India vs Bharat : ఒకే దేశం, ఒకే పేరు ? | India To Be renamed Bharat Possibilities Explained In Detail | Sakshi
Sakshi News home page

India vs Bharat : ఒకే దేశం, ఒకే పేరు ?

Published Wed, Sep 6 2023 7:34 PM | Last Updated on Thu, Sep 7 2023 4:12 PM

India To Be renamed Bharat Possibilities Explained In Detail - Sakshi

ఇండియా పేరు శాశ్వతంగా భారత్‌గా మార్చనున్నారా ? నిజానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇప్పటికే ఇండియా దటీజ్‌ భారత్‌ అని రాసి ఉంది. ఇండియా అంటే భారత్‌ అని అర్థం. ఇండియా, భారత్‌ రెండు పేర్ల బదులుగా ఒకే పేరు తీసుకువచ్చే ఆలోచనలో మోదీ ప్రభుత్వం కనిపిస్తోంది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ వస్తున్నారు. మరుగున పడిఉన్న దేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అదే క్రమంలో 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. జి–20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్‌ పంపారు. ఈ ఇన్విటేషన్‌ ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నగరాల పేర్లనుంచి ...దేశం పేరు మార్పు వరకు
నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక నగరాల పేర్లను మార్చారు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌ గా, గుర్గావ్‌ను గురుగ్రామ్‌ గా,  ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ నగరాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుండగానే, దేశం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు చరమగీతం పాడాలనే డిమాండ్‌ చాలా రోజుల నుంచి బిజెపి, సంఘ్‌ పరివార్‌నుంచి వస్తోంది. 

వేద కాలం నుంచే ఈ ప్రాంతానికి భారత్‌ పేరు..
భారత్‌పేరు రుగ్వేద కాలం నుంచి వస్తోంది. వేద తెగ భరతుల పేరు నుంచి భారత్‌ అనే పేరు ఉద్భవించిందని చెపుతుంటారు. రుగ్వేదంలోని ఆర్యవర్తన తెగలవారని కూడా చరిత్ర చెపుతోంది. మహాభారత కాలంలోని శకుంతల–దుష్యంతుడు కుమారుడి పేరు కూడా భరతుడే.  అలాగే భరతుడు పాలించిన ప్రాంతాన్ని భరత దేశంగా పిలుస్తుండేవారు. ఇలా ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతానికి భారత్‌ అనే పేరు కొనసాగుతూ వస్తోంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోని హతిగుంఫా శాసనంలో కూడా భారత్‌ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అయితే గంగా, మగద కు పశ్చిమాన ఉన్నభాగాన్నే భారత్‌ గా శాసనాలో ఉంది. దక్షిణభారతం, దక్కన్‌ పీఠభూమి దీని నుంచి మినహాయించారు. 

గ్రీకుల కాలంలో ఇండియా పేరు
ఇక ఇండియా పేరు గ్రీకుల కాలం నుంచి కొనసాగింది. సింధు నదిని ఇంగ్లీష్‌లో  ఇండస్‌ రివర్‌గా పిలుస్తుంటారు. ఇండస్‌ రివర్‌కు అవతల  ఉండేవారిని ఇండియా అని, ఇండియాన్స్‌ అనే పిలవడం మొదలుపెట్టారు.    17వ శతాబ్దంలోకి ఇది బాగా వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్‌ ఆ తర్వాత ఆంగ్లేయుల  పాలనా ప్రభావంతో ఇండియా అనే పేరు స్థిరపడింది. 

ఇండియా పేరు ఎలా మారుస్తారంటే?
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368 ఉపయోగించి ఏవైనా సవరణలు చేయడానికి పూర్తి వెసులుబాటు ఉంది. స్వయంగా రాజ్యాంగ సభ ఈ అవకాశం కల్పించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం ఉంది. అయితే రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్‌ 1 ప్రకారం ఈ ప్రాంతాన్ని ఇండియా, భారత్‌గా పిలుచుకునే అధికారం ఉంది. ఇండియా పేరును పూర్తిగా తొలగించి కేవలం భారత్‌ ఉండేలా బిల్లు పెట్టే అవకాశముంది.

నాగిళ్ల వెంకటేష్, సాక్షిటీవీ డిప్యూటీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement