న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవనెలా నవంబర్‌లోనూ క్షీణతనే నమోదుచేశాయి. 2019 ఇదే నెలతో పోల్చి 2020 నవంబర్‌లో 9 శాతం పడిపోయి 23.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులూ ఇదే నెలలో 13.33 శాతం పడిపోయి 33.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 9.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిజానికి మార్చి నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఆరు నెలలు క్షీణ బాటన పయనించిన ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. 5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే ఆ మరుసటి నెల– అక్టోబర్‌లోనే తిరిగి పతనం నమోదయ్యింది. ఇప్పుడు వరుసగా రెండవనెల– నవంబర్‌లోనూ క్షీణతే నమోదుచేసుకోవడం గమనార్హం.
ఎనిమిది నెలల్లో 18 శాతం క్షీణత
ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలాన్ని చూస్తే, ఎగుమతులు 173.49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 211 బిలియన్ డాలర్లు. అంటే 18 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక ఇదే ఎనిమిది నెలల సమయంలో దిగుమతులు 33.56 శాతం పడిపోయి 215.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాలకు చేరుతాం: కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ఆశాభావం
కాగా, భారత్æ ఎగుమతులు 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల (1000 బిలియన్ డాలర్లు– డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరంగా 75 చొప్పున చూస్తే, రూ.75,00,000 కోట్లు) లక్ష్యాన్ని చేరుకుంటాయన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ వ్యక్తంచేశారు. ఇందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని బుధవారం జరిగిన ట్రేడ్ బోర్డ్ సమావేశంలో అన్నారు. ‘‘కోవిడ్–19 ప్రతికూల పరిస్థితుల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోంది.
పారిశ్రామిక రంగం సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోంది. అంతర్జాతీయంగా సప్రై చైన్స్ భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ పురోగతి దిశలో ఇది ఎంతో ప్రోత్సాహకర అంశం’’ అని ఆయన అన్నారు. భారత్ ప్రయోజనం పొందేందుకు వీలుగా ప్రోత్సాహం అందించాల్సిన వివిధ రంగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చక్కటి ప్రతిభ కనబరచడానికి వీలున్న 24 పారిశ్రామిక రంగాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment