మీడియాతో వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నందున, ఏమి జరుగుతుందో తనకు వ్యక్తిగతంగా తెలియదని అన్నారు.
‘‘నాకు తెలిసినంత వరకు మేము ఎటువంటి చర్చలు జరపలేదు‘అని టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడుల అవకాశాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ ఈ రెండు విభాగాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహణలో ఉన్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్స్‌ను చూస్తుంది. స్టార్‌లింక్ అంశాలను అంతరిక్ష శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి, ఏమి జరుగుతుందో నాకు వ్యక్తిగత పరిజ్ఞానం లేదు’’ అని వాణిజ్యమంత్రి స్పష్టం చేశారు.
నేపథ్యం ఇదీ...
ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ చివరి క్షణంలో తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘టెస్లాలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఉందంటూ పర్యటనకు కారణంగా చెప్పారు. నిజానికి ఈ సమావేశంలో ఆయన ప్రధాని నరేంద్రమెదీతో సమావేశం కావాల్సి ఉంది.
భారత్‌లో టెస్లా తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ప్రణాళికలు, బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై చర్చలు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంపై విధాన ప్రకటన వంటి అంశాలు మస్క్ పర్యటనలో భాగమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, ఆయన తన శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్‌లింక్ కోసం భారతీయ మార్కెట్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.
స్టార్‌లింక్ భారతదేశంలో సేవలకు లైసెన్స్ పొందడానికి అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ప్రారంభంలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ సేవల ప్రారంభానికి తగిన అన్ని అనుమతులనూ పొందే ప్రక్రియలో ఉందని, వారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్ పొందుతారని మంత్రి చెప్పారు.
అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో విద్యుత్–వాహన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించాలన్నది ఈ విధానంలో కీలక అంశం. టెస్లా వంటి ప్రధాన ప్రపంచ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది.
ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/ దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికీ పాలసీ అనుమతించింది. ప్రభుత్వం ఆమోద పత్రం జారీ చేసిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయని పాలసీ వివరించింది.
ట్రంప్ ’భారత్ స్నేహితుడే’
సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడని, భారత్–అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమస్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్‌లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ, టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్‌టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ‘ఏకపక్ష‘ గ్రీన్ ఎకానమీ నిబంధనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారత్‌సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు.
అధికారంలోకి వస్తే, పరస్పర పన్నును ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్బంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాతో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు.
ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు
భారత్ ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు ఎల్రక్టానిక్స్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇంకా చర్చల దశలో ఉన్నాయని వాణిజ్య మంత్రి తెలిపారు.
300 చట్టాలు డీక్రిమినలైజ్..
300కుపైగా చట్టాలను డీక్రిమనలైజ్ (నేరపూరిత చర్యల జాబితా నుంచి బయటకు) చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.
వినియోగించుకోకపోతే.. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మూత
సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించాలని, లేకుంటే ఈ పథకాన్ని మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరో కార్యక్రమంలో పరిశ్రమకు స్పష్టం చేశారు.నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్) అనేది వ్యాపార అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు, ఆమోదాలకు పరిశ్రమ వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్.
32 కేంద్ర శాఖలు, 29 రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం తగిన అప్లికేషన్ సేవలను అందిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై డీపీఐఐటీ–సీఐఐ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ అవసరమా? లేదా అనే అంశంపై ఎంపిక ఇప్పుడు మీ (పరిశ్రమ) వద్ద ఉంది. మీకు దానిపై ఆసక్తి లేదని మీరు భావిస్తే... సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను మూసివేయడానికి వెనకాడబోము. కేంద్రం దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు.
ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చని, అయితే దానిని మెరుగుపరచడానికి పరిశ్రమ నుండి వచ్చే సూచనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి తెలిపారు. జన్ విశ్వాస్ 2.0 బిల్లు గురించి మాట్లాడుతూ, పరిశ్రమకు రెట్రాస్పెక్టివ్ ప్రయోజనాలను (గతానికి వర్తించే విధంగా) అందించడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు తగిన సూచనలు, సలహాలు చేయడానికి, ఆయా విభాగాల్లో మరింత మెరుగుదలకు సూచనలు, సలహాలు పొందానికి సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)– రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment