
కవాడిగూడ/ఖమ్మం సహకారనగర్/బోనకల్: ఉపాధ్యాయ ఉద్యమ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ(66) సోమవారం కన్నుమూశారు. నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న నారాయణ నిమ్స్‌లో చికిత్స పొంది డిశ్చార్జయ్యా రు. నగరంలోని మధురానగర్‌లో ఉంటున్న ఆయన ఉద యం వాకింగ్‌కు వెళ్లి వచ్చి అయాసంగా ఉందంటూనే కుప్పకూలారు.
కుటుంబసభ్యులు నిమ్స్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్ద బీరవల్లిలో 1956 డిసెంబర్ 4న నారాయణ జన్మించారు. ఖమ్మం జిల్లా లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడి గా, ప్రధాన కార్యదర్శిగా, 2000 నుంచి 2010 వరకు యూటీఎఫ్ ఉమ్మడి ఏపీ ప్రధాన కార్యదర్శిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధనలో కీలక భూమిక పోషించారు. అప్రెంటిస్ రద్దు, స్పెషల్ విద్యావలంటీర్ల రెగ్యులరైజేషన్ కోసం పోరాడి విజ యం సాధించారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇప్పించేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. 2013లో ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. నారాయణకు భార్య సంధ్యారాణి, ఇద్దరు కూతుళ్లు అక్షర, సౌమ్యశ్రీ ఉన్నారు.
నారాయణ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం దోమలగూడలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సంఘం నేతలు జంగయ్య, చావా రవి, మాణిక్‌రెడ్డి, మస్తాన్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం పెద్ద బీరవల్లికి తరలించారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment