత్తుల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందేనని ఆర్థిక రంగ నిపుణులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. మూడ్రోజుల క్రితం శ్రీనగర్‌లో జరిగిన జీఎస్టీ మండలి భేటీలో 1200 వస్తువులు, 500 సేవలపై పన్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన పెట్రోలియం ఉత్పత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మొదటి కొన్నేళ్లు పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించి ఎప్పటిలానే ఎక్సైజ్ పన్ను, వ్యాట్ వసూలు చేయాలని ప్రతిపాదించారు. పెట్రోలియం ఉత్పత్తులైన క్రూడాయిల్, సహాజవాయువు, ఏవియేషన్ ఇంధనం, డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించగా.. కిరోసిన్, నాఫ్తా, ఎల్పీజీపై జీఎస్టీనే అమలు చేయనున్నారు. ఈ ప్రతిపాదనను జమ్మూ కశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ డ్రబు తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ఐదింటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. అలా జరగకుంటే స్వాతంత్య్రం అనంతరం మొదటిసారిగా అమలు చేస్తున్న భారీ పన్ను సంస్కరణతో ప్రయోజనమేంటని ప్రశ్నించారు.
‘ఎందుకు వ్యవస్థను బలహీనం చేస్తారు. మీరు ముందడుగు వేసి విధానాన్ని రూపొందిం చినప్పుడు.. ఇలాంటి తెలివితక్కువ పనులతో ఎందుకు గందరగోళం సృష్టిస్తారు’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాసులు కురిపించేవి ఆ ఐదు పెట్రోలియం ఉత్పత్తులేనని, వాటిని జీఎస్టీ పరిధి నుంచి తప్పిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని డ్రబు అభిప్రాయపడ్డారు. జూలై 1 నుంచే పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని పలువురు ఆర్థిక, పన్ను రంగ నిపుణులు ఇప్పటికే సూచించారు.