ప్రపంచ ఎలక్ట్రిక్‌కార్ల దిగ్గజ సంస్థ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఏప్రిల్ 21న భారత్‌కు రానున్నారు. ఈ తరుణంలో భారత్‌లో టెస్లా ప్లాంట్ తయారీకి సంబంధించిన అంశాలు చర్చించనున్నట్లు తెలిసింది. దాంతోపాటు ప్రధానితో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. అయితే కేవలం టెస్లా అంశమే కాకుండా మస్క్ కీలక ప్రాజెక్ట్ అయిన శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవలందించే స్టార్‌లింక్‌ను కూడా ఇండియాలో ప్రవేశపెట్టేలా అధికారులతో చర్చలు జరుపనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్‌కు సంబంధించి లైసెన్స్ ప్రక్రియ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) పరిశీలనలో ఉంది. ఇటీవల శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ), ట్రయల్ స్పెక్ట్రమ్‌పై పని చేసేందుకు డీఓటీ లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది.
స్టార్‌లింక్ లైసెన్స్ కోసం గతంలోనే ఆ సంస్థ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం దరఖాస్తు చేసింది. అయితే డేటా స్టోరేజీ, ట్రాన్స్‌ఫర్ విషయంలో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో లైసెన్స్ రద్దు అయింది. తాము అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలనే పాటిస్తామని అప్పట్లో స్టార్ లింక్ పేర్కొంది. దాంతో ప్రభుత్వం తమ దరఖాస్తును తిరస్కరించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టం చేసింది. తర్వాత కొన్నిరోజులకు తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందింది. సెక్యూరిటీ చెక్ తర్వాత శాటిలైట్ సర్వీసులకు సంబంధించిన అనుమతులు మంజూరు అవుతాయని తెలిసింది.
దేశీయంగా భారతీ ఎయిర్‌టెల్ మద్దతున్న వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టార్ లింక్‌కు కూడా అనుమతులు లభిస్తే మూడో సంస్థ అవుతుంది. అదే జరిగితే ఎయిర్‌టెల్, జియోకు ఈ విభాగంలో గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై డాట్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే..
టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment