ఎగుమతులు మూడో నెలా డౌన్‌ | Exports fall for 3rd consecutive month by 12. 7 in April | Sakshi
Sakshi News home page

ఎగుమతులు మూడో నెలా డౌన్‌

Published Tue, May 16 2023 4:28 AM | Last Updated on Tue, May 16 2023 4:28 AM

Exports fall for 3rd consecutive month by 12. 7 in April - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు కూడా వరుసగా అయిదో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 14 శాతం క్షీణించి 49.9 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. గత ఏప్రిల్‌లో ఇవి 58.06 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

భారత్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరప్‌లో డిమాండ్‌ అంతగా లేకపోవడం .. ఎగుమతులు మందగించడానికి కారణమైంది. పరిస్థితి మెరుగుపడటానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) సంతోష్‌ కుమార్‌ సారంగి తెలిపారు. ‘యూరప్, అమెరికాలో డిమాండ్‌ క్షీణించింది. వచ్చే 2–3 నెలలు కూడా అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయితే, చైనా ఎకానమీ కోలుకుని.. యూరప్, అమెరికా మార్కెట్లలో కూడా కాస్త డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉన్నందున ఆగస్టు–సెప్టెంబర్‌ తర్వాత నుంచి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు.  

20 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు ..
ఎగుమతులు, దిగుమతుల మందగమనంతో ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 20 నెలల కనిష్టమైన 15.24 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. చివరిసారిగా 2021 ఆగస్టులో వాణిజ్య లోటు ఇంతకన్నా తక్కువగా 13.81 బిలియన్‌ డాలర్లుగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో ఇది 18.36 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కమోడిటీల ధరలు, రత్నాభరణాల్లాంటి ఉత్పత్తులకు డిమాండ్‌ క్షీణించడంతో దిగుమతులు తగ్గినట్లు సారంగి వివరించారు. ఎగుమతులపరంగా రాబోయే రోజుల్లోనూ రత్నాభరణాలు, కొన్ని రకాల ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, దుస్తులపై ప్రభావం ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారమున్న ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, నూనె గింజల్లాంటి వాటిపై వ్యాపారవర్గాలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.

2022–23 గణాంకాల సవరణ..
గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను వాణిజ్య శాఖ ఎగువముఖంగా సవరించింది. దీని ప్రకారం..
► 2022–23లో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులు 14.68 శాతం వృద్ధి చెంది 676.53 బిలియన్‌ డాలర్ల నుంచి 775.87 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 17.65 శాతం పెరిగి 894.19 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 118.31 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
► ఉత్పత్తుల ఎగుమతులు 6.74% వృద్ధితో 450.43 బిలియన్‌ డాలర్లకు చేరగా, దిగుమతులు 16.47% పెరిగి 714 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
► సేవల ఎగుమతులు 27.86 శాతం ఎగిసి 325.44 బిలియన్‌ డాలర్లకు, దిగుమతులు 22.54 శాతం పెరిగి 180 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement