growth exports
-
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
3 నెలల్లో..రూ.77 వేల కోట్ల జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు!
న్యూఢిల్లీ: రత్నాభరణాల (జెమ్స్ అండ్ జ్యుయలరీ) ఎగుమతులు జూన్‌లో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 21.41 శాతం వృద్ధితో రూ.25,295 కోట్ల విలువ మేర ఎగుమతులు నమోదైనట్టు.. జెమ్ అండ్ జ్యులయరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. 2021 జూన్ నెలలో ఎగుమతుల విలువ రూ.20,835 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) రత్నాభరణాల ఎగుమతులు 15 శాతం పెరిగి రూ.77,049 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన ఎగుమతులు రూ.67,231 కోట్లుగా ఉండడం గమనార్హం. యూఏఈతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (భారత్–యూఏఈ సీఈపీఏ) చేసుకున్న తర్వాత మధ్య ప్రాచ్యానికి ఎగుమతుల్లో సానుకూల వృద్ధి కనిపించినట్టు జీజేఈపీసీ వివరించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు జూన్‌లో 8 శాతానికి పైగా పెరిగి రూ.15,737 కోట్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు 35 శాతం వృద్ధితో రూ.5,641 కోట్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 35 శాతం పెరిగి రూ.6,258 కోట్లుగా ఉన్నాయి. యూఏఈతో ఒప్పందం ఫలితాలు ‘‘భారత్–యూఏఈ సీఈపీఏ మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే నెలలో ప్లెయిన్ గోల్డ్ జ్యుయలరీ ఎగుమతులు యూఏఈకి 72 శాతం పెరిగి రూ.1,048 కోట్లుగా ఉన్నాయి. జూన్‌లోనూ 68 శాతం పెరిగి రూ.1,451 కోట్లుగా ఉన్నాయి’’ అని జీజేఈపీసీ వెల్లడించింది. మొత్తం మీద ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూఏఈ వరకే ఎగుమతులు 10 శాతం వృద్ధితో రూ.9,803 కోట్లుగా నమోదయ్యాయి. ‘‘యూఏఈతో సీఈపీఏ ఒప్పందం వల్ల ప్లెయిన్ గోల్డ్ జ్యుయలరీ తక్షణమే లాభపడిన విభాగం. పరిమాణాత్మక మార్పును తీసుకొచ్చే విధానంతో మద్దతుగా నిలిచినందుకు వాణిజ్య శాఖకు ధన్యవాదాలు. ఈ ఒప్పందంలోని ప్రయోజనాలను భాగస్వాములు అందరూ వినియోగించుకుని లబ్ధి పొందాలి’’అని జీజేఈపీసీ చైర్మన్ కొలిన్ షా సూచించారు. -
ప్రోత్సాహకాలే...పరిశ్రమలకు వినాశకాలు!
ఎగుమతుల వృద్ధికి కరెన్సీ విలువ తగ్గింపు సరికాదు: రాజన్ వ్యాఖ్యలు లండన్: వ్యాపార రంగంలో నిర్ధిష్టంగా కొన్ని పరిశ్రమలకు మాత్రమే ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడాన్ని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఆ పరిశ్రమ నాశనానికే దారితీయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఎగుమతుల మందగమనం నుంచి బయటపడటం కోసం కరెన్సీ విలువను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పారిశ్రామిక చాంబర్లు పదేపదే కోరుతుంటాయని.. అయితే, ఇది ఏమాత్రం సరైన విధానం కాదని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ‘ప్రాజెక్ట్ సిండికేట్’కు రాసిన ఒక ఆర్టికల్‌లో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘భారత్ ఎగుమతులు పడిపోవడానికి కరెన్సీ విలువ ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయంగా పలు అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా డిమాండ్‌ను పెంచుకోవడం కోసం ధనిక దేశాలు తీసుకుంటున్న పాలసీ చర్యలు భారత్ వంటి వర్థమాన దేశాలకు రిస్కులు తెచ్చిపెడుతున్నాయి. ఏ పరిశ్రమలను ప్రోత్సహించాలంటూ చాలామంది అడుగుతుంటారు. అసలు నిర్ధిష్టంగా ఏదైనా రంగానికి రాయితీలు ఇవ్వడమంటే, ఆ పరిశ్రమ నాశనాన్ని కోరుకున్నట్లే. విధానకర్తలుగా మా పని కేవలం వ్యాపార కార్యకలాపాలు పెరిగేలా చూడటం. అంతేతప్ప వ్యాపార ప్రక్రియలను శాసించడం కాదు’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. కరువు, అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా... వరుసగా రెండేళ్లు కరువు పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతున్నప్పటికీ భారత్ 7 శాతం పైగా వృద్ధిరేటుతో నిలదొక్కుకోగలిగిందని గవర్నర్ పేర్కొన్నారు. ‘స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం ఒక దేశీయ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. దీని ఆధారంగా వృద్ధిని పెంచుకోవాలనేది లక్ష్యం. తద్వారా ఇక్కడి మార్కెట్లు విదేశీ ప్రతికూల అంశాలను సమర్థంగా తట్టుకునేందుకు వీలవుతుంది’ అని రాజన్ వివరించారు. రాజన్‌ను తొలగించాలి: స్వామి భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడానికి, పారిశ్రామిక రంగ పతనానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ కారణమని... ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించాల్సిందిగా బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. ‘ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన పనికిరాడనేది నా అభిప్రాయం. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తున్నామని చెబుతూ.. వడ్డీరేట్లను పెంచేశారు. దేశాన్ని ఇది తీవ్రంగా డెబ్బతీసింది. ఆయనను ఎంత తొందరగా షికాగోకు పంపేస్తే అంత మంచిది’ అని స్వామి వ్యాఖ్యానించారు. షికాగో యూనివర్సిటీ.. బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజన్.. ప్రస్తుతం అక్కడ సెలవులో ఉన్నారు.