nagati narayana
-
ఉపాధ్యాయ ఉద్యమ నేత నాగటి నారాయణ మృతి
కవాడిగూడ/ఖమ్మం సహకారనగర్/బోనకల్: ఉపాధ్యాయ ఉద్యమ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ(66) సోమవారం కన్నుమూశారు. నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న నారాయణ నిమ్స్‌లో చికిత్స పొంది డిశ్చార్జయ్యా రు. నగరంలోని మధురానగర్‌లో ఉంటున్న ఆయన ఉద యం వాకింగ్‌కు వెళ్లి వచ్చి అయాసంగా ఉందంటూనే కుప్పకూలారు. కుటుంబసభ్యులు నిమ్స్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్ద బీరవల్లిలో 1956 డిసెంబర్ 4న నారాయణ జన్మించారు. ఖమ్మం జిల్లా లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడి గా, ప్రధాన కార్యదర్శిగా, 2000 నుంచి 2010 వరకు యూటీఎఫ్ ఉమ్మడి ఏపీ ప్రధాన కార్యదర్శిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధనలో కీలక భూమిక పోషించారు. అప్రెంటిస్ రద్దు, స్పెషల్ విద్యావలంటీర్ల రెగ్యులరైజేషన్ కోసం పోరాడి విజ యం సాధించారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇప్పించేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. 2013లో ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. నారాయణకు భార్య సంధ్యారాణి, ఇద్దరు కూతుళ్లు అక్షర, సౌమ్యశ్రీ ఉన్నారు. నారాయణ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం దోమలగూడలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సంఘం నేతలు జంగయ్య, చావా రవి, మాణిక్‌రెడ్డి, మస్తాన్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం పెద్ద బీరవల్లికి తరలించారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
నియామకాల్లో హిందీ ఆధిపత్యం
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్ వలన హిందీయేతర రాష్ట్రాల ఉద్యోగా ర్థులు నష్టపోతున్నారు. ఉదాహర ణకు తెలంగాణలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7%) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ వారున్నా మెజారిటీ హిందీ ప్రాంతం వారే. ఏపీ నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 72 కేంద్రీయ విద్యాల యాల్లోని దాదాపు 2,500 మంది ఉపాధ్యా యుల్లో తెలుగు వారు 20 శాతమే. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపా« ద్యాయ నియామ కాల్లో 75% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్ టీచర్ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష ఉంటుంది. వీటిలో ఇంగ్లిష్, హిందీ భాషలకు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఏ ప్రాంతం వారికైనా మార్కులు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80% పైగా మార్కులు వస్తుండగా హిందీయేతరులకు అందులో సగం కూడా రావడం లేదు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లిష్. నియామక పరీక్షలో ఇంగ్లిష్ అని వార్యం. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లిష్తో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని పరీక్షించ దలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. సివిల్ సర్వీసులకు కూడా ప్రాంతీయ భాషల్లో రాసే వీలుండగా కేంద్రీయ, నవోదయ ఉపాద్యాయ నియా మకాలకు లేకపోవడం అన్యాయం. నియామకాలు జోనల్ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్‌గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అస మానతకు మరో ముఖ్య కారణం. పైన ఇచ్చినవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ సంస్థ ల్లోనూ జరుగుతోంది. ఇండియన్ రైల్వేస్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్ సెక్రటేరి యట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, డిఫెన్స్, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ యూని వర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు... ఇలా వందలకొలదీ వున్నాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు చేస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగుకు లేకపోవడం వలన అవి తెలుగు వారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యో గాల్లో కూడా జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎది రించే ఉద్యమం ఊపందుకోవాలి. నాగటి నారాయణ వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు మొబైల్: 94903 00577 -
‘ప్రైవేటు’తో అంబేడ్కర్ ఆశయాలకు గండి
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జన్మదినోత్సవం అంటే ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ చాలా ముఖ్యమైంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నెముక వంటివి. వాటిని నాశనం చేయడానికి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వాలు 1991 నుండి డిజిన్వెస్టుమెంటు పేరుతో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను 24 శాతం, 49 శాతం, 74 శాతం చొప్పున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 100 శాతం వాటాలను, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే స్వదేశీ విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి మోదీ ప్రభుత్వం తెగబడింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌ని సమర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 24న ఒక వెబినార్‌లో సందేశం యిస్తూ ‘ప్రభుత్వం బిజినెస్ చేయకూడదు, బిజి నెస్ సంస్థలను మోనిటర్ చేయడం, వాటికి అవసరమైన వసతులు, సదుపాయాలు సమకూర్చడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి’ అని చెప్పుకొచ్చారు. ప్రధాని వ్యాఖ్య భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన బీఆర్ అంబేడ్కర్ ఆశయానికి అశనిపాతం వంటిది. 1944 ఆగస్టు 24న కలకత్తాలో చేసిన ప్రసంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విద్య, పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రక్షణ కోసం పరిశ్రమలు, వ్యవసాయం ప్రభుత్వరంగంలో ఉండాలని రాజ్యాంగ రచనా కమిటీలో అంబేడ్కర్ గట్టిగా వాదించారు. భారత సమాఖ్య తన రాజ్యాంగ సూత్రాల్లో క్రింది చట్టపరమైన అంశాలు ప్రకటించాలని ప్రతిపాదించారు. కీలక పరిశ్రమలు, కీలకంగా ప్రకటించబోయే పరిశ్రమలూ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వమే వాటిని నడపాలి. మౌలిక పరిశ్రమలైన వాటిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. అంబేడ్కర్ సూచనలకు అనుగుణంగా 1948లో బాంబే ప్లాన్ పేరుతో మొదటి పారిశ్రామిక తీర్మానం చేశారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పర్చారు. 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 1969లో 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులను, 1980లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. 1951లో 5 ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండగా 2019 మార్చి నాటికి 348కి పెరిగి, దాదాపు రూ. 16.41 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉండేవి. 2018–19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే రూ. 25.43 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థల్లో అత్యధికం 1990 వరకు లాభాలు గడించాయి. 1990–91 ప్రపంచ ఆర్థిక మాంద్యంలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రభుత్వరంగ సంస్థలే ఆధారం. దేశ స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి పట్టుకొమ్మలుగా అలరారుతున్న సంస్థలను ‘ఆత్మ నిర్భర భారత్‘ పేరుతో అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. కష్టపడి సంపాదించి సంసారాన్ని పోషించుకుంటూ భవిష్యత్ తరాల కోసం ఆస్తులను పోగేయడం చేతగానివారు తాతలు కూడబెట్టిన సంపదను తెగనమ్ముకొంటూ బడాయిగా బతుకుతుం టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని అదే. తొలి ప్రధాని జవహర్ లాల్ నుంచి దేవేగౌడ వరకు నడిచిన ప్రభుత్వాలన్ని ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యమిచ్చాయి. ఆ తర్వాతి ప్రధాన మంత్రుల ఏలుబడిలో ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల వాటాలను అమ్ముకోవడం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించక పోగా 338 సంస్థలను టోకుగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి హరించుకు పోతుంది. రిజర్వేషన్లు డొల్లగా మారిపోతాయి. 30 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా 25 లక్షల మంది పనిచేసేవారు. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో.. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, డిజిన్వెస్టుమెంటుతో పోస్టులు రద్దు కావడం వలన ఉద్యోగుల సంఖ్య 75% పైగా తగ్గిపోయింది. ఎల్ఐసీ, బ్యాంకులు, కోల్ మైన్స్, రక్షణ రంగ సంస్థలు, ఎయిర్ లైన్స్, హైవేస్, రైల్వేస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో రిజర్వేషన్ల అమలు వలన సగానికంటే ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల వారు వున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం వలన ప్రభుత్వ రంగ సంస్థలు ఎగిరిపోవడంతో అందరి ఉద్యోగాలతో పాటు బలహీన వర్గాల ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఫలితంగా.. సామాజిక న్యాయం సమసిపోతుంది, అంబేడ్కర్ ఆశయం అంతమవుతుంది. వ్యాసకర్త: నాగటి నారాయణ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు 94903 00577 -
అవసరం మేరకే ఆన్లైన్ విద్య
ప్రస్తుతం పాఠశాల విద్యలో ఆన్లైన్ క్లాసుల అలజడి జరుగుతోంది. దూరవిద్యా విధానంలో కొన్ని రోజులే క్లాస్ రూములో నేర్చుకొని, ఎక్కువ రోజులు ఇంట్లోనే బుక్స్, స్టడీ మెటీరియల్ చదువుకుని, పరీక్షలు వ్రాసి డిగ్రీ, డిప్లమో సర్టిఫికెట్లు పొందుతున్న విషయం చాలా కాలంగా వున్నదే. ఇప్పుడు కొన్ని రోజులు కూడా క్లాసు రూముకి పోకుండా ఇంట్లోనే కూర్చుని, ఏదో ఒక వృత్తి ఉద్యోగంలో వున్నవారు కూడా ఆన్లైన్ చదువుకుంటూ వివిధ రకాల కోర్సులు పూర్తిచేయడం ఉన్నత విద్యలో జరుగుతోంది. కాగా కరోనా వైరస్ భయంతో విద్యారంగంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిస్థితిలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల అలజడి ముందుకొచ్చింది. సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ చాలా రోజుల నుండి జరుగుతోంది. రాష్ట్ర సిలబసుతో నడుస్తున్న కొన్ని పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు కూడా అదే బాట పడుతున్నవి. ఆన్లైన్ పేరుతొ అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నవి. ఫీజుతో పాటు స్మార్ట్ ఫోనులు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, వైఫై, డేటా వంటి అదనపు ఖర్చుల భారం తల్లిదండ్రులపైన పడుతోంది. పాఠం చెప్పడం, నోట్సు రాయించడం, హోమ్ వర్క్ చేయించడం పేరిట ప్రైమరీ క్లాసుల పిల్లలనే రోజుకి 6–7 గంటలు వేధించడం జరుగుతోంది. సెకండరీ క్లాసుల విద్యార్థులు రోజుకి 10–12 గంటలు ఆన్లైన్ అవస్థ పడుతున్నారు. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండడం వలన విద్యార్థులకు కంటి చూపు మందగించడం, నడుము నొప్పి వంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ అభ్యసన జరుగుతున్నంతసేపు తల్లి/తండ్రి లేదా ఎవరో ఒక పెద్ద వారు వారి పనిమానేసి పిల్లలకు తోడుగా ఉండాలి. ఇలాంటి సమస్యలున్నాయని ఇటీవల ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వమే చూడాలని ధర్మాసనం వదిలేసింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఊసే లేదు. కొంతమందికే ఆన్లైన్ విద్య అందుతూ ఎంతోమందికి అలాంటి అవకాశం లేకపోవడం వలన విద్యారంగంలో సరికొత్త విభజన, అసమానత ఉత్పన్నమవుతోంది. ఎకడమిక్ షెడ్యూల్ ప్రకారం జూన్ రెండో వారంలోనే పాఠశాలలు ప్రారంభించాల్సి వుంది. ఆగస్టు 15 దాకా ఆగాలంటే రెండు నెలల కాలం విద్యార్థులు చదువుకోకుండా ఖాళీగా వుండాలంటే కష్టమే. అందువలన అన్లైన్లో విద్యాభ్యాసాన్ని నడిపించాలనే కొన్ని పాఠశాలల కృషిని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలే ఆన్లైన్లో పాఠాలు చెబుతూ సిలబస్ కవర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంటే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్చే అవకాశం వుంటుందని బడ్జెట్ స్కూళ్ల మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు. అందువలన ఆన్లైన్ విద్యాబోధన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నిం టిలోనూ అమలు జరిగే విధానం కావాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ కొంత ప్రయత్నం చేస్తోంది. ప్రాధమిక (1–8) తరగతులకు ఎన్సీఈఆర్టీ రూపొందిం చిన ‘ఆల్టెర్నేటివ్ ఎకడమిక్ కేలండర్‘ని యిటీవల విడుదల చేసింది. సెకండరీ లెవెల్ క్లాసుల కేలండర్ కూడా రావాలి. ఆ కేలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అనువుగా మలుచుకొని అమలుచేయాల్సి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రణాళికను మించి అతిగా వ్యవహరించే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభించాల్సి వున్నందున ఆ మేరకు 30% సిలబసును తగ్గించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నవి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఆన్లైన్ క్లాసుల నిర్వహణ సులభమవుతోంది. పాఠశాలల్లో ఆన్లైన్ బోధనకు అవసరమైన సాధనాలు, సదుపాయాలు సమకూర్చుకోవాలి. అందుకోసమనే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు రూ 5–10 వేలు ఫీజులు వసూలు చేస్తున్నవి. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్సుతో పాటు ట్యాబ్స్ అమ్ముతున్నవి. ఫీజు చెల్లించకపోయితే ఆన్ లైన్ కనెక్షన్ యిచ్చేది లేదని బెదిరిస్తున్నవి. స్కూల్లో అమ్మే ట్యాబ్ కొనలేకపోయినా ఇంట్లో సిస్టం లేదా ల్యాప్ ట్యాప్ లేదా స్మార్ట్‌ఫోన్ వుండాలి. ఇంట్లో పాఠశాల విద్యార్థులు ఇద్దరుంటే రెండేసి ఉండాలి. ఆన్లైన్లో చెప్పే పాఠాలు స్పష్టంగా చూడాలంటే 50 ఎంబీపిఎస్ నెట్ వర్క్, 500 జీబీ సామర్ధ్యం గల స్మార్ట్‌ఫోన్ వుండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఒక క్లాసుకి ఒక జీబీ చొప్పున రోజుకి ఎన్ని క్లాసులు చూస్తే అన్ని జీబీలు ఖర్చవుతుంటది. అలాంటి ఏర్పాట్లు చేసుకుని అదనపు ఖర్చు భరిం చినా పట్నాల్లో పల్లెల్లో ఆన్లైన్ క్లాసులతో బోధనాభ్యాసన అరకొరగానే ఉండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 41%, గ్రామీణ ప్రాంతాల్లో 12% మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో వుంటుందన్న విషయం తెలిసిందే. ఈ అసాధారణ పరిస్థితిలో అవసరమైన మేరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, అజీమ్ ప్రేమ్‌జీ లాంటి సంస్థలు సూచించినట్లుగా 3–5 తరగతుల విద్యార్థులకు వారానికి 4 గంటలు, 6–8 తరగతుల వారికి 7 గంటలు, 9–12 తరగతులకు 10 గంటలు సమయమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. ఎల్కేజీ, యూకేజీ, 1–2 తరగతుల పిల్లలకు ఆన్లైన్ క్లాసులను నిషేధించాలి. పాఠశాల సమయాల్లోనే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలి. ఆన్లైన్ పాఠాలు అందుబాటులో లేని వారికి రికార్డ్ చేసిన పాఠాలను వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు లేదా ట్యాబులు మరియు అవసమైన డేటా కార్డులు ప్రభుత్వమే అందించాలి. జూలై 15 నుండి నాలుగు వారాలకైనా ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఏదేమైనా పాఠశాలలు ప్రారంభించే వరకు విద్యార్థులు ఎకడమిక్ విషయాలతో మమేకం కావడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషి సమన్వయం పెరగాల్సిన అవసరం ఉన్నది. వ్యాసకర్త: నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త మొబైల్ : 94903 00577 -
కోటా రక్షణకు పటిష్ట చట్టం
దళిత, గిరిజన సామాజిక తరగతుల సంక్షేమానికి సంబంధించిన రిజర్వేషన్లపై తరచుగా వివాదాలు, వాదో పవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య పదవు ల్లోని రిజర్వేషన్ల కంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే ఆందోళనకర, ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి. ప్రజా ప్రాతినిధ్య పదవుల్లో కొందరు దళిత, గిరిజన నాయకులు ఉండడం కంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్లే ఎంతోకొంత సామాజిక న్యాయం నెరవేరుతోంది. అందువల్లనే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే అస హనం, కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నవి. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాదిలోపే ఎస్సీ, ఎస్టీలకు లభిస్తున్న విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషనుపై హైకోర్టు, సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చొర వతో రాజ్యాంగం ఆర్టికల్ 15కి చేసిన సవరణతో మొదటి ప్రమాదం తప్పింది. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో కూడా వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుల వలన మరికొన్నిసార్లు రాజ్యాంగానికి స్వల్పమైన సవరణలు చేయాల్సివచ్చింది. కాగా జార్ఖండ్ ప్రభుత్వం 2012లో కొన్ని ఉద్యోగ ఖాళీలను రిజర్వేషన్లు పాటించకుండా యిచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ ఈనెల ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుతో రిజర్వేషన్లు మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని 2012 సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను వినోద్ కుమార్ మరో ఇద్దరు ఎస్సీ తరగతికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్ర హైకోర్టులో చాలెంజ్ చేయడం జరిగింది. దానిపైన తీర్పు చెప్పిన హైకోర్టు పదోన్న తుల్లో రిజర్వేషన్లు పాటించాలా అక్కర్లేదా అనేది నిర్ణయించడానికి సదరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా సామాజిక తరగతుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉన్నదనే విషయమై నాలుగు నెలల్లో సమాచారం సేకరించాలని, దాని ఆధారంగా ప్రాతినిధ్యం తక్కువగా వున్న సామాజిక తరగతుల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తీర్పులో ఒక ముఖ్యమైన విషయం ఇమిడివుంది. రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అనే ప్రశ్నలకు కూడా అది సమా ధానం కావచ్చు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు అంటూ ఇచ్చిన తీర్పుతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. ఇరువురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పు సారాంశం ఇలా ఉంది. పబ్లిక్ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్ కోరడానికి ఎవరికీ ప్రాథమిక హక్కేమీ కాదు. రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారం. రాజ్యాంగం ఆర్టికల్ 16(4) మరియు ఆర్టికల్ 16(4ఏ) ఆధారంగా ఈ తీర్పు చెప్పాల్సి వస్తుందని న్యాయ మూర్తులు చెప్పారు. ఆర్టికల్ 16(4)– ప్రభుత్వ సర్వీసుల్లో వెనకబడిన తరగతుల ప్రాతినిధ్యం తగినంత లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సంబంధిత తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 16(4ఏ)– ప్రభుత్వ సర్వీసుల్లోని ఏ తరగతి పోస్టులకైనా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తరగతుల వారికి ప్రమోషన్లలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఏదేమైనా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్ల ప్రయోజనం ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. సహజంగానే దీనిపైన రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు తమ వంతు ఆందోళన వ్యక్తం చేసినవి. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ సున్నితమైన రిజర్వేషన్ల విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని నిందించారు. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ సమ స్యకు సరైన పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తుంది అని ప్రకటించారు. కాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర ఆజాద్ ఈ తీర్పును సమీక్షిం చాలని కోరుతూ ఫిబ్రవరి 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. మరికొంతమంది కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతున్నారు. రాజ్యాంగం ఆర్టికల్స్ 16(4) మరియు 16(4ఏ)లోని పదాలు అలాగే ఉన్నంత కాలం ధర్మాసనాలు మారినా రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉంటుందని ఆశించలేము. జ్యుడీషియరీ ఉన్నత స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రాతినిధ్యం వుంటే మంచిదే, కానీ ఒకరో ఇద్దరో ఉన్నంత మాత్రాన సానుకూల తీర్పులు వస్తాయని ఆశించలేము. ఒకవేళ వచ్చినా పక్షపాతంగా యిచ్చారని ఆక్షేపించే అవకాశమూ ఉంటుంది. కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల సామాజిక రిజర్వేషన్ల రక్షణకు స్పష్టమైన చట్టం అనివార్యం, అత్యవసరం. నాగాటి నారాయణ: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 94903 00577 -
నకిలీ విద్యార్హతలు అవినీతి కాదా?
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఎక్కడ మాట్లాడినా పురాతన విషయాలనే ప్రచారం చేస్తున్నారు. మే 30న మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే విద్యారంగంలో హిందుత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయడానికే ఆయన్ను నియమించినట్లు తెలిసిపోయింది. అప్పటి నుండి అయన అదే పనిలో ఉన్నారు కూడా. గత ఆగస్టు పదో తేదీన బాంబే ఐఐటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ‘ఆయుర్వేద ఆద్యుడు చరకుడే అణువు, కణమును కనిపెట్టాడని, కానీ వాటిని కనిపెట్టింది గ్రీకు తత్వవేత్త డెమోక్రిటిస్ అని పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నార’ని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఆగస్టు 27న ఖరగ్‌పూర్ ఐఐటీ స్నాతకోత్సవ సభలో చేసిన ప్రసంగంలో ‘ప్రపంచంలో మొదటి భాష సంస్కృతమేనని, కాదని ఎవరైనా అనగలరా’ అని సవాల్ చేశారు. ‘సంస్కృతం శాస్త్రీయ భాష అయినందున భవిష్యత్తులో మాట్లాడే కంప్యూటర్లు అంటూ వస్తే అవి సంస్కృత భాషలోనే అని సెలవిచ్చారు. వేదాల కంటే మొదటి గ్రం«థం ఇంకేదైనా ఉందని ఎవరైనా చెప్పగలరా’ అని కూడా ప్రశ్నించారు. ‘శ్రీలంకకు సముద్రంపైన రామసేతు నిర్మించిందెవరు? అమెరికా, బ్రిటన్ ఇంజనీర్లా? భారతీయ ఇంజనీర్లే అని చెప్పాలి కదా. ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేసి రుజువు చేయాల్సిన బాధ్యత ఐఐటీయన్లదేన’నీ కర్తవ్యబోధ కూడా చేశారు. ఆగస్టు పదహారున ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతీ ఉత్తాన్ న్యాస్’ నిర్వహించిన జ్ఞానోత్సవ్ కార్యక్రమంలో సైన్స్ టెక్నాలజీలో మనమే ఫస్ట్ అన్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ కంటే ముందు మన దేశంలోనే కనిపెట్టారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి పోఖ్రియాల్ విద్యార్హతల విషయం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రిగా చేసిన ప్రమాణ పత్రంలో ‘డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్‘ అని పేర్కొనడం తప్పు అని, అందువలన అయన ప్రమాణాన్ని రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ రెబెల్ లీడర్ మనోజ్ వర్మ రాష్ట్రపతి రామనాథ్ కోవిందుకి ఆగస్టు 27న ఫిర్యాదు చేశారు. ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్, కొలంబో’ నుండి పొందినట్లు హరిద్వార్ నియోజకవర్గం నుండి పోటీకి సమర్పించిన అఫిడవిట్లో రాసుకున్న ‘డాక్టరేట్’ ఫేక్ (నకిలీ) అని వర్మ తన ఫిర్యాదులో ఆరోపిం చాడు. అది పోఖ్రియాల్‌ని బదనాం చేయాలనే దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ మాత్రమేనని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తున్నా.. దానికి రుజువులున్నాయని వర్మ సవాల్ చేస్తున్నాడు. ఆ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ, డిప్లమాలకు గుర్తింపు లేదని శ్రీలంక యూజీసీనే ప్రకటించిందని, అసలా యూనివర్సిటీని భారత ప్రభుత్వం గుర్తించలేదని వాదించాడు. అంతేకాదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హేమవతీ నందన్ బహుగుణ యూనివర్సిటీ నుండి పొందినట్లు పోఖ్రియాల్ పేర్కొన్న ఎమ్.ఏ. డిగ్రీ కూడా నమ్మదగింది కాదని గతంలో రాజేష్ మధుకాంత్ అనే అతను సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టే ప్రయత్నం చేసిన విషయాన్నీ ప్రస్తావించాడు. ఆ విషయంలో 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఆర్డర్ వేసినా సమాధానం రాలేదనే విషయాన్ని గుర్తుచేశాడు. అవిగాకపోయినా, కేంద్ర విద్యామంత్రికి ఇంకా నాలుగు డిగ్రీలు ఉన్నట్లు ఎంహెచ్ఆర్డీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరించినట్లు ’ది ప్రింట్’ వెబ్ పేపర్ పేర్కొన్నది. ఒకవైపు దేశమంతటా అలజడి రేపుతున్న వివిధ యూనివర్సిటీల పేరుతొ వెలువడుతున్న నకిలీ సర్టిఫికెట్ల సమస్యపై విచారణ కమిటీ వేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆగస్టు 30న యూజీసీని కోరింది. మరోవైపు విద్యామంత్రి సర్టిఫికెట్లే వివాదంగా మారాయి. అధికారంలో ఉన్నవారిపై వచ్చే ఆర్థిక నేరారోపణలు అలా పక్కనపెట్టండి.. నకిలీ విద్యార్హతలు కలిగి ఉండడం అవినీతి కాదా అనే ప్రశ్నకూడా సమంజసమైందే. విద్యామంత్రి విద్యార్హతలే వివాదంగా మారితే దేశంలో నకిలీ సర్టిఫికెట్ల దందా బంద్ అవుతుందని ఆశించగలమా? వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
‘ప్రైవేట్’ చదువుకు పట్టం
అభివృద్ధికి కీలకమైన విద్యారంగాన్ని విస్మరించడం వలనే మానవాభివృద్ధి సూచికల్లో భారతదేశం, తెలంగాణ రాష్ట్రం బాగా వెనకబడిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ 2018 అక్టోబరులో ప్రకటించిన మానవ మూలధనం సూచికల్లో 157 దేశాల్లో భారతదేశం 115వ స్థానంలోనే వుండిపోయింది. పొరుగు దేశాలైన శ్రీలంక 72, నేపాల్ 102, బంగ్లాదేశ్ 106, మయన్మార్ 107 స్థానాల్లో ఉన్నాయి. అక్షరాస్యతలో, విద్యాభివృద్ధిలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 28వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదికల్లో ఉన్నది. ఆర్థ్ధికాభివృద్ధిలో దేశం, రాష్ట్రం దూసుకు పోతున్నట్లు పాలకులు గొప్పలు పోతున్నా విద్యారంగంలో అవమానకరమైన పరిస్థితి కనిపిస్తోంది. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అందరికీ సమాన విద్య అందించాల్సిన లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఆ పని ఐదేళ్లలోనే చేసి చూపిస్తామన్న బీజేపీ/ఎన్డీయే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. 2015 మార్చిలో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొన్ని థీమ్స్ ప్రకటించి, అదే సంవత్సరం అక్టోబరులో రిటైర్డ్ కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని ప్రధాని మోదీ నియమించారు. ఇచ్చిన గడువులోగా కమిటీ రిపోర్ట్ ఇచ్చినా, అది ప్రభుత్వానికి నచ్చకపోవడం వలన బహిరంగ పరచలేదు. పైగా ‘విద్యా విధానం ముసాయిదా కోసం కొన్ని ఇన్పుట్స్’ పేరుతో మరో చర్చాపత్రం ఎంహెచ్ఆర్డీ వెబ్సైటులో పెట్టింది. ముసాయిదా పత్రం తయారీ కోసమంటూ ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ కమిటీని నియమించారు. విద్యావిధానం విషయంలో రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వ పనితీరు కూడా కేంద్రం లాగే వుంది. టీఆర్ఎస్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ‘అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించినప్పుడే పేదపిల్లలు చదువుకోవడానికి వీలవుతుంది. ఆ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించే విధంగా నూతన విధానాన్ని అవలంబిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇంతవరకు అలాంటి ఊసే లేదు. కేజీ టు పీజీ విద్యా మిషన్ పేరుతో 520 గురుకులాలు ఏర్పాటు చేసి, వాటిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. కానీ 24లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రైవేట్ విద్యావ్యాపారాన్ని నియంత్రించే ఫీ రెగ్యులేషన్ ఉత్తర్వులు నెల రోజుల్లోనే ఇస్తామని, ఇవ్వలేక పోయింది. ఫీ రెగ్యులేషన్ కోసం ప్రొఫెసర్ టీ. తిరుపతి రావు కమిటీ ఇచ్చిన నివేదికను కూడా బైట పెట్టలేదు. దేశంలో సత్వర విద్యాభివృద్ధి కోసం కేంద్ర బడ్జె టులో పది శాతం చొప్పున, రాష్ట్రాల బడ్జెట్లలో ఇరవై శాతం చొప్పున విద్యారంగానికి నిధులు కేటాయించా లని 1958 లో బి.జి.ఖేర్ కమిటీ చేసిన సిఫార్సు గానీ, జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆరుశాతం నిధులను విద్యకు వెచ్చించాలని 1968 లో డి.ఎస్.కొఠారి కమిషన్ చేసిన రికమండేషన్ గానీ ఇంతవరకు అమలు కాలేదు. కాగా గడచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో విద్యారంగం వాటా ఆయేటికాయేడు క్షీణించింది. తొలి (2014–15) బడ్జెట్లో విద్యారంగానికి రూ. 1,10,351 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం, తదుపరి సంవత్సరాల్లో తగ్గిస్తూ చివరి (2019–20) బడ్జెట్లో రూ. 93,848 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో విద్యారంగం వాటా 6.15 శాతం నుండి 3.30 శాతంకి తగ్గిపోయింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ) రూ. 24,430 కోట్లు అడిగితే గతేడాది ఇచ్చిన రూ. 2,750 కోట్లు కంటే తక్కువగా రూ. 2,100 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాబై శాతం పైగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం తొలి బడ్జెట్లో విద్యారంగం వాటా 10.88 శాతం ఉండగా చివరి బడ్జెట్లో 6.71 శాతానికి దిగజారింది. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ప్రైవేట్ విద్యావ్యాపారం విస్తరించింది. గడచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కోటి ముప్పై లక్షల మంది విద్యార్థులు తగ్గిపోగా, ప్రైవేట్ స్కూళ్లలో కోటి డెబ్బై లక్షల మంది పెరిగారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 52% బడి పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నారు. గత నాలుగేళ్లలో విద్యార్థుల సంఖ్య సర్కార్ బడులలో 65 వేలు క్షీణించి, ప్రైవేట్ స్కూల్సులో 1.20 లక్షలు పెరిగినట్లు కాగ్ రిపోర్టు పేర్కొంది. ఉన్నత, వృత్తి విద్యల్లోని విద్యార్థుల్లో 80%పైగా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే ఉన్నారు. కేంద్రప్రభుత్వ అసంబద్ధ చర్యలతో విద్యారంగంలో వినాశకర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఐదు, ఏడు తరగతుల్లో డిటెన్షన్ విధానం తేవటం వలన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. రైతుల పేదరికాన్ని, దళితుల దయనీయ స్థితిని వివరించే చారిత్రక పాఠాలను సిలబస్ నుంచి తొలగిస్తూ విద్యార్థులు చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు తెలుసుకోకుండా చేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలలో ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందిన వారినే నియమిస్తూ విద్యారంగంలో లౌకిక పునాదులను పెకి లించి వేస్తోంది. భారతీయ శిక్షా బోర్డ్ పేరుతో వేద విద్య కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి యోగా గురువైన బాబా రాందేవ్‌కి దానిని అప్పగిస్తోంది. విద్యలో ఫెయిలైన ప్రభుత్వాలను డిటెయిన్ చేస్తేనే విద్యారంగానికి మేలు జరుగుతుంది. -నాగటి నారాయణ nagati1956@gmail.com -
లౌకిక విలువలు లోపించిన విద్యారంగం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతానికి చెందిన సంస్కృత శ్లోకాలు చెప్పించటాన్ని సవాల్ చేస్తున్న ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (íపీఐఎల్) సుప్రీంకోర్టులో 2018 జనవరి నుండి విచారణలో ఉంది. విషయ ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ పిటిషన్‌ని విచారిస్తున్న జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా ఈ ఏడాది జనవరి 28 న తీర్మానించారు. ఈ నేపథ్యంలో లౌకిక రాజ్యం, అందులో విద్యారంగం పాత్రను పరిశీలించాలి. లౌకిక రాజ్యంలో అధికారిక మతం అనేది ఉండదు. ప్రభుత్వం ఏ మతానికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ వ్యవహరించకూడదు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల తటస్థంగా ఉండాలి. ఏ మతానికీ ప్రాధాన్యత గానీ, ప్రోత్సాహం గానీ, అవకాశం గానీ కల్పించకూడదు. సెక్యులర్ స్టేట్స్‌గా చెప్పుకుంటున్న భారత్ వంటి కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో ఆయా దేశాల్లోని మతాచారాలు పాటించడం, మతాల అవసరాలు తీర్చడం జరుగుతోంది. మరోవైపు సెక్యులర్ విలువలను పాటించాలనే ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ నివాసి అడ్వకేట్ వినాయక్ షా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు. ఆయనే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశారు. పాఠశాల ప్రార్ధనా సమయంలో విద్యార్థులతో అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగ మయా, ఓం శాంతి శాంతి శాంతిః అనే బృహదారణ్యక ఉపనిషత్తులోని శ్లోకాన్ని చెప్పిస్తున్నారు. అది విద్యార్థుల్లో మత విశ్వాసాన్ని చొప్పించటమేనని, శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందనీ, రాజ్యాంగం ఆర్టికల్ 28 (1)కి విరుద్ధమైందనీ అందువలన ఆ పద్ధతిని నిషేధించాలని షా కోరారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ఏ మతానికి సంబంధించిన విషయాలనూ బోధించకూడదని రాజ్యాంగ ఆదేశం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయాల సిలబస్, యూనిఫామ్, ప్రార్ధన, ఎకడమిక్ కేలండర్ ఒకే విధంగా ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాల వలెనే కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా అలాంటి ప్రార్ధనలే చేయిస్తున్నారు. అంతర్లీనంగా ఇక్కడా హిందూ మత ప్రచారం కూడా జరుగుతుందని ఆ పాఠశాలలో చదివిన అలోకానంద బిసోయ్ ఇటీవల ’యూత్ కీ ఆవజ్.కామ్’ అనే ఆన్ లైన్ పత్రికలో వ్రాశారు. భోజనం చేసే ముందు క్రిష్ణ యజుర్వేద తైత్తరీయ ఉపనిషత్తులోని శ్లోకం చెప్పిస్తారు. పాఠశాల ప్రారంభ సమయంలో జరిగే ప్రార్ధనలో రోజుకో విద్యార్ధితో మైకులో నేటి సూక్తి పేరుతో భగవద్గీత లేదా వేదాల్లోని ఒక శ్లోకాన్ని, దాని అర్ధాన్ని చెప్పిస్తారు. మిషనరీ స్కూల్సులో క్రైస్తవ మతం గురించి, మదర్సాల్లో ఇస్లాం మతం గురించి చెబుతున్నట్లు ఎప్పుడైనా పత్రికల్లో వార్తలు వస్తే అదేమి పని అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అవి ప్రైవేట్ యాజమాన్యంలోని కొద్దిమంది విద్యార్థులు ఉండే పరిమిత సంఖ్యలోని పాఠశాలలు. ముస్లిం విద్యార్థుల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే మదర్సాల్లో చదువుతున్నట్లు సచార్ కమిటీ నివేదిక పేర్కొన్నది. కానీ 13 కోట్ల మంది విద్యార్థులు చదివే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల్లో జరుగుతున్న హిందూమత ప్రచారం గురించి ప్రశ్నించరేమి అని బిసోయ్ అడుగుతున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా హిందూమత ఆచారాలు, పద్ధతులు పాటించడం జరుగుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాల్లో మహాత్మాగాంధీ ఫొటోకి కుంకుమబొట్లు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, అగరొత్తులు వెలిగించడం చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాల్లో కూడా భోజన సమయంలో ఓం శాంతి శ్లోకాలు చెప్పిస్తారు. వినాయక చవితి రోజుల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేయడం కూడా కొన్ని స్కూల్స్, హాస్టల్సులో జరుగుతోంది. మధ్యప్రదేశ్, హరియాణా తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులతో ఉదయం సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు చేరుస్తున్నారు. మహారాష్ట్రలోని కాలేజీల్లో భగవద్గీత పుస్తకాలు పంచి పెట్టారు. అన్నిటికీ మించి సైన్స్ కాంగ్రెస్ సభల్లోనే ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రులు, వైస్ చాన్స్లర్లు రామాయణం, మహాభారతం గురించి కీర్తిం చడం తెలిసిందే. రాజ్యాంగ ఆదేశమైన లౌకిక విలువలను విద్యార్ధి దశ నుండే నేర్పాలి. మతాచారాలు, పద్ధతులను నిరుత్సాహపర్చాలి. మత సంబంధిత పాఠాలను నిషేధించాలి. ఈ పని చేయగలిగే అవకాశం అందరికంటే ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉంటుంది. వినాయక్ షా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చే తీర్పు విద్యారంగంలో లౌకిక రాజ్యం పునాదులను బలపర్చటానికి తోడ్పడాలని ఆశించాలి. నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
ముంపు ప్రాంత ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలి
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశం ఇచ్చి, వారి ఇష్ట ప్రకారం వెళ్లే సదుపాయం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగటి నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు ప్రాంతాలతోపాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఆప్షన్ ప్రకారం వెళ్లే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేంద్రం స్కేలు, స్థానిక ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు, మండల విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేసి విద్యారంగ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అత్యంత తక్కువ వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేసిందని, రాబోయే ప్రభుత్వమైనా స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఫైళ్లు క్లియర్ చేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహారావు మాట్లాడుతూ విద్యావికాస ఉద్యమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా జూన్ 1 నుంచే నమోదు కార్యక్రమాల్లో ఉండాలని తెలిపారు. సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. టీఎస్ యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కల్యాణం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు సీహెచ్.దుర్గాభవాని, జిల్లా కోశాధికారి జె.రాంబాబు, బి.రాందాస్, కాార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పి.కిష్టయ్య, ఎస్కె.మహబూబ్అలి, ఎ.రమాదేవి, బాలు, టి.ఆంజనేయులు, ఎం.నరసింహారావు, ఎస్కె.ఉద్దండు షరీఫ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.