
న్యూఢిల్లీ: రాజ్యాంగపరంగా పెట్రోలియం ఉత్పత్తులు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోనే ఉన్నాయని కేంద్రం బుధవారం పార్లమెంటుకు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి ఎప్పటి నుంచి తీసుకురావాలన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాజ్యాంగపరంగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది.
ఇటీవల చమురు ధరలు పెరగడంపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ.. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 279ఏ(5) ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులపై వస్తుసేవల పన్నును ఎప్పటి నుంచి విధించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేస్తుంది. కాబట్టి రాజ్యాంగపరంగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయి’ అని చెప్పారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో లీటర్‌కు రూ.2 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment