
రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమా?
రాష్ట్రాల ఏర్పాటు-సరిహద్దుల మార్పు, పునర్‌వ్యవస్థీకరణ
భారత్‌లో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగంలో పేర్కొన్న అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది? రాష్ట్రాల ఏర్పాటు, పునర్‌వ్యవస్థీకరణ మొదలైన అంశాలను ఒకటో భాగంలో ప్రకరణ 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు.
భారత భూభాగం: ప్రకరణ ఒకటి ప్రకారం భారత భూభాగం అంటే రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం సముపార్జ్జించుకున్న ఇతర భూభాగాలు కూడా ఉంటాయి.
భారత యూనియన్: ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. సమాఖ్యలో అంతర్భాగంగా ఉండే రాష్ట్రాలకు నిర్ణీత అధికారాలు ఉన్నాయి.భారత భూభాగం అనే భావన విస్తృతమైంది. అది భారత సార్వభౌమాధికారం ఏవిధంగా విస్తరించి ఉంటుందో తెలియజేస్తుంది. ఇది భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు. భారత సముద్ర జలాలు (Territorial Waters, 12 నాటికల్ మైళ్ల వరకు), విశిష్ట ఆర్థిక మండళ్లు (Exclusive Economic Zones, 200 నాటికల్ మైళ్ల వరకు), భారత అంతరిక్ష సరిహద్దుకు కూడా సార్వభౌమాధికారం వర్తిస్తుంది.
రాష్ట్రాల సమ్మేళనం: భారత రాజ్యాంగంలో ఒకటో ప్రకరణలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్’(యూనియన్ ఆఫ్ స్టేట్స్) గా పేర్కొన్నారు. సమాఖ్య (ఫెడరేషన్) గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని ‘యూనియన్’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
భారత సమాఖ్య అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అదేవిధంగా కెనడాలా ఏకకేంద్ర రాజ్యాన్ని సమాఖ్యగా విడగొట్టలేదు. ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు కాబట్టి రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేదు. అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. ఈ హక్కును ఆ తర్వాత రద్దు చేశారు.
అందువల్ల భారత సమాఖ్యను విచ్ఛిన్నం అయ్యే రాష్ట్రాలు, అవిచ్ఛిన్న యూనియన్‌గా పేర్కొంటారు (Indestructible Union of Destructible States)
ప్రకరణ 2
దీని ప్రకారం పార్లమెంట్ ఒక చట్టంద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు. ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు వర్తిస్తుంది. ఇది పార్లమెంటుకు సంబంధించిందే అయినా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుంది. విదేశీ భూభాగాలను భారతదేశంలో చేర్చుకున్నప్పుడు పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో రాజ్యాం గ సవరణ చేయాల్సి ఉంటుంది. ఉదా: 1961లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాను, 1962 లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని భారత్‌లో కలిపారు. అదేవిధంగా 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత రాష్ర్టంగా చేర్చుకున్నారు.
ప్రకరణ 3
దీనిలో కింది అంశాలు ఉన్నాయి.
ఎ) కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం
రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేయవచ్చు. ఉదా: 1956లో ఆంధ్రరాష్ర్టం, హైదరాబాద్‌లను కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ర్టంలోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేయవచ్చు.
బి) రాష్ర్ట విస్తీర్ణాన్ని పెంచవచ్చు
సి) రాష్ర్ట విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు
డి) రాష్ర్ట సరిహద్దులను సవరించవచ్చు
ఇ) రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు
రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ
ప్రకరణ 3లో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది. పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ర్ట పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే అది స్పెషల్ కేటగిరి బిల్లు అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు. బిల్లులను రాష్ర్టపతి అనుమతితోనే ప్రవేశపెట్టాలి. ఈ నిబంధనను 1955లో ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందే రాష్ర్టపతి సంబంధిత రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాన్ని కోరుతారు. శాసన సభలు నిర్ణీత సమయంలోగా అభిప్రాయాన్ని తెలపాలి. ఈ అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు.
