ప్రోత్సాహకాలే...పరిశ్రమలకు వినాశకాలు!
ఎగుమతుల వృద్ధికి కరెన్సీ విలువ తగ్గింపు సరికాదు: రాజన్ వ్యాఖ్యలు
లండన్: వ్యాపార రంగంలో నిర్ధిష్టంగా కొన్ని పరిశ్రమలకు మాత్రమే ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడాన్ని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఆ పరిశ్రమ నాశనానికే దారితీయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఎగుమతుల మందగమనం నుంచి బయటపడటం కోసం కరెన్సీ విలువను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పారిశ్రామిక చాంబర్లు పదేపదే కోరుతుంటాయని.. అయితే, ఇది ఏమాత్రం సరైన విధానం కాదని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ‘ప్రాజెక్ట్ సిండికేట్’కు రాసిన ఒక ఆర్టికల్‌లో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
‘భారత్ ఎగుమతులు పడిపోవడానికి కరెన్సీ విలువ ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయంగా పలు అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా డిమాండ్‌ను పెంచుకోవడం కోసం ధనిక దేశాలు తీసుకుంటున్న పాలసీ చర్యలు భారత్ వంటి వర్థమాన దేశాలకు రిస్కులు తెచ్చిపెడుతున్నాయి. ఏ పరిశ్రమలను ప్రోత్సహించాలంటూ చాలామంది అడుగుతుంటారు. అసలు నిర్ధిష్టంగా ఏదైనా రంగానికి రాయితీలు ఇవ్వడమంటే, ఆ పరిశ్రమ నాశనాన్ని కోరుకున్నట్లే. విధానకర్తలుగా మా పని కేవలం వ్యాపార కార్యకలాపాలు పెరిగేలా చూడటం. అంతేతప్ప వ్యాపార ప్రక్రియలను శాసించడం కాదు’ అని రాజన్ అభిప్రాయపడ్డారు.
కరువు, అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా...
వరుసగా రెండేళ్లు కరువు పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతున్నప్పటికీ భారత్ 7 శాతం పైగా వృద్ధిరేటుతో నిలదొక్కుకోగలిగిందని గవర్నర్ పేర్కొన్నారు. ‘స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం ఒక దేశీయ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. దీని ఆధారంగా వృద్ధిని పెంచుకోవాలనేది లక్ష్యం. తద్వారా ఇక్కడి మార్కెట్లు విదేశీ ప్రతికూల అంశాలను సమర్థంగా తట్టుకునేందుకు వీలవుతుంది’ అని రాజన్ వివరించారు.
రాజన్‌ను తొలగించాలి: స్వామి
భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడానికి, పారిశ్రామిక రంగ పతనానికి ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ కారణమని... ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించాల్సిందిగా బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. ‘ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన పనికిరాడనేది నా అభిప్రాయం. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తున్నామని చెబుతూ.. వడ్డీరేట్లను పెంచేశారు. దేశాన్ని ఇది తీవ్రంగా డెబ్బతీసింది. ఆయనను ఎంత తొందరగా షికాగోకు పంపేస్తే అంత మంచిది’ అని స్వామి వ్యాఖ్యానించారు. షికాగో యూనివర్సిటీ.. బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజన్.. ప్రస్తుతం అక్కడ సెలవులో ఉన్నారు.