జైసల్మేర్: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను భారం తొలగించాలన్న కీలక డిమాండ్‌పై జీఎస్‌టీ కౌన్సిల్ ఈ రోజు భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఖరీదైన చేతి గడియారాలు, పాదరక్షలు, వస్త్రాలపై పన్ను పెంపు, కొన్ని రకాల ఉత్పత్తులపై 35 శాతం ప్రత్యేక సిన్ (హానికారక) ట్యాక్స్‌పైనా చర్చించనున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరగనుంది. కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొననున్నారు.
148 ఉత్పత్తుల పన్ను రేట్ల క్రమబద్దీకరణపై జీవోఎం నివేదిక కూడా కౌన్సిల్ అజెండాలో ముఖ్యాంశంగా ఉంటుందని తెలుస్తోంది. విమానయాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీపై 18 శాతం పన్ను (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో) ఉండగా, ఇన్‌పుట్ ట్యాక్స్ ప్రయోజనం లేకుండా 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. వినియోగించిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలంటూ ఫిట్‌మెంట్ కమిటీ కౌన్సిల్‌కు నివేదించనున్నట్టు తెలిసింది.
ప్రధాన అంశాలు ఇవే..
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్‌టీని పూర్తిగా మినహాయించేందుకు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం నవంబర్‌లోనే అంగీకారం తెలిపింది.
రూ.5 లక్షల సమ్ అష్యూరెన్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పూర్తి పన్ను మినహాయింపునకు సైతం అంగీకరించింది. ఇందుకు సంబంధించి జీవోఎం ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది.
రూ.5 లక్షలకు మించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను రేటులో ఎలాంటి ఉపశమనం ఉండదని తెలుస్తోంది.
ఎయిరేటెడ్ బెవరేజెస్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని జీవోఎం ఇప్పటికే తన సిఫారసులను సమర్పించడం గమనార్హం.
గేమింగ్ డిపాజిట్లపై కాకుండా ప్లాట్‌ఫామ్ ఫీజులపైనే 28 శాతం జీఎస్‌టీ విధించాలని స్కిల్ ఆన్‌లైన్ గేమ్స్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌వోజీఐ) డిమాండ్ చేసింది. తద్వారా ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు పన్ను ఆర్బిట్రేజ్ ప్రయోజనం పొందకుండా అడ్డుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి సూచించింది.
ఉపాధి కల్పన, జీడీపీలో కీలక పాత్ర పోషించే గేమింగ్ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్యాసినోల్లో గేమర్లు చేసే డిపాజిట్లపై పన్ను రేటు 18 శాతం ఉండగా, 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతానికి పెంచడం గమనార్హం.
ఇదీ చదవండి: పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?
అదనపు ఫ్లోర్ స్పేస్‌పై జీఎస్‌టీ వద్దు: క్రెడాయ్
అదనపు ఫ్లోర్ స్పేస్ (విస్తీర్ణం) కోసం చెల్లించే ఛార్జీలపై జీఎస్‌టీ విధించొద్దంటూ ప్రభుత్వాన్ని క్రెడాయ్ కోరింది. డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు రియల్టర్ల మండలి క్రెడాయ్ ఒక లేఖ రాసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)/ అదనపు ఎఫ్‌ఎస్‌ఐ కోసం స్థానిక అధికారులకు చెల్లించిన ఛార్జీలపై 18 శాతం జీఎస్‌టీని విధించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది. ఈ ఛార్జీ విధింపు నిర్మాణ వ్యయాలను పెంచేస్తుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 10 శాతం వరకు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు వ్యయాల్లో ఎఫ్‌ఎస్‌ఐ/అదనపు ఎఫ్‌ఎస్‌ఐ అధిక వాటా కలిగి ఉన్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. ప్రతిపాదిత జీఎస్‌టీ విధింపు ఇళ్ల సరఫరా, డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment