‘చెన్నై కనెక్ట్‌’ | Start of new era in India-China relations | Sakshi
Sakshi News home page

‘చెన్నై కనెక్ట్‌’

Published Sun, Oct 13 2019 3:55 AM | Last Updated on Sun, Oct 13 2019 1:56 PM

Start of new era in India-China relations - Sakshi

ఫిషర్‌మన్‌ కోవ్‌ రిసార్ట్‌లో జిన్‌పింగ్, మోదీ

సాక్షి ప్రతినిధి, చెన్నై/మామల్లపురం: విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ సహకారంలో నూతన అధ్యాయం ప్రారంభించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. భారత్, చైనా సంబంధాల్లో  ‘చెన్నై కనెక్ట్‌’ కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. మామల్లపురంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ముఖాముఖి రెండోరోజు కొనసాగింది. ద్వైపాక్షిక చర్చలకు వేదికైన మహాబలిపురం సమీపంలోని కోవలం బీచ్‌ తాజ్‌ ఫిషర్‌మన్‌ కోవ్‌ రిసార్టుకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలూ గోల్ఫకార్ట్‌లో తిరిగారు. బీచ్‌లో నడిచారు. అక్కడి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల గదిలో ఇద్దరు నేతలు ఏకాంతంగా 90 నిమిషాలసేపు చర్చలు జరిపారు. 

అనువాదకులు ఆ సమయంలో వారితో ఉన్నారు. తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ కార్యదర్శి వాంగ్యూ సహా ఇరుదేశాలకు చెందిన 8 మంది అధికారులతో కలిసి మోదీ, జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. రెండు రోజుల్లోనూ సుమారు 7 గంటలపాటు జరిపిన ముఖాముఖిలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకు ఉన్నతస్థాయి యంత్రాంగం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)పై జరుగుతున్న చర్చల్లో భారత్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు, భద్రతలో సహకారం, సరిహద్దుల్లో శాంతికి మరిన్ని చర్యలు తీసుకునేందుకు చైనా హామీ ఇచ్చింది. మూడో భేటీకి చైనా రావాలన్న జిన్‌పింగ్‌ ఆహ్వానాన్ని ఈ సందర్భంగా మోదీ అంగీకరించారు.

ఇద్దరు నేతలు ఏమన్నారంటే..
‘వూహాన్‌ సమ్మేళనంతో ప్రారంభమైన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్‌’తో కొత్త ఊపు వచ్చింది. చైనా అధ్యక్షుని రాకతో మహాబలిపురం గ్రేట్‌ వే ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌గా చరిత్రపుటల్లో నిలిచిపోయింది’ అని మోదీ అన్నారు. ప్రధాని మోదీ, నేను మంచి స్నేహితులం. ఈ రెండు రోజుల్లో ఇద్దరం మనసువిప్పి మాట్లాడుకున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. తమిళనాడులో తాను పొందిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరువజాలనని జిన్‌పింగ్‌ అన్నారు.  డ్రాగన్, ఏనుగు నాట్యం కేవలం చైనా, భారత్‌ల విషయంలోనే సాధ్యమని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ‘రెండుదేశాల మధ్య విభేదాలు దైపాక్షిక సహకారంపై ప్రభావం చూపజాలవు. ఏనుగు, డ్రాగన్‌ నాట్యం చేయడం భారత్, చైనాల విషయంలో మాత్రమే నప్పుతాయి. రెండు దేశాల కీలక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఏళ్లుగా నానుతున్న సమస్యలను విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి’ అని అన్నారు.

ప్రస్తావనకు రాని కశ్మీర్‌
భేటీ అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దుల్లో తరచూ తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు, శాంతిని నెలకొల్పేందుకు పరస్పరం విశ్వాసం పాదుకొల్పే మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు, వాణిజ్య, వ్యాపార సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, తయారీ రంగం భాగస్వామ్యం, పెట్టుబడుల పెంపుపై ఏకాభిప్రాయానికి  వచ్చారు. ఈ చర్చలకు చైనా ఉప ప్రధాని హు చిన్హువా, భారత్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వం వహిస్తారని తెలిపారు’ అని ఆయన తెలిపారు.

ఇద్దరు నేతల మధ్య కశ్మీర్‌ అంశం చర్చకు రాలేదని, ఆ ప్రస్తావనే లేదని తెలిపారు. భారత్, చైనా దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాది 70 ఏళ్లు నిండుతున్న సందర్భంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు జిన్‌పింగ్‌ అంగీకరించారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఇలా ఉండగా, జిన్‌పింగ్‌ పర్యటనను పురస్కరించుకుని చైనా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఐదేళ్ల ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 12.55 గంటలకు జిన్‌పింగ్‌ కోవలం బీచ్‌ హోటల్‌ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో నేపాల్‌ వెళ్లిపోయారు.

బీచ్‌లో మోదీ ప్లాగింగ్‌
చెత్తా చెదారాన్ని ఎత్తివేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ప్రధాని  
మహాబలిపురం సముద్ర తీరంలో మోదీ అరగంట సేపు స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. అక్కడ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో ఆయన వాటన్నింటిని ఎత్తేశారు. స్వచ్ఛభారత్‌ అభియాన్, ఫిట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తిని ఏకకాలంలో ప్రజల్లో రగిల్చేలా చేశారు. నల్లని రంగు కుర్తా, పైజామా ధరించిన ప్రధాని మోదీ ఒక పెద్ద ప్లాస్టిక్‌ బ్యాగ్‌ని పట్టుకొని ఇసుక తిన్నెల్లో నడుస్తూ తాగి పారేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్‌ , స్ట్రాలు ఇతర చెత్తలన్నీ ఏరారు.

బీచ్‌లో చెత్తను తీసి బ్యాగ్‌లో వేస్తూ..

ఇలా చేయడం వల్ల వంటికి వ్యాయామానికి వ్యాయామం జరుగుతుంది. పరిసరాలు శుభ్రానికి శుభ్రం అవుతాయి. దీనికి సంబంధించిన మూడు నిమిషాల వీడియోను ప్రధాని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ‘‘మహాబలిపురం తీరంలో ప్లాగింగ్‌ చేశాను. దాదాపుగా 30 నిమిషాల సేపు చెత్తలన్నీ ఏరి దానిని హోటల్‌ యజమాని జయరాజ్‌కు అందజేశాను. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి’’అని ప్రధాని ట్వీట్‌ చేశారు. అంతకు ముందు సముద్రం నీళ్లలో తడుస్తూ, అక్కడి సూర్యోదయం అందాలను వీక్షిస్తూ ప్రధాని చాలా సేపు బీచ్‌లో గడిపి సేద తీరారు. రోడ్లపై జాగింగ్‌ చేస్తూ చెత్తా చెదారాన్ని ఎత్తేపారేసే ప్రక్రియని ప్లాగింగ్‌ అని పిలుస్తారు.

జిన్‌పింగ్‌ ముఖచిత్రంతో చేనేత పట్టు శాలువా
చైనా అధినేతకు మోదీ అపూర్వ కానుక
భారత్‌కు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన చైనా అ«ధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపురూపమైన కానుకని బహూకరించారు. చేతితో తయారు చేసిన ఎర్ర రంగులో ఉన్న ఈ శాలువాపై జిన్‌పింగ్‌ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయించారు. బంగారు రంగు అంచుల జరీతో మెరిసిపోతున్న ఈ శాలువా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలోని సిరుముగైపుడూర్‌కి చెందిన శ్రీ రామలింగ సౌదాంబిగై చేనేత సహకార సంఘం మల్బరీ పట్టుతో ఎర్ర శాలువాని తయారు చేసింది. ఎరుపు రంగు ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది.

తన ఫొటో ఉన్న జ్ఞాపికను జిన్‌పింగ్‌ నుంచి స్వీకరిస్తున్న మోదీ

చైనా జాతీయ జెండా రంగు, అధికార పార్టీ జెండా రంగు ఎరుపే. అంతేకాదు చైనా సంస్కృతిలో ఎరుపు రంగుని శుభసూచికంగా పరిగణిస్తారు. ఈ రంగుతో అదృష్టం కలిసివస్తుందని, జీవితం ఆనందోత్సాహాల్లో నిండిపోతుందని వారి నమ్మకం. ఈ శాలువాపై జిన్‌పింగ్‌ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయడానికి ఎలక్ట్రానిక్‌ ఫ్యాబ్రిక్‌ని వినియోగించారు. ఆ తర్వాత దానిపై బంగారు రంగు దారాలతో అల్లారు. చేతి వృత్తుల పరిశ్రమ, చేనేత కళలకు తమిళనాడు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఎందరో చేనేత కార్మికులు చేతితో తయారు చేసే వస్త్రాలతో అద్భుతాలు సృష్టించారు. కంచి, ఆరణి, మదురై, కోయంబత్తూరు వంటివి పట్టు వస్త్రాల ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపుని సాధించాయి.

మామల్లపురం బీచ్‌లో సేదతీరుతున్న మోదీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement