ఒకరిపై దాడి జరిగితే తోటి దేశం సాయపడేలా ఒప్పందం
ద్వైపాక్షిక చర్చలు జరిపిన పుతిన్, కిమ్
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు.
ఘన స్వాగతం పలికిన కిమ్
సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్‌కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్‌పోర్ట్‌లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్‌లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్‌కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్‌ను పుతిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.
పలు రంగాలపై ఒప్పందాలు
‘కుమ్‌సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్‌లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది.
కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.
కారు నడిపిన పుతిన్, కిమ్
కుమ్‌సుసాన్ ప్యాలెస్‌కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్‌కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్‌ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్‌కు కిమ్ బహూకరించారు. కిమ్‌కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్‌కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment