
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా అంగీకారానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. రెండు దేశాల మధ్య అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, మార్గదర్శకాలకు లోబడి చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏకాభిప్రాయం కుదిరిందని విదేశాంగ శాఖ తెలిపింది. లదాఖ్ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆదివారం రెండు దేశాల సైనికాధికారులు జరిపిన ఉన్నత స్థాయి చర్చలపై ఈ మేరకు స్పందించింది.
‘ఈ భేటీ స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో జరిగింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తవుతున్నందున విభేదాలకు త్వరగా పరిష్కారం కనుగొనాలి. ఇండో–చైనా సరిహద్దుల్లో శాంతి, సామరస్య పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలు మరింత అభివృద్ది చెందేందుకు దోహదపడతాయి’అని విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సరిహద్దుల్లో శాంతి, సామరస్య పూర్వక పరిస్థితులను నెలకొల్పేందుకు సైనిక, దౌత్యపరమైన సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తాయని తెలిపింది. శనివారం నాటి భేటీతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని తాము అనుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఉన్నత స్థాయి సైనిక సంభాషణలు సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయి కాబట్టి చాలా ముఖ్యమైనవని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment