రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది.
పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి...
► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి.
► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది.
► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది.
► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్‌టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment