సంపాదకీయం: భారత్-చైనా సంబంధాలు ఏ కొంచెమైనా మెరుగుపడతాయనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అపశ్రుతి వినబడటం రివాజుగా మారింది. రెండు నెలలక్రితం ప్రధాని మన్మోహన్‌సింగ్ చైనా పర్యటించినప్పుడు ప్రధాన అంశాలపై ఎలాంటి ఒప్పందాలూ లేకపోయినా ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు అది ఎంతోకొంత దోహదపడిందని అందరూ సంతోషించారు. తీరా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేసరికి చైనా తన వెనకటి గుణాన్ని ప్రదర్శించింది. ‘రెండు దేశాలమధ్యా ఉన్న సరిహద్దుల్లో సమస్యలు ముదిరేలా చేయవద్ద’ని హితవు పలికింది. అంతేకాదు... అరుణాచల్ తమ దేశంలో అంతర్భాగమని మరోసారి చెప్పుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మొదటినుంచీ ఇలాగే ప్రవర్తిస్తోంది. దాన్ని ‘వివాదాస్పద ప్రాంతం’గా అభివర్ణిస్తోంది.
1988 నుంచి ఇరుదేశాల మధ్యా సాన్నిహిత్యానికి చురుగ్గా ప్రయత్నాలు సాగాయి. శిఖరాగ్రస్థాయి సమావేశాలు చాలామార్లు జరిగాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్య ఒప్పందాలూ అమల్లోకి వచ్చాయి. అలాగని చైనా ఎప్పుడూ తన అలవాట్లను మార్చుకోలేదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగానే ప్రవర్తిస్తూవచ్చింది. మొన్నటికి మొన్న జూలైలో లడఖ్ ప్రాంతంలో చైనా చొరబాటు యత్నం చేసింది. అటు తర్వాత రెండు చైనా హెలికాప్టర్లు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. సరిగ్గా ఈ ఘటనలు జరగడానికి కొన్ని రోజులముందే మన రక్షణమంత్రి ఎ.కె. ఆంటోనీ అక్కడకు వెళ్లొచ్చారు. దీన్నిబట్టి చైనా చేష్టలు ఎలా ఉంటున్నాయో అంచనా వేసుకోవచ్చు. ఏడాదిక్రితం చైనాకు చెందిన అణ్వాయుధ సుఖోయ్ యుద్ధ విమానాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయి.
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా తరచుగా ఇలా మాట్లాడటం వెనక మన నాయకత్వం నిర్వాకం కూడా ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అరుణాచల్ అభివృద్ధిని విస్మరించారు. అది భారత్‌లో అంతర్భాగమని తరచు అనడమే తప్ప ఆ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. వాస్తవానికి అది చైనాతోనే కాదు... అటు భూటాన్‌తో, ఇటు మయన్మార్‌తో సరిహద్దులున్న రాష్ట్రం. తూర్పు ఆసియాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంలో కీలకపాత్ర పోషించగల ప్రాంతం. అయితే, 1962 యుద్ధం తర్వాత మన పాలకులు మర్యాదస్తుల్లా మారారు. అందుకు సంబంధించి ఏంచేసినా చైనాకు కోపం తెప్పించినట్టవుతుందన్న భావనతో ఉండిపోయారు.
ఒక్క అరుణాచల్ మాత్రమే కాదు...మిగిలిన ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రైల్వేలైన్లు, రోడ్లు, వైమానిక సౌకర్యాలు...అన్నీ అరకొరగానే మిగిలిపోయాయి. అటు చైనా మాత్రం సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు రహదారులు, ఇతర హంగులూ సమకూర్చుకుంటున్నది. తన ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మన దేశం ఆలస్యంగానైనా కళ్లు తెరిచి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించినా అందులో చురుకుదనంపాలు చాలా తక్కువ. 2016 నాటికల్లా 61 రహదారులు నిర్మించాలని పథకరచన జరగ్గా అందులో పట్టుమని 15 కూడా కార్యరూపం దాల్చలేదు. నిధుల కొరత, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఫైళ్ల నత్తనడక ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించాలని, అది వ్యూహాత్మకంగా మనకు అవసరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పడాన్ని స్వాగతించాలి.
అరుణాచల్‌ను, ఇతర ఈశాన్య రాష్ట్రాలనూ మారుమూల ప్రాంతాలుగా పరిగణించడం మాని, ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి దేశంలోని ఇతర ప్రాంతాలతో వాటిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆ పనిచేస్తే ఈశాన్య ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అక్కడ ప్రశాంత పరిస్థితులు కూడా నెలకొంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించాయి. మరికొన్ని నెలల్లో ఇటానగర్‌కు రైలు లింకు ఏర్పడబోతున్నది. అలాగే, అక్కడ జల విద్యుత్తు ప్రాజెక్టుల జోరు కూడా పెరుగుతున్నది. ఇరుగుపొరుగుతో మన సంబంధాలు బాగుండాలి. అందులో సందేహమేమీ లేదు. ముఖ్యంగా ఆసియాలో భౌగోళికంగా చూసినా, జనాభారీత్యా చూసినా భారత్, చైనాలు రెండు పెద్ద దేశాలు. పరస్పర సహకారంతో ముందుకెళ్తే ఈ రెండు దేశాలూ లబ్ధిపొందుతాయి.
అంతర్జాతీయంగా ఇరుదేశాల పలుకుబడి కూడా పెరుగుతుంది. మొత్తంగా ఆసియా ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. కానీ, ఒంటిచేత్తో చప్పట్లు సాధ్యంకాదు. మన దేశం మాత్రమే చెలిమికి తహతహలాడితే సరిపోదు. సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఇరు దేశాల అధినేతలమధ్యా అంగీకారం కుదిరినప్పుడు చైనా దానికి కట్టుబడి ఉండాలి. అందుకు అనుగుణమైన ఆచరణను కనబరచాలి. అయితే, అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా భావిస్తూ ఇప్పటికీ అది తమదేనని చైనా వాదించడమే కాదు... అక్కడివారికి విడి వీసాలు జారీచేస్తోంది. మన ప్రధాని లేదా రాష్ట్రపతి అక్కడ పర్యటించినప్పుడల్లా అందుకు అభ్యంతరం చెప్పడం దానికి అలవాటైంది. ఒకపక్క సరిహద్దు వివాదాన్ని చర్చలద్వారా తేల్చుకుందామంటూనే ఇలా ప్రవర్తించడంలోని ఆంతర్యమేమిటో ఆ దేశమే చెప్పాలి.
రెండు దేశాలూ చిత్తశుద్ధితో చర్చలు సాగిస్తే, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే ఇలాంటి వివాదాలు పరిష్కారంకావడం అసాధ్యంకాదు. కానీ, చర్చల దారి చర్చలదీ...తన ధోరణి తనది అన్నట్టుగా ఉంటే సమస్యలు సమస్యలుగానే ఉండిపోతాయని చైనా గుర్తించడం అవసరం. సైనిక పరంగా, మౌలిక సదుపాయాలపరంగా సరిహద్దుల్లో మన స్థానాన్ని పటిష్టంచేసుకుంటేనే అవతలివారు మనల్ని గౌరవిస్తారని, సామరస్యతకు ముందుకొస్తారని మన పాలకులు గ్రహించినట్టు కనబడుతోంది. ఇది శుభసూచకం.
ధోరణి మార్చని చైనా!
Published Wed, Dec 4 2013 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement