క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఒకప్పటి నుంచి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి.. లక్షలు సంపాదించే పెద్ద ఉద్యోగి వరకు అందరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే గత అక్టోబర్ నెలలో 7.8 లక్షల మంది మాత్రమే క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 2023 అక్టోబర్ (16 లక్షలు) నెలతో పోలిస్తే 45 శాతం తగ్గినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి చూస్తే క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా? అనే అనుమానం కూడా వస్తోంది.
ఆనంద్ రాతీ నివేదిక ప్రకారం, 2024 మే నెలతో పోలిస్తే.. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డులు జారీ కొంత పెరిగిందని తెలుస్తోంది. అక్టోబర్ 2024లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన మొత్తం ఖర్చు రూ. 1.78 ట్రిలియన్‌లకు చేరుకుందని, ఇది 13 శాతం వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తుందని సమాచారం. మొత్తం ఖర్చు విలువలో ఈ కామర్స్ వాటా 61 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
గత ఏడాదితో పోలిస్తే.. ఈ అక్టోబర్ నెలలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య తక్కువ అయినప్పటికీ.. ఖర్చులు మాత్రం గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది ఏది కొనాలన్నా.. ఎక్కడ షాపింగ్ వంటివి చేయాలన్నా క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగుతున్నాయి. మొత్తం మీద క్రెడిట్ కార్డుల జారీ తగ్గినా.. వినియోగంలో మాత్రం ఎవ్వరూ తగ్గేదేలే అనేది స్పష్టంగా అర్దమైపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment