కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతానికి చెందిన సంస్కృత శ్లోకాలు చెప్పించటాన్ని సవాల్ చేస్తున్న ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (íపీఐఎల్) సుప్రీంకోర్టులో 2018 జనవరి నుండి విచారణలో ఉంది. విషయ ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ పిటిషన్‌ని విచారిస్తున్న జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా ఈ ఏడాది జనవరి 28 న తీర్మానించారు. ఈ నేపథ్యంలో లౌకిక రాజ్యం, అందులో విద్యారంగం పాత్రను పరిశీలించాలి.
లౌకిక రాజ్యంలో అధికారిక మతం అనేది ఉండదు. ప్రభుత్వం ఏ మతానికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ వ్యవహరించకూడదు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల తటస్థంగా ఉండాలి. ఏ మతానికీ ప్రాధాన్యత గానీ, ప్రోత్సాహం గానీ, అవకాశం గానీ కల్పించకూడదు. సెక్యులర్ స్టేట్స్‌గా చెప్పుకుంటున్న భారత్ వంటి కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో ఆయా దేశాల్లోని మతాచారాలు పాటించడం, మతాల అవసరాలు తీర్చడం జరుగుతోంది. మరోవైపు సెక్యులర్ విలువలను పాటించాలనే ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ నివాసి అడ్వకేట్ వినాయక్ షా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు. ఆయనే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశారు.
పాఠశాల ప్రార్ధనా సమయంలో విద్యార్థులతో అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగ మయా, ఓం శాంతి శాంతి శాంతిః అనే బృహదారణ్యక ఉపనిషత్తులోని శ్లోకాన్ని చెప్పిస్తున్నారు. అది విద్యార్థుల్లో మత విశ్వాసాన్ని చొప్పించటమేనని, శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందనీ, రాజ్యాంగం ఆర్టికల్ 28 (1)కి విరుద్ధమైందనీ అందువలన ఆ పద్ధతిని నిషేధించాలని షా కోరారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ఏ మతానికి సంబంధించిన విషయాలనూ బోధించకూడదని రాజ్యాంగ ఆదేశం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయాల సిలబస్, యూనిఫామ్, ప్రార్ధన, ఎకడమిక్ కేలండర్ ఒకే విధంగా ఉంటాయి.
కేంద్రీయ విద్యాలయాల వలెనే కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా అలాంటి ప్రార్ధనలే చేయిస్తున్నారు. అంతర్లీనంగా ఇక్కడా హిందూ మత ప్రచారం కూడా జరుగుతుందని ఆ పాఠశాలలో చదివిన అలోకానంద బిసోయ్ ఇటీవల ’యూత్ కీ ఆవజ్.కామ్’ అనే ఆన్ లైన్ పత్రికలో వ్రాశారు. భోజనం చేసే ముందు క్రిష్ణ యజుర్వేద తైత్తరీయ ఉపనిషత్తులోని శ్లోకం చెప్పిస్తారు. పాఠశాల ప్రారంభ సమయంలో జరిగే ప్రార్ధనలో రోజుకో విద్యార్ధితో మైకులో నేటి సూక్తి పేరుతో భగవద్గీత లేదా వేదాల్లోని ఒక శ్లోకాన్ని, దాని అర్ధాన్ని చెప్పిస్తారు.
మిషనరీ స్కూల్సులో క్రైస్తవ మతం గురించి, మదర్సాల్లో ఇస్లాం మతం గురించి చెబుతున్నట్లు ఎప్పుడైనా పత్రికల్లో వార్తలు వస్తే అదేమి పని అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అవి ప్రైవేట్ యాజమాన్యంలోని కొద్దిమంది విద్యార్థులు ఉండే పరిమిత సంఖ్యలోని పాఠశాలలు. ముస్లిం విద్యార్థుల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే మదర్సాల్లో చదువుతున్నట్లు సచార్ కమిటీ నివేదిక పేర్కొన్నది. కానీ 13 కోట్ల మంది విద్యార్థులు చదివే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల్లో జరుగుతున్న హిందూమత ప్రచారం గురించి ప్రశ్నించరేమి అని బిసోయ్ అడుగుతున్నాడు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా హిందూమత ఆచారాలు, పద్ధతులు పాటించడం జరుగుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాల్లో మహాత్మాగాంధీ ఫొటోకి కుంకుమబొట్లు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, అగరొత్తులు వెలిగించడం చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాల్లో కూడా భోజన సమయంలో ఓం శాంతి శ్లోకాలు చెప్పిస్తారు. వినాయక చవితి రోజుల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేయడం కూడా కొన్ని స్కూల్స్, హాస్టల్సులో జరుగుతోంది. మధ్యప్రదేశ్, హరియాణా తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులతో ఉదయం సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు చేరుస్తున్నారు. మహారాష్ట్రలోని కాలేజీల్లో భగవద్గీత పుస్తకాలు పంచి పెట్టారు.
అన్నిటికీ మించి సైన్స్ కాంగ్రెస్ సభల్లోనే ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రులు, వైస్ చాన్స్‌లర్లు రామాయణం, మహాభారతం గురించి కీర్తిం చడం తెలిసిందే. రాజ్యాంగ ఆదేశమైన లౌకిక విలువలను విద్యార్ధి దశ నుండే నేర్పాలి. మతాచారాలు, పద్ధతులను నిరుత్సాహపర్చాలి. మత సంబంధిత పాఠాలను నిషేధించాలి. ఈ పని చేయగలిగే అవకాశం అందరికంటే ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉంటుంది. వినాయక్ షా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చే తీర్పు విద్యారంగంలో లౌకిక రాజ్యం పునాదులను బలపర్చటానికి తోడ్పడాలని ఆశించాలి.
నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577
Comments
Please login to add a commentAdd a comment