పార్లమెంటు ఉభయసభలు బిల్లును సాధారణ మెజారిటీతో విడివిడిగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి ఆస్కారం ఉండదు. బిల్లు వీగిపోతుంది. పార్లమెంటు అంగీకారం పొందిన బిల్లును రాష్ర్టపతి తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ర్టపతి ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. దాంతో ప్రక్రియ పూర్తవుతుంది.
కొత్త రాష్ర్టం అమల్లోకి వచ్చే తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్నే ‘అపాయింటెడ్ డేట్’ అంటారు.
ప్రకరణ 4
ఈ ప్రకరణ తర్వాత పరిణామాల గురించి వివరిస్తుంది. ప్రకరణ 2, 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1, 4 షెడ్యూళ్లలో పేర్కొన్న అంశాలను కూడా మార్చాలి. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా ఆటోమేటిక్‌గా 1, 4 షెడ్యూళ్లలోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి.
ప్రకరణ 2, 3 ప్రకారం ఎలాంటి మార్పు చేసినా దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఈ అంశాన్ని ప్రకరణ 4(2)లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ట్రాల ఏర్పాటుకు, పునర్‌వ్యవస్థీకరణకు, ఇతర అంశాలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు.
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ వివాదాలు-సుప్రీంకోర్టు తీర్పులు
బెరుబారి యూనియన్ వివాదం (1960):
బెరుబారి అనేది పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని ఒక ప్రాంతం. దీని విస్తీర్ణం 9 చదరపు మైళ్లు. ప్రకరణ 3 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దును కుదించే అధికారం ఉంది. అయితే, ‘ఒక రాష్ర్ట వివాదాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందా?’అనే సంశయం తలెత్తిన సందర్భంగా రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహా కోరారు. సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాష్ర్ట భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలంటే పార్లమెంటు ప్రకరణ 368 ప్రకారం ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్గతంగా బదిలీ చేసేందుకు సాధారణ మెజార్టీ సరిపోతుంది.
బాబూలాల్ మారండి వర్సెస్ బాంబే స్టేట్ (1960):
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఒక్కసారి మాత్రమే సంబంధిత రాష్ర్ట శాసనసభల అభిప్రాయానికి నివేదిస్తారు. ఒకవేళ ఆ బిల్లులో తర్వాత ఏవైనా మార్పులు చేస్తే, దాన్ని మరోసారి రాష్ర్ట పరిశీలనకు పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ర్టంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడం.
స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్(1982):
భారత రాజ్యాంగం నిర్ణీతమైన సమాఖ్య వ్యవస్థను ఏర్పర్చలేదు. నిర్మాణపరంగా సమాఖ్య అయినప్పటికీ, ఇది సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాల మిశ్రమంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
ముల్లా పెరియార్ పర్యావరణ వివాదం (2006):
నదీ జలాల పంపిణీపై చట్టాలు చేసే అధికారం రాష్ర్ట శాసనసభకు లేదని, ఇది పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
మాదిరి ప్రశ్నలు
1. గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమి స్తుంది. ఈ విధానాన్ని ఏమంటారు?
1) నిఖరమైన సమాఖ్య
2) పరిపూర్ణ ప్రజాస్వామ్యం
3) రిపబ్లికనిజం
4) విశిష్ట సమాఖ్య విధానం
2. కొత్త రాష్ట్రాల ఏర్పాటును తెలిపే రాజ్యాంగ అధికరణ?
1) 2 2) 3 3) 1 4) 4
3. భారత ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను దేని ద్వారా ఏర్పాటు చేయవచ్చు?
1) భారత రాష్ర్టపతి
2) పార్లమెంటు శాసనం
3) రాజ్యాంగ సవరణ ద్వారా
4) అంతర్రాష్ర్ట మండలి
4. కింది రాష్ట్రాలు ఏర్పడిన వరుస క్రమాన్ని గుర్తించండి.
ఎ. ఆంధ్రప్రదేశ్ బి. నాగాలాండ్
సి. మహారాష్ర్ట డి. హర్యానా
1) ఎ, సి, బి, డి 2) ఎ, సి, డి, బి
3) సి, ఎ, బి, డి 4) సి, ఎ, డి, బి
5. రాష్ట్రాల ఏర్పాటులో ప్రాతిపదిక కానిది?
1) భాష 2) భౌగోళిక అంశాలు
3) ప్రాంతీయ అసమానతలు
4) పైవేవీ కావు
6. రాష్ట్రంగా మారిన కేంద్రపాలిత ప్రాంతం?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) గోవా
3) హిమాచల్ ప్రదేశ్ 4) పైవన్నీ
7. నవంబరు 1న అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే రాష్ర్టం?
1) కర్ణాటక 2) కేరళ
3) ఛత్తీస్‌గఢ్ 4) పైవన్నీ
8. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) తెలంగాణ మొదటి ఉప ముఖ్యమంత్రులు - మహ్మద్ అలీ, డాక్టర్ టి. రాజయ్య
2) నూతన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రులు - కె. క్రిష్ణమూర్తి, ఎన్. చినరాజప్ప
3) తెలంగాణ రాష్ర్ట విధానసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి
4) పైవన్నీ
9. కిందివాటిలో తెలంగాణాకు సంబంధించి సరైన అంశం ఏది?
1) జనాభాలో 12వ స్థానం
2) విస్తీర్ణంలో 12వ స్థానం
3) లోక్‌సభ స్థానాల్లో 13వ స్థానం
4) పైవన్నీ
10. నూతన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
1) జనాభాలో 10వ స్థానం
2) విస్తీర్ణంలో 8వ స్థానం
3) లోక్‌సభ స్థానాల్లో 9వ స్థానం
4) పైవన్నీ
సమాధానాలు
1) 4; 2) 2; 3) 2; 4) 1; 5) 4;
6) 4; 7) 4; 8) 4; 9) 4; 10) 4.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీపరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగంలో ‘శక్తి వనరులు’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ టాపిక్ ప్రిపరేషన్‌కు సంబంధించి కొన్ని సూచనలివ్వండి.
- ఆర్.అనురాధ, ఏఎస్‌రావు నగర్.
దేశాభివృద్ధికి ‘శక్తి’ వెన్నెముక లాంటిది. శక్తి వనరులు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి వర్గీకరణ లాంటి అంశాలను అధ్యయనం చేయడం అన్ని పోటీ పరీక్షలకు అవసరమే. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో దేశంలో శక్తి వనరుల లభ్యత, స్థూల, స్థాపిత సామర్థ్యం విలువలు, శక్తి మంత్రిత్వశాఖ, దాని పరిధిలోని సంస్థలు/కేంద్రాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. శక్తి వనరులు రెండు రకాలు. అవి: సంప్రదాయ, సంప్రదాయేతరమైనవి.
బొగ్గు, సహజవాయువు, చమురు, జల విద్యుత్, అణువిద్యుత్ సంప్రదాయ శక్తి వనరులు. దేశంలో వీటి లభ్యత, ఉత్పాదన గురించి తెలుసుకోవాలి. అదనంగా కోల్ బెడ్, మీథేన్, షెల్ గ్యాస్‌ల గురించి చదవాలి. సంప్రదాయేతర శక్తి వనరులు పునర్వినియోగ, నవీన వనరులు అని రెండు రకాలుగా ఉంటాయి. జీవశక్తి, సౌరశక్తి, పవన శక్తి, చిన్న తరహా జలవిద్యుత్ లాంటివి పునర్వినియోగ శక్తి వనరులు. హైడ్రోజన్ శక్తి, జియోథర్మల్, సముద్ర తరంగ శక్తి, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు లాంటివి నవీన శక్తి వనరులు.
ఏ శక్తి వనరుల లభ్యత ఏవిధంగా ఉంది? ప్రస్తుతం వాటి ఉత్పాదన, ఏ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏయే రకాల శక్తి వనరుల నిర్వహణ ఉంది? లాంటి అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. శక్తి రంగంలో పరిశోధన కేంద్రాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇండియా ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే లాంటి పుస్తకాల్లో వీటికి సంబంధించిన వర్తమాన అంశాలు, సమగ్ర సమాచారం లభిస్తుంది.
- సి. హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ.