ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కోసం భారత్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా కేంద్రం చట్టాలను రూపొందించిందని చెప్పారు.
చాలా కాలంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న టెస్లా సంస్థ.. దిగుమతి సుంకంలో రాయితీ కోరుతోంది. అయితే, ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
‘ఈవీల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటితో కాలుష్యం, చమురు దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇందుకోసం ఏదో ఒక కంపెనీకి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయలేం. యూరప్ సహా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థలతో పలు అంశాల్లో చర్చలు జరుపుతున్నాం. భారత్‌లో పెట్టుబడి పెట్టే సంస్థలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే, వాటికనుగుణంగా ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని భావించకూడదు. భవిష్యత్తులో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది’అని మంత్రి గోయల్ తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో 40,000 డాలర్లు (దాదాపు 29.75 లక్షలు) లేదా అంతకంటే తక్కువ విలువ ఉన్న విద్యుత్తు వాహనాలపై ప్రభుత్వం 60 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉంది. అంటే, అమెరికాలో రూ.34 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లన్నీ భారత్‌లో రెట్టింపు ధరకు అందుబాటులో ఉంటాయి. దీన్ని 70 శాతానికి పైగా తగ్గించాలని టెస్లా కోరుతోంది.
ఇదీ చదవండి: ‘ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలే’.. వీడియో వైరల్
ముందుగా భారత్‌లో కొంతకాలంపాటు కార్లను దిగుమతి చేసి విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది. దీనివల్ల మిగతా సంస్థలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్రం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment