ఫ్రాన్స్ ప్రధాని సమక్షంలో సైనిక వందనం స్వీకరిస్తున్న మోదీ
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు.
‘‘పారిస్ చేరుకున్నా. భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సంబంధాలు బలపడేందుకు నా పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లోని భారతీయులతో భేటీ కాబోతున్నానని వెల్లడించారు. వారంతా ఆయన బస చేసిన హోటల్ బయట గుమికూడి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు.
ఈ పర్యటన నాకెంతో ప్రత్యేకం
భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తన పర్యటనతో మరింత ఊపొస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రక్షణ భాగస్వామ్యంతోపాటు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నానని వివరించారు. రాబోయే పాతికేళ్లలో ఇరు దేశాల బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాక్రాన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటన తనకెంతో ప్రత్యేకమని ఉద్ఘాటించారు. నేషనల్ డే పరేడ్‌లో 269 మంది జవాన్ల భారత బృందం పాలుపంచుకోనుంది. తర్వాత మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబూదాబీలో పర్యటిస్తారు.
26 రఫేల్ జెట్లు, 3 స్కారి్పన్ సబ్‌మెరైన్లు
న్యూఢిల్లీ: నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని రక్షణ ఆయుధాల సేకరణ మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.85,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీఅలో ద్వైపాక్షిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా రఫేల్, స్కారి్పన్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం. వైమానిక దళం కోసం ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